స్పెయిన్ కపుల్ కూతురికి ‘ఇండియా’ పేరు

by Shyam |
స్పెయిన్ కపుల్ కూతురికి ‘ఇండియా’ పేరు
X

దిశ, వెబ్‌డెస్క్: దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్‌, ఐపీఎల్‌‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌ జాంటీ రోడ్స్‌‌కు ఇండియా అంటే ఎనలేని అభిమానం, ఇష్టం కూడా. భారత్‌పై తనకున్న ప్రేమను చాటుకునేలా జాంటీ తన కూతురికి ‘ఇండియా’ అని పేరు పెట్టుకున్న విషయం తెలిసిందే. కాగా ఆ చిన్నారి ముంబైలోనే జన్మించడం విశేషం. తాజాగా ఓ స్పెయిన్ జంట కూడా తమకు పుట్టిన బిడ్డకు ‘ఇండియా’ అని పేరుపెట్టుకోవాలని భావిస్తున్నారు. అందుకోసం ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? అంటూ ఆ జంట సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించగా.. నెటిజన్లు పాజిటివ్‌గా స్పందించారు.

పేరెంట్స్ ఎవరైనా తమ బేబీకి ప్రపంచంలోని కోట్లాది పేర్ల నుంచి ర్యాండ‌మ్‌గా ఏదో ఒకటి సెలెక్ట్ చేసి, హడావిడిగా పేరు పెట్టేయరు. అందుకోసం ముందు నుంచి ప్లాన్ చేసుకుంటారు. కొందరు శాస్త్ర ప్రకారం, నక్షత్రం ప్రకారం పేర్లు పెడుతుంటారు. ఎవరి విశ్వాసాలు, నమ్మకాలు వారివి. అందులో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. అయితే, ఓ స్పెయిన్ కపుల్ మాత్రం.. తమకు పుట్టిన బేబీ గర్ల్‌కు ‘ఇండియా’ అని పేరు పెట్టుకోవాలని భావిస్తున్నారు. ఇది అందమైన పేరే అయినా, భారతదేశానికి చెందిన పౌరుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకు.. వారు ఇంటర్నెట్‌లో తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.

‘మేము స్పెయిన్‌లో నివసిస్తాం. మాకు ఇటీవలే కూతురు పుట్టింది. మేము మా కూతురుకి ప్రేమతో ‘ఇండియా అని పేరు పెట్టుకోవాలనుకుంటున్నాం. అయితే మాకు ఇండియాతో ఎలాంటి కనెక్షన్ లేదు. మేము కూడా ఇండియన్స్ కాదు. ఇది మీకు ఇన్‌సెన్సిటివ్‌గా అనిపిస్తుందా? మా పాపకు ఆ పేరు పెట్టడం మీకు సమ్మతమేనా?’ అని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. అందుకు ‘నో వర్రీస్.. నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన పేరు మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏదీ అభ్యంతరం కాదు. ఇండియా అనే పేరు కామన్ కాకపోవచ్చు. కానీ.. కొంతమంది పెట్టుకుంటారు. మీకు పాప పుట్టినందుకు కంగ్రాట్స్, ఇది చాలా గొప్ప నిర్ణయం’ అంటూ నెటిజన్లు ఆ స్పెయిన్ జంట అభిప్రాయంపై పాజిటివ్‌గా స్పందించారు. ‘ఇండియా’ అని పేరు పెట్టుకోమంటూ చాలా మంది కామెంట్లు చేశారు.

కరోనా టైమ్‌లో చాలా మంది పేరెంట్స్ తమ పిల్లలకు ‘కరోనా’ ‘లాక్‌డౌన్’ ‘శానిటైజర్’ అనే పేర్లు పెట్టడం చూశాం. అలాంటిది ఓ దేశం పేరును.. మరో దేశంలో పుట్టిన చిన్నారికి ప్రేమతో పెట్టుకుంటున్నారంటే.. అది నిజంగా మంచి పనే కదా.

Advertisement

Next Story