Haryana: ఆస్తి కోసం అమానుషం.. కన్నతల్లిని బంధించి చిత్రహింసలు.. వీడియో వైరల్

by D.Reddy |   ( Updated:2025-03-02 10:16:42.0  )
Haryana: ఆస్తి కోసం అమానుషం.. కన్నతల్లిని బంధించి చిత్రహింసలు.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: కనిపెంచిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బిడ్డలే కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. ఆస్తి కోసం అమ్మ నాన్నలు అని కూడా చూడకుండా చిత్రహింసలకు గురిచేస్తున్నారు. జన్మనిచ్చారనే మమకారం కూడా చూపకుండా వికృత రూపాన్ని బయటపెడుతున్నారు. తాజాగా ఇలాంటి దారుణ ఘటననే హర్యానా రాష్ట్రంలో (Haryana) చోటుచేసుకుంది. ఓ కూతురు ఆస్తికోసం తల్లిని దారుణంగా కొడుతూ చిత్రహింసలకు గురి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media) వైరల్ (Viral) అవ్వగా విషయం వెలుగులోకి వచ్చింది.

హర్యానాలోని హిసార్‌ పట్టణంలో జరిగిన ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆజాద్ నగర్‌లోని మోడరన్ సాకేత్ కాలనీలో రీటా అనే మహిళ నివాసం ఉంటుంది. సదరు మహిళ ఆస్తి కోసం తన తల్లి నిర్మలా దేవిని వృద్ధురాలు అని కూడా చూడకుండా దారుణంగా దాడి చేసింది. బెడ్ మీద కూర్చొబెట్టి.. కొడుతూ, రక్కుతూ, నోటితో కొరుకుతూ నానా చిత్రహింసలకు గురిచేసింది. తల్లి ఏడుస్తూ రెండు చేతులూ జోడించి వేడుకుంటోన్న ఏమాత్రం కనికరించకుండా నీచంగా ప్రవర్తించింది. 'ఆస్తి రాసివ్వకుంటే నా చేతిలో చస్తావ్‌.. కొరికి నీ రక్తం తాగుతా' అని తల్లిని బెదిరించడం వీడియోలో చూడొచ్చు.

ఈ వీడియో వైరల్‌గా మారడంతో వృద్ధురాలి కుమారుడు అమర్ దీప్ సోదరి రీటాపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండేళ్ల కిందట వివాహమైన రీటా భర్తతోపాటు పుట్టింటికి చేరి తల్లిని నిర్బంధించి హింసిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. కురుక్షేత్రలో ఉన్న ఆస్తి విక్రయించగా వచ్చిన రూ.65 లక్షలను ఆమె హస్తగతం చేసుకొందని, ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా రాయించుకునేందుకు ఇలా చేస్తున్నట్లు అమర్‌దీప్‌ వివరించాడు. తనను ఇంట్లోకి రానివ్వడం లేదని తెలిపాడు. రీటాపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు మహిళ ప్రవర్తనపై మండిపడుతున్నారు. అలాంటి వారిని కఠిన శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story