అవినీతిమయంగా రామగుండం కార్పొరేషన్.. అధికారులే కీలక సూత్రధారులా ?

by Sridhar Babu |   ( Updated:2021-12-01 00:11:11.0  )
అవినీతిమయంగా రామగుండం కార్పొరేషన్.. అధికారులే కీలక సూత్రధారులా ?
X

దిశ, గోదావరిఖని : రామగుండం కార్పొరేషన్లో అవినీతి కంపు కొడుతోందని పలువురు నాయకులు ఆరోపిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఓ అవినీతి అధికారిని బదిలీ చేయాలంటూ అధికార టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్‌తో పాటు కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులను అందజేశారు. కార్పొరేషన్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అయినా సదరు అధికారిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అంతే కాకుండా పాత మున్సిపల్ కార్యాలయంలో ఉన్న స్క్రాప్ చోరీలోనూ కొంత మంది కార్పొరేషన్ అధికారుల పాత్ర ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇది ఇలా ఉంటే రామగుండం కార్పొరేషన్ పరిధిలో చేసిన పనులకు బిల్లులు రావడం లేదని వచ్చిన బిల్లులకు తమకు లంచాలు ఇవ్వాలని ఇబ్బందులు పెడుతున్నారని రామగుండం కార్పొరేషన్ లోని గుత్తేదారులు ఏసీబీ అధికారులను ఆశ్రయించి పట్టించడం గోదావరిఖని‌లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఇద్దరు గుత్తేదారులు లంచాల కోసం అధికారులు వేధిస్తున్నారంటూ పట్టించడం పట్ల మరిన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి అవినీతి అధికారులు కార్పొరేషన్‌లో మరికొంత మంది ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.

కార్పొరేషన్‌లో చేసిన పనులకు బిల్లులు చెల్లించాలన్న ఫైల్ కదలాలన్నా లంచం లేనిదే పని జరగడం లేదని, కొందరు అధికారులు పైసల కోసం వేధిస్తున్నారని కార్పొరేషన్ లో పనిచేసే కొందరు గుత్తేదారులు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తూ ఉండడంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో రోడ్డు, భవన నిర్మాణ పనులకు తమకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని రామగుండం కార్పొరేషన్ కాంట్రాక్టర్ తిరుపతి గతనెల సెప్టెంబర్ 4వ తేదీన పెద్దపెల్లి (సీపీఓ) జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటనారాయణ ను సంప్రదించగా 40 వేల రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులు తమ కార్యాలయంలో దాడి చేసి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇది గడిచిన నెలకే మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన అధికారి ఏసీబీకి పట్టుపడటం చర్చనీయాంశంగా మారుతోంది.

కార్పొరేషన్‌కు సంబంధించిన కాంట్రాక్టర్ రజనీకాంత్ మొదటి, సెకండ్ వేవ్‌లలో గైక్వాడ్ శానిటేషన్ హైడ్రోక్లోరైడ్ ద్రావణం పనులతో పాటు హరితహారం పనులను చేపట్టాడు. వీటికి సంబంధించిన మొత్తం 35 లక్షల బిల్లులలో సానిటేషన్ హైడ్రోక్లోరైడ్ ద్రావణం సంబంధించిన 9.28 చెక్కులు రావడంతో ఈ డబ్బుల చెక్కులనుఇచ్చేందుకు గాను రామగుండం మున్సిపల్ ఇంచార్జీ కమిషనర్‌గా ఉన్న పెద్దపెల్లి ఆర్టీవో శంకర్ కుమార్ దగ్గర పనిచేసే మల్లికార్జున్ అనే వ్యక్తితో లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో కాంట్రాక్టర్ రజినీకాంత్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో బాధితుడి వద్ద నుండి లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇదే కాంట్రాక్టర్ రజనీకాంత్‌ను లంచం కోసం వేధించడంతో 2009 వ సంవత్సరంలో మున్సిపల్ డీఈ‌ని ఏసీబీ అధికారులకు పట్టించారు. రామగుండం ఇంచార్జీ కమిషనర్ శంకర్ కుమార్ ఏసీబీకి పట్టుబడడంతో కార్పొరేషన్‌లోని కొంతమంది అధికారులలో అలజడి మొదలైంది. ఈ నేపథ్యంలో అవినీతి బాగోతాలు ఎక్కడ బయటపడతాయో అని పలువురిలో ఆందోళన నెలకొంది. ఇప్పటికే కొంతమంది పై వస్తున్న అవినీతి ఆరోపణలు మరింత చర్చకు దారితీస్తున్నాయి.

కార్పొరేషన్ లోని స్క్రాప్ స్కాం‌లో వాటా ఎంత..?

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించిన పాత మున్సిపల్ ఆఫీస్ స్క్రాప్‌లో కీలకంగా సదరు అధికారి వ్యవహరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్క్రాప్ చోరీకి గురికావడంతో ప్రజా సంఘాలతో పాటు ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఈ స్క్రాప్ చోరీ పై సదరు అధికారిని వివరణ కోరిన సమయంలో తమ దృష్టికి రాలేదని చెప్పిన ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. అయితే ఈ చోరీ వ్యవహారంలో స్క్రాప్ మాయం చేసిన ఓ అధికార పార్టీ నాయకుడి ఇంటికి వెళ్లి సెటిల్మెంట్ చేసి పెద్ద ఎత్తున లక్షల రూపాయలు చేతులు మార్చినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలోనే సదురు అధికారిపై ఎన్నో అవినీతి ఆరోపణలు వినిపించాయి. మొదటిసారిగా రామగుండం ఇంచార్జీ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్న సమయంలోనే ఈ స్క్రాప్ వ్యవహారంలో ఎవరికివారు వాటాలు పంచుకున్నట్లు సైతం ప్రచారం జరిగింది. ఇప్పటికీ ఈ స్క్రాప్ వ్యవహారంలో దొంగలు ఎవరు అనేది బయట పడకపోవడం ఈ కేసు నీరుగారి పోవడంలో కీలక అధికారిగా సైతం వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వరుసగా జరుగుతున్న ఘటనలు రామగుండం కార్పోరేషన్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముందు ముందు ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అనే ఆందోళన నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed