ఏటీఎం సెంటర్ల నుంచి రూ. 62 లక్షలు చోరీ

by Javid Pasha |
ఏటీఎం సెంటర్ల నుంచి రూ. 62 లక్షలు చోరీ
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఏటీఎం మిషన్లలో డబ్బు నిల్వ చేయాల్సిన ఉద్యోగే దొంగతనానికి పాల్పడ్డ ఉదంతమిది. ఆఫీస్​లోని కంప్యూటర్​నుంచి పాస్​వర్డులు తస్కరించి 62 లక్షల డెబ్భయి తొమ్మిదివేల రూపాయలను దోచుకున్నాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్​జిల్లా గీసుకొండ మండలం మొగిలిచెర్ల గ్రామానికి చెందిన పీ.ప్రణయ్​కుమార్​(25), డీ.క్రాంతికుమార్​(32) ప్రస్తుతం హైదరాబాద్​లోనే ఉంటూ సికింద్రాబాద్​లోని సెక్యూర్​వాల్యూ ఇండియా లిమిటెడ్​అన్న సంస్థలో కస్టోడియన్లుగా ఉద్యోగం చేస్తున్నారు. ఈ సంస్థకు ఉప్పల్ రూట్లోని ఐసీఐసీఐ బ్యాంక్​ఏటీఎం మిషన్లలో డబ్బు డిపాజిట్​చేసే కాంట్రాక్ట్​ఉంది. మామూలుగా డబ్బును ఏటీఎం సెంటర్లలో డిపాజిట్​చేయటానికి పంపించినపుడు ఓ కస్టోడియన్​కు ఏటీఎం మిషన్​తాళంచెవులు, మరో కస్టోడియన్​కు పాస్​వర్డులు ఇచ్చి ఆఫీస్​వాళ్లు పంపిస్తారు. ఈనెల 1న యధావిధిగా ప్రణయ్​కుమార్​ఉదయం 7గంటల ప్రాంతంలో డ్యూటీ నిమిత్తం ఆఫీస్​కు వెళ్లాడు. అయితే, ఆ రోజు శ్రీనివాస్​ఉద్యోగానికి రాలేదు.

దీనిని అవకాశంగా తీసుకున్న ప్రణయ్​కుమార్​ఆఫీస్​లోని కంప్యూటర్​నుంచి ఏటీఎం మిషన్ల పాస్​వర్డులను తన మొబైల్​ఫోన్​తో ఫోటో తీసి తస్కరించాడు. అదేరోజు ఫిర్జాదీగూడలో రెండు, బండ్లగూడలో ఒకటి, జిల్లెలగూడలో రెండు ఏటీఎం మిషన్ల నుంచి మొత్తం 62లక్షల 79వేల రూపాయలు అపహరించాడు. అనంతరం కనిపించకుండా పోయాడు. మరుసటిరోజు డ్యూటీకి వచ్చిన శ్రీనివాస్​ఏటీఎం సెంటర్లలో డబ్బు చోరీ అయినట్టు గ్రహించి సంస్థకు సమాచారం అందించాడు. ఈ క్రమంలో సెక్యూర్​వాల్యూ యాజమాన్యం జరిగిన విషయాన్ని వివరిస్తూ మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు సోమవారం రోజు అల్వాల్​సమీపంలోని లోతుకుంట ప్రాంతంలో నిందితుడు ప్రణయ్​కుమార్​ను పట్టుకున్నారు. విచారణలో ఉద్యోగం చేయటం ద్వారా తనకు నెలకు కేవలం 16వేల రూపాయలు మాత్రమే జీతంగా వస్తోందని ప్రణయ్​కుమార్ చెప్పాడు.

జల్సా జీవితంపై ఉన్న మక్కువతోనే ఈ చోరీకి పాల్పడినట్టు అంగీకరంచాడు. అంతకు ముందు 2022, నవంబర్​నెలలో ఉప్పల్, పోచారం ఐటీ కారిడార్​ప్రాంతాల్లోని ఏటీఎంల నుంచి 2లక్షల 50వేల రూపాయలు చోరీ చేసి పంచుకున్నట్టు వెల్లడించాడు. ఈ క్రమంలో పోలీసులు శ్రీనివాస్​ను కూడా అరెస్టు చేశారు. ప్రస్తుతం చోరీ చేసిన డబ్బును తన స్నేహితుడైన క్రాంతికుమార్​వద్ద దాచిపెట్టినట్టు చెప్పాడు. ఈ క్రమంలో పోలీసులు ఇద్దరి నుంచి 55లక్షల 80వేల రూపాయల నగదు, మూడు స్మార్ట్​సెల్​ఫోన్లు, రెండు స్మార్ట్​వాచీలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పక్షం రోజుల్లోనే అరెస్టు చేసిన ఇన్స్​పెక్టర్​గోవర్ధనగిరితోపాటు ఆయన బృందంలోని ప్రభాకర్​రెడ్డి, నర్సింగ్​రావు, లక్ష్మణ్​లను కమిషనర్​డీ.ఎస్.చౌహాన్​అభినందించారు.

Advertisement

Next Story