- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నకిలీ కన్సల్టెన్సీ గుట్టురట్టు
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: భారీ మొత్తాల్లో డబ్బు తీసుకుంటూ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఉద్యోగార్థులను అమెరికా పంపిస్తున్న నకిలీ ఇమ్మిగ్రేషన్కన్సల్టెన్సీ నిర్వాహకులను ఎల్బీనగర్ ఎస్వోటీ అధికారులు, నేరెడ్మెట్ పోలీసులతో కలిసి అరెస్టు చేశారు. నిందితుల నుంచి తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులుగా తయారు చేసిన 16 నకిలీ గుర్తింపు కార్డులు, 5 పాస్‌పోర్టులు, వేర్వేరు బ్యాంకులకు చెందిన 279 చెక్కులు, నకిలీ ఇన్విటేషన్ లెటర్లు, యాక్సిస్ బ్యాంక్ నుంచి జారీ అయిన అమెరికా వీసా ఫీజు రిసిప్టులు, బ్యాంకు లెటర్లు, ఒక కంప్యూటర్, ఒక ల్యాప్‌టాప్, కలర్ ప్రింటర్‌తో పాటు నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు 18వేల రూపాయల నగదును సీజ్‌చేసి వేర్వేరు బ్యాంకు అకౌంట్లలో ఉన్న 7లక్షల రూపాయలను ఫ్రీజ్‌చేశారు. రాచకొండ పోలీస్‌కమిషనర్ డీ.ఎస్.చౌహాన్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
మచ్చబొల్లారం స్రవంతి నగర్ నివాసి గార్లపాటి వెంకటదుర్గ నాగేశ్వర సిద్దార్థ (38) ఆరేళ్ల క్రితం సికింద్రాబాద్ప్రాంతంలో ఆంథోనీస్ ఇమ్మిగ్రేషన్స్ పేర కన్సల్టెన్సీ ఆఫీస్ తెరిచాడు. ఓల్డ్అల్వాల్నివాసి అయిన ఎన్.ప్రభాకర్‌రావు (48) సహాయంతో దీనిని నడుపుతున్నాడు. ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న బోడుప్పల్ వెంకట్‌రెడ్డి నగర్ నివాసి జీ.నాగరాజు (33) తదితరులతో సహాయంతో అక్రమ దందాకు తెర లేపాడు. వాస్తవానికి అమెరికాలో నివాసముంటున్న భారతీయ భార్యాభర్తలు తమ బంధువులను రప్పించుకోవటానికి పంపించే స్పాన్సర్ షిప్ లెటర్లను సంపాదిస్తున్న నాగేశ్వర సిద్దార్థ్ తన వద్దకు అమెరికాలో ఉద్యోగం చేయాలన్న కోరికతో వచ్చిన వివరాలను వాటిల్లో పొందుపరిచి నకిలీ స్పాన్సర్ షిప్ లెటర్లు తయారు చేసేవాడు. దాంతో పాటు తనను ఆశ్రయించిన వారు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులని నకిలీ గుర్తింపు కార్డులు రూపొందించేవాడు.
ఈ కార్డులను చూసిన అమెరికన్ కాన్సులేట్ సిబ్బంది అమెరికా వెళుతున్నవారు తమ బంధువులతో కొన్నాళ్లు గడిపి తిరిగి వచ్చేస్తారని నమ్మి వీసాలు మంజూరు చేసేవారు. అంతకు ముందు నాగేశ్వర సిద్దార్థ తనకు పరిచయం ఉన్న ఫైనాన్స్ వ్యాపారి నాగరాజుతో ఉద్యోగార్థులను కలిపేవాడు. ఇక, రోజుకు 1.5 శాతం వడ్డీ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుని నాగరాజు అమెరికా వెళ్లాలనుకునే వారి పేర నేరెడ్మెట్ డిఫెన్స్ కాలనీలో ఉన్న జాగృతి కో–ఆపరేటీవ్ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్‌లో ఖాతాలు తెరిచి వాటిల్లో 40 నుంచి 50 లక్షల రూపాయలు డిపాజిట్లుగా పెట్టేవాడు. ఇక, కాన్సులేట్ సిబ్బంది ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? ఎలాంటి జవాబులు చెప్పాలి? అన్నదానిపై సిద్దార్థ నాగేశ్వర తన వద్దకు వచ్చిన వారికి అవగాహన కల్పించేవాడు. వీసా మంజూరు కాగానే మూడున్నర నుంచి నాలుగు లక్షల రూపాయలు వసూలు చేసేవాడు. దీనికి ముందు ప్రాసెసింగ్ ఫీజు పేర లక్షన్నర రూపాయలు తీసుకునేవాడు.
ఇలా దాదాపు అరవై మందిని అమెరికన్ కాన్సులేట్లో జరిగే ఇంటర్వూలకు పంపించానని, వీరిలో పదిమంది అమెరికాకు వెళ్లి ఉద్యోగాల్లో స్థిరపడ్డారని విచారణలో నాగేశ్వర సిద్దార్థ వెల్లడించినట్టు కమిషనర్ డీ.ఎస్.చౌహాన్ చెప్పారు. నిజామాబాద్ జిల్లా బుస్సాపూర్ గ్రామానికి చెందిన జక్కుల నాగేశ్వర్(45) ఇలాగే అమెరికా వెళ్లటానికి నాగేశ్వర సిద్దార్థను ఆశ్రయించగా అతని పేర తెలంగాణ ఇరిగేషన్ శాఖలో పని చేస్తున్నట్టు నకిలీ గుర్తింపు కార్డు తయారు చేశాడు. కాగా, నాగరాజ సిద్దార్థ చేస్తున్న ఈ దందా గురించి సమాచారం అందుకున్న ఎల్బీనగర్ఎస్వోటీ అధికారులు, నేరెడ్మెట్ పోలీసులతో కలిసి కన్సల్టెన్సీపై దాడి చేసి నిందితులను అరెస్టు చేశారు. నిందితులను అరెస్టు చేసిన మల్కాజిగిరి డీసీపీ జానకి, ఎస్వోటీ డీసీపీ మురళీధర్, ఇన్స్పెక్టర్ సుధాకర్ తదితరులను కమిషనర్ అభినందించారు.