- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పత్తి రైతుకు ప్రభుత్వం చావుదెబ్బ ఇదే..!
నకిరేకల్ మండలానికి చెందిన రమేశ్ (పేరు మార్చాం) ఈ యేడు 12 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశాడు. ప్రారంభంలో పత్తి చేను మంచి ఎదుగుదల ఉంది. కానీ సీజన్ మధ్యలో కురిసిన అధిక వర్షాలకు విపరీతమైన కలుపు పెరిగింది. చీడపీడలు ఎక్కువయ్యాయి. ఫలితంగా పత్తి చేనులో ఎదుగుదల లోపించింది. దీంతో మధ్యలోనే పత్తి పంట సాగును వదిలేశాడు. 12 ఎకరాల పత్తి సాగుకు రూ.4.50 లక్షలు అప్పుచేసి పెట్టుబడి పెట్టాడు. సాగును మధ్యలో వదిలేయడంతో అంతటి అప్పుతో సరిపోయింది. లేకపోతే మరో రెండు మూడు లక్షల అప్పు మీద పడేది. ఇంతకీ ఈ యువ రైతు పత్తి దిగుబడి ఎంత సాధించాడో తెలిస్తే అవాక్కవాల్సిందే.. 12 ఎకరాల పేరు మీద కేవలం 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. దీంతో కుటుంబం మొత్తం రోడ్డున పడే పరిస్థితి వచ్చింది.
దిశ ప్రతినిధి, నల్లగొండ: ‘మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు’ అన్న చందంగా తయారయ్యింది పత్తి రైతుల పరిస్థితి. కనీస దిగుబడులు లేక కూనరిల్లిపోయిన పత్తి రైతులను.. మార్చి నెల రాకముందే సీసీఐ కేంద్రాలను మూసేసి ప్రభుత్వం చావుదెబ్బతీసింది. ప్రకృతి వైపరీత్యాలకు తోడు మానవ తప్పిదం కారణంగా పత్తి రైతు చిత్తయ్యాడు. ప్రారంభ దశలో వరుణుడు మురిపించినా.. తీరా పంట చేతికొచ్చే సమయానికి నిలువునా ముంచే కోలుకోలేని దెబ్బతీశాడు. కాస్తో కూస్తో చేతికొచ్చిన తెల్లబంగారానికి కొర్రీల పేరుతో మద్దతు ధరలో భారీ కోతలు పెట్టారు. ఆపద సమయంలో రైతాంగాన్ని అక్కున చేర్చుకోవాల్సిన ప్రభుత్వాలు.. పంట కొనుగోలు బాధ్యత నుంచి తప్పుకుని చేతులేత్తేశారు. మార్చి నెల రాకముందే.. సీసీఐ కేంద్రాలను ఎత్తేయడంతో దళారుల పంట పండింది. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులు ప్రైవేటు వ్యాపారులు, దళారులకు అడ్డికి పావుసేరు అన్న చందంగా అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అసలే పత్తి పంట సాగుకు పెట్టిన పెట్టుబడి రాక అప్పుల ఊబిలోకి కూరుకుపోతే.. కనీస మద్దతు ధర దక్కపోవడంతో పత్తి రైతాంగం దిక్కుతోచని స్థితిలో పడ్డారు. భారీగా తగ్గిన దిగుబడి, సీసీఐ కేంద్రాల మూసివేతతో పత్తి రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ‘దిశ’ ప్రత్యేక కథనం.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో..
ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా 10.23 లక్షల ఎకరాల్లో పత్తి పంటను రైతాంగం సాగు చేసింది. యాదాద్రి జిల్లాలో 1.73 లక్షల ఎకరాల్లో పత్తిపంటను సాగు చేయగా, సూర్యాపేట జిల్లాలో 1.49 లక్షల ఎకరాల్లో పత్తిని వేశారు. ఇక అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 7.25 లక్షల ఎకరాల్లో పత్తిపంటను సాగు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా 10.23 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తే.. సగటున ఎకరాకు 10 క్వింటాళ్ల చొప్పున లెక్కిస్తే.. 1.03 కోట్లు క్వింటాళ్ల పత్తి దిగుబడి రావాల్సి ఉంది. కానీ ఈ ఏడాది పత్తి దిగుబడులు భారీగా తగ్గాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కనీసం 50 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడులను దాటలేకపోయిందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతోంది.
భారీగా పెరిగిన పెట్టుబడి..
నిజానికి ఓవైపు అధిక వర్షాలు.. మరోవైపు చీడపీడల కారణంగా పత్తి పంట సాగుకు విపరీతమైన పెట్టుబడులు పెట్టాల్సి వచ్చింది. ఏటా ఎకరా పత్తి సాగుకు రూ.30వేల లోపు ఖర్చయ్యేది. కానీ ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చు పెరగడంతో సాగు ఖర్చు రూ.35వేలకు చేరింది. ఇంత చేసి అన్ని అనుకూలిస్తే.. ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. సగటున క్వింటాల్‌కు రూ.5500 ధర ప్రకారం చెల్లిస్తే.. ఎకరాకు రూ.55వేలు వస్తుంది. పెట్టుబడి ఖర్చు రూ.30వేల నుంచి రూ.35వేల వరకు తీసేస్తే.. రైతులకు ఏడాదంతా కష్టపడినందుకు రూ.15 వేల నుంచి రూ.20వేల వరకు మిగులుతాయి. భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తే రైతులకు రూ.10వేలు అదనపు ఖర్చు. కానీ ఈ ఏడాది 90 శాతం మంది రైతులకు ఎకరాకు గరిష్టంగా 5 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.35వేల పెట్టుబడి పెడితే.. వచ్చిన దిగుబడి పత్తిని అమ్మితే కేవలం ఎకరాకు రూ.25వేలకు మించి రాలేదు.
సీసీఐ కేంద్రాలను ముందే ఎత్తేసిన ప్రభుత్వం..
పత్తి కొనుగోళ్లు చేపట్టడంలో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 44 సీసీఐ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నల్లగొండ జిల్లాలో 24 సీసీఐ కేంద్రాలు, యాదాద్రిలో 14, సూర్యాపేట జిల్లాలో 6 కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఈ పత్తి కొనుగోలు కేంద్రాలన్నీ దాదాపుగా జిన్నింగ్ మిల్లుల్లోనే ఓపెన్ చేసింది. సీసీఐ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5875గా ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ యేడు అధిక వర్షాలకు పత్తి తడవడంతో తేమ, నాణ్యత లోపం కారణంగా మొదట్లో క్వింటాల్‌కు రూ.50 చొప్పున కోత విధించారు. అది రానురానూ క్వింటాల్‌కు రూ.160 నుంచి రూ.300కు పైగా కోత పెట్టారు. దీనికితోడు పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు బారులుదీరడంతో టోకెన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ విధానంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవడమే గాక ప్రజాప్రతినిధులు బహిరంగంగానే ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్న ఉదంతాలు లేకపోలేదు. దీనిపై రైతాంగం ఆందోళన వ్యక్తం చేసినా.. పాలకులు పట్టించుకున్న పాపనపోలేదు. తాజాగా ప్రభుత్వం ఫిబ్రవరి మొదటి వారంలోనే సీసీఐ కేంద్రాలు మూసేయడంతో ఆ పత్తిని ప్రైవేటు వ్యాపారులు, దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ యేడు ఎకరా పత్తి సాగు ఖర్చు ఇదీ..
దుక్కిని పొతం చేసేందుకు – రూ.3వేలు
అచ్చు తోలకానికి – రూ.వెయ్యి
రెండు విత్తన ప్యాకెట్లు, గింజలు విత్తడానికి – రూ.2 వేలు
ఎరువులు(పిండి కట్టలు) – రూ.3 వేలు
కలుపు తీసేందుకు – రూ.6వేలు
గొర్రు, గుంటక ఖర్చు – రూ.5వేలు
పురుగు మందులకు – రూ.5 వేలు
పత్తి ఏరినందుకు – రూ.5 వేలు
పత్తిని మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు – రూ.2500
మొత్తంగా ఎకరా ఖర్చు – రూ.30,500