‘ఆ డాక్టర్‌ను వేధించినట్లే నన్ను కూడా…’

by srinivas |
‘ఆ డాక్టర్‌ను వేధించినట్లే నన్ను కూడా…’
X

దిశ ఏపీ బ్యూరో: డాక్టర్‌ సుధాకర్‌ను వేధించినట్లే తనను కూడా వేధిస్తున్నారని.. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ మహిళ డాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన ప్రస్తుతం ఏపీలో కలకలం రేపుతోంది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరుకు చెందిన పెనుమూరు ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ అనితారాణి మీడియాతో మాట్లాడుతూ.. “ఆస్పత్రిలో కింది స్థాయి సిబ్బంది పాల్పడుతున్న అవినీతిని ప్రశ్నించాను… అదే తన తప్పయిపోయిందన్నారు. అప్పటి నుంచి తనపై కక్ష కట్టిన స్థానిక అధికార పార్టీ నేతలు, జనతా కర్ఫ్యూ రోజున ఓ గదిలో బంధించి, రకరకాలుగా వేధించి, దుర్భాషలాడారని ఆమె ఆరోపించారు. తనతో అభ్యంతరకరంగా ప్రవర్తించారని చెప్పుకొచ్చారు. చివరికి వాష్ రూములో కూడా వేధింపులు తప్పలేదని వాపోయారు. తన ఫొటోలు, వీడియోలు తీసి మానసిక వేధింపులకు గురి చేశారని అనితా ఆవేదన వ్యక్తం చేశారు.

“అమెరికాలో ఉద్యోగం వచ్చినా, దాన్ని వదులుకుని పేదలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో వైద్య సేవల్లోకి వచ్చాను. అలాంటి నన్ను తీవ్ర ఇబ్బందులు పెడుతూ, నిత్యమూ అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. దీనిపై వీడియోతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళితే, ఫిర్యాదు తీసుకోకుండా దాదాపు 11 గంటల పాటు కూర్చోబెట్టారని, ఉన్నతాధికారులతో ఫోన్ చేయించి కేసు పెట్టవద్దని బెదిరింపులకు దిగారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరుగుతుందా? అన్న ఆందోళనతోనే ఈ విషయంపై తాను హైకోర్టుకు కూడా వెళ్లినట్టు ఆమె తెలిపారు.

ఈ నేపథ్యంలో దీనిపై ట్విట్టర్ మాధ్యమంగా డిప్యూటీ సీఎం నారాయణస్వామిని ఉద్దేశిస్తూ టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ట్వీట్ చేశారు. ‘నారాయణస్వామిగారూ, మీ నియోజకవర్గంలో ఉన్న పెనమలూరు వైద్యశాలలో దళిత డాక్టర్ అనితారాణిని మీ నాయకులు అసభ్యంగా, కులం పేరుతో తిడుతూ, మానసికంగా వేధిస్తుంటే… మీరు కానీ, పోలీసులు కానీ పట్టించుకోలేదు. తనను మరో డాక్టర్ సుధాకర్ ను చేస్తారేమోనని ఆమె భయపడుతున్నారు. కింకర్తవ్యం?’ అని వర్ల రామయ్య ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed