- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎన్నికలు వస్తేనే ఉద్యోగాలు భర్తీ చేస్తారా..?

దిశ, కరీంనగర్ సిటీ : యువతకు ఉపాధి మార్గాలు చూపడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందగా, నిరుద్యోగం పుట్టగొడుగులా పెరుగుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య, అఖిల భారత యువజన సమాఖ్య ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని ఫిలిం భవన్‌లో నిరుద్యోగ పోరు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో 8.72 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయకుండా మోడీ సర్కార్ చోద్యం చూస్తోందని విమర్శించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయకుండా, రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల ఉసురు తీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఉద్యోగాల నోటిఫికేషన్ అంటూ హడావిడి చేస్తూ నిరుద్యోగుల జీవితాలను దుర్భరం చేస్తున్నదని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఏడేళ్ళు గడిచినా నూతన పరిశ్రమలను ఏర్పాటు చేయలేదని, 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తున్నట్టు చెప్పుకోవడం ఎన్నికల స్టంట్ గా అభివర్ణించారు.
బిశ్వాల్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఒక లక్షా 91 వేల పైగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2018 ఎన్నికల సందర్భంగా తెరాస పార్టీ ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి చెల్లించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విద్యార్థి, యువజన వ్యతిరేక విధానాలపై పోరాటానికి, విద్యార్థులు, యువకులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ స్టాలిన్, సీపీఐ జిల్లా కార్యదర్శి పోనగంటి కేదారి, ఏఐవైఎఫ్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయిని అశోక్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బోనగిరి మహేందర్, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, బ్రహ్మణపల్లి యుగేందర్, బాలసాని లెనిన్, ప్రేమ్ కుమార్, మధు, శ్రీనివాస్ నాయక్, చెంచాల మురళి, ఉదయ్, మల్లేశం, రాము, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.