ఉచిత బియ్యం పంపిణీకి స‌న్నాహాలు..

by Sridhar Babu |
ఉచిత బియ్యం పంపిణీకి స‌న్నాహాలు..
X

దిశ‌, ఖమ్మం: క‌రోనా వైర‌స్ (కోవిడ్ -19) కట్టడికి కేంద్రం లాక్ డౌన్ ప్రకటించింది. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర‌ ప్ర‌భుత్వం ప్రజలను ఆదుకునేందుకు తెల్ల‌రేష‌న్ కార్డుదారుల‌కు ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. ఇందుకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. తెల్లరేషన్‌ కార్డు ఉన్న కుటుంబంలోని ప్రతి వ్యక్తికీ 12 కిలోల రేషన్‌ బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయ‌నున్నారు.

అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్..

సోమ‌వార‌మే రేష‌న్ బియ్యం పంపిణీ అంశంపై క‌లెక్ట‌ర్ క‌ర్ణ‌న్ సివిల్ స‌ప్లై అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. డీఎస్వో రాజేంద్రప్రసాద్‌, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌ సోములు, అసిస్టెంట్‌ మేనేజర్‌ నర్సింహారావుతో క‌ల‌సి ఎంఎల్‌ఎస్‌ పాయింట్లను పరిశీలించారు. జిల్లా గోదాముల్లో ఉన్న బియ్యం నిల్వ‌ల‌పై డీఎస్‌వోను క‌లెక్ట‌ర్ క‌ర్ణ‌న్ ఆరా తీశారు. జిల్లాలో ఉన్న గోదాముల్లో ప్రస్తుతం 39 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం నిల్వలు ఉన్నాయని డీఎస్వో రాజేంద్రప్రసాద్ స‌మాధానం చెప్ప‌డంతో సంతృప్తి వ్య‌క్తం చేశారు. క‌లెక్ట‌ర్ ఆదేశాల‌తో ఇప్ప‌టికే జిల్లాలోని గోదాముల నుంచి బియ్యాన్ని ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు త‌ర‌లించారు. ప్ర‌భుత్వం నుంచి పంపిణీకి ఆదేశాలు రాగానే రేష‌న్ దుకాణాల‌కు బియ్యాన్ని త‌ర‌లించ‌నున్న‌ట్లు అధికారులు చెబుతున్నారు.

జిల్లాలో 4,05,169ఆహారభద్రతా కార్డులు ఉండ‌గా వీటి ద్వారా 11,44,833 మంది వినియోగదారులు ల‌బ్ధి పొందుతున్నారు. ఒక్కో స‌భ్యుడికి 6 కేజీల చొప్పున నెల‌నెలా ప్రభుత్వం బియ్యాన్ని పంపిణీ చేస్తూ వ‌స్తోంది. అయితే, క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌భుత్వం కార్డులో ఉన్న ప్ర‌తి స‌భ్యుడికీ ఉచితంగా 12 కేజీల బియ్యాన్ని అంద‌జేయాల‌ని పౌర‌స‌ర‌ఫ‌రాల‌శాఖ‌ను ఆదేశించిన విష‌యం తెలిసిందే. త‌ద‌నుగుణంగానే ఏప్రిల్‌ నెలకు సంబంధించి బియ్యాన్ని అందించేందుకు అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఇందుకు 13,797 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ఈ నెల కోటా కింద విడుదల చేస్తున్నారు.

బ్యాంకు ఖాతాల్లోనే న‌గ‌దు జ‌మ‌..

బియ్యం, ఇతర నిత్యావసరాల కింద రూ.1500 నగదును కూడా పంపిణీ చేసేందుకు సర్కారు చర్యలు తీసుకుంటున్నది. న‌గ‌దును ఆన్‌లైన్‌లో ల‌బ్ధిదారుల ఖాతాల్లో జ‌మ చేయ‌నున్న‌ట్లు ఇటీవ‌ల క‌లెక్ట‌ర్ క‌ర్ణ‌న్ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. నగదు పంపిణీకి సంబంధించి ప్ర‌భుత్వం ఇంకా పూర్తి మార్గ‌ద‌ర్శ‌కాల‌ను వెల్ల‌డి చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Tags : rice supply, pds shops, coronavirus (covid-19), effect, lockdown

Advertisement

Next Story

Most Viewed