యువకుని ఆత్మహత్యాయత్నం.. సర్పంచ్ భర్త వేధింపులే కారణం..

by Sumithra |
యువకుని ఆత్మహత్యాయత్నం.. సర్పంచ్ భర్త వేధింపులే కారణం..
X

దిశ, కామారెడ్డి రూరల్ : రిజర్వేషన్ తో ఓ మహిళ సర్పంచ్ గా ఎన్నికైనప్పటికీ ఆమె భర్త అన్నీ తానై వ్యవహరిస్తూ అధికారిక, అనధికారిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ఆ గ్రామంలో షాడో సర్పంచ్ గా వ్యవహరిస్తున్నాడు. ఇదేమిటని ఆ గ్రామంలో ఎవరైనా నిలదీస్తే వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు. ఇలాంటి సంఘటనలోనే ఇటీవల గ్రామానికి చెందిన ఓ యువకుడు సర్పంచ్ భర్తను నిలదీసినందుకుగాను అతను పోలీస్ స్టేషన్, అటవీశాఖ కార్యాలయాల్లో ఫిర్యాదు చేసినట్లుగా గ్రామస్తులు తెలిపారు.

దీంతో మనస్థాపం చెందిన సదరు యువకుడు ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కామారెడ్డి మండలం శాబ్దిపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, బాధితుడి కుటుంబీకుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శాబ్దిపూర్ గ్రామానికి చెందిన నాయిని స్వామి (23) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా బాధితుడు తల్లి నరసవ్వ మాట్లాడుతూ... పస్తం యాదమ్మ గ్రామసర్పంచ్ అయినప్పటికీ ఆమె భర్త పరశురాం అన్నిట్లో తల దూరుస్తూ గ్రామంలో అరాచకాలు చేస్తున్నాడని తెలిపారు.

ఆయనకు ఎదురుగా ఎవరైనా మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని పేర్కొన్నారు. మా కుటుంబీకులపై ఇటీవల పోలీస్ స్టేషన్ అటవీశాఖ కార్యాలయాల్లో సర్పంచ్ భర్త కేసులు పెట్టించి బెదిరింపులకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలోనే తన కొడుకు మనస్థాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పోలీసులు స్పందించి సర్పంచ్ భర్త పరశురాంపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed