కరోనా పేషెంట్లకు జంతువులకున్న విలువ లేదా?

by vinod kumar |
supreme court notices to twitter
X

న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా పేషెంట్లకు జంతువులకున్న విలువ లేదా? ఇక్కడ వారితో అంతకంటే హీనంగా వ్యవహరిస్తున్నారని అత్యున్నత ధర్మాసనం కేజ్రీవాల్ ప్రభుత్వంపై మండిపడింది. దేశ రాజధానిలో పరిస్థితులు భయానకంగానూ, బాధాకరంగానూ ఉన్నాయని అభిప్రాయపడింది. కరోనా రోగులకు చికిత్స, ఈ మహమ్మారితో మరణించినవారి మృతదేహాలతో వ్యవహరిస్తున్న తీరుపై న్యాయమూర్తి అశోక్ భూషణ్ నేతృత్వంలో జస్టిస్ ఎస్‌కే కౌల్, ఎంఆర్ షాల త్రిసభ్య న్యాయస్థానం స్వచ్ఛందంగా విచారిస్తున్నది. దీనిపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లోనూ ఇవే పరిస్థితులున్నాయని పేర్కొంది. కరోనా పేషెంట్ల పట్ల వ్యవహరించే విధానం, మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడంపై ఈ నాలుగు రాష్ట్రాలు సహా కేంద్ర ప్రభుత్వం తమ వివరణలు ఇవ్వాలని నోటీసులు పంపింది. పేషెంట్‌తో వ్యవహరించే తీరుపై పూర్తి వివరణతోపాటు ఆస్పత్రి సిబ్బంది, అంబులెన్స్ ఇతర అత్యవసర అంశాల సమాచారాన్ని కోర్టుకు అందజేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

వెయిటింగ్ ఏరియా, లాబీల్లో మృతదేహాలు

ఢిల్లీలో ఆస్పత్రుల పరిస్థితి దారుణంగా ఉన్నదని, కరోనా పేషెంట్లకు, మృతదేహాలకు ఏమాత్రం విలువ అక్కడ దక్కడం లేదని ధర్మాసనం ఆగ్రహించింది. పేషెంట్‌లను జంతువుల కన్నా హీనంగా చూస్తున్నారని, ఇటీవలే చెత్తకుప్పలో ఓ మృతదేహం కనిపించిందని గుర్తుచేసింది. ఢిల్లీ ఆస్పత్రుల్లో పేషెంట్‌లు ఏడుస్తున్నారని, కానీ, ఈతిబాధలు వినేవారు లేరని తెలిపింది. పేషెంట్ మరణించినాక ఒక్కోసారి కనీసం వారి కుటుంబ సభ్యులకు తెలియజేయడం లేదని, దీంతో అంత్యక్రియలకూ వారు హాజరుకాలేకపోతున్నారని పేర్కొంది. ఢిల్లీ ఆస్పత్రుల్లో పడకలు అందుబాటులో ఉన్నా పేషెంట్‌లు మాత్రం పడిగాపులు కాయాల్సి వస్తున్నదని తెలిపింది. కొన్ని రిపోర్టుల ప్రకారం, ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో మృతదేహాలు కొన్నిసార్లు వెయిటింగ్ ఏరియా, లాబీలలో కనిపిస్తున్నాయని వివరించింది.

టెస్టులు ఎందుకు తగ్గిస్తున్నారు?

ఢిల్లీ ప్రభుత్వం టెస్టులను ఎందుకు తగ్గిస్తున్నదో చెప్పాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రతి రాష్ట్ర తప్పకుండా టెస్టులను పెంచుకుంటూ పోవాలని, అవసరమున్న ప్రతిఒక్కరినీ పరీక్షించాలని ఆదేశించింది. చెన్నై, ముంబయిలు రోజుకు నిర్వహించే టెస్టుల సంఖ్యను 16,000ల నుంచి 17,000లకు పెంచితే, ఢిల్లీ ఎందుకు 7,000 నుంచి 5,000లకు తగ్గించిందని అడిగింది. దీనిపై వివరణ ఇవ్వాలని విచారణను 17వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement

Next Story