కరోనా వైఫల్యంపై రాష్ట్ర వ్యాప్త నిరసనలు: సీపీఐ రామకృష్ణ

by srinivas |   ( Updated:2020-07-25 22:20:37.0  )
కరోనా వైఫల్యంపై రాష్ట్ర వ్యాప్త నిరసనలు: సీపీఐ రామకృష్ణ
X

దిశ, ఏపీ బ్యూరో: ఈనెల 27న వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, కరోనా కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. కరోనా బాధితులకి వైద్యం అందించే విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆరోపించారు. ఏపీలో 90 వేలకు పైగా పాజిటివ్ కేసులు, 1000కి పైగా మరణాలు నమోదయ్యాయని విమర్శించారు.

అనంతపురంలో సకాలంలో వైద్యం అందక చెట్టు కిందే భవన నిర్మాణ కార్మికుడు మరణించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. క్వారంటైన్ కేంద్రాల్లోని ప్రజలకు, కోవిడ్ ఆసుపత్రులలో రోగులకు పౌష్టికాహారం అందటం లేదని ఆయన విమర్శించారు. రక్షణ పరికరాలు లేక తెనాలిలో వైద్య సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారని గుర్తుచేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి చర్యలు లేవు కానీ మద్యం షాపులకు మరో గంట సమయం పొడిగించి రాత్రి 9 గంటల వరకు అనుమతిచ్చారని మండిపడ్డారు. ప్రజారోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story