బలగం పేరుతో బలవంతపు పబ్లిసిటీ.!

by Mahesh |   ( Updated:2023-04-02 07:54:36.0  )
బలగం పేరుతో బలవంతపు పబ్లిసిటీ.!
X

దిశ, ప్రతినిధి నాగర్ కర్నూల్: భావోద్వేగ భరితమైన కుటుంబ నేపథ్యం కథా చిత్రమైన బలగం సినిమాకు రోజురోజుకూ ప్రజాదరణ పొందుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొన్ని గ్రామాల్లోనూ రాత్రి వేళల్లో గ్రామ నడిబొడ్డున ఎల్ఈడి తెరలను ఏర్పాటు చేసి గ్రామస్తులంతా కలిసిమెలిసి చిత్రాన్ని చూస్తున్న పరిస్థితి గమనిస్తున్నాం. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం లక్నారం గ్రామంలోనూ గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో బలగం సినిమాని ఎల్ఈడీ ద్వారా గ్రామస్తులకు ప్రదర్శించారు. ఇక్కడే స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అభిమానులు కమర్షియల్ గా ఆలోచించి బలగం సినిమా పోస్టర్ల మాదిరి తమ నాయకుడి ఫోటోలను కొన్ని వీడియోలను తెరలో ప్రదర్శించి ప్రచారం చేసుకుంటున్నారు.

కుల, మత అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రామస్తులంతా కలిసిమెలిసి చూస్తున్న సినిమా లో తమ నాయకుడి గొప్పగా కీర్తిస్తూ చూపిస్తూ బలవంతంగా ప్రజలపై తమ నాయకుడి ప్రచారాన్ని రుద్దడం ప్రశాంతంగా సినిమా చూసే జనానికి బలవంతంగా పబ్లిసిటీ రుద్దడం ఎంతవరకు సమంజసమని గ్రామంలోని ఇతర పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పై ప్రచార ఆర్భాటంతోనే సరిపోతుందన్న విమర్శలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ వీడియో కూడా దానికి బలం చేకూర్తోందని సామాన్యులు చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story