నో ట్రేసింగ్..నో టెస్టింగ్.. కరోనా కట్టడి ఎలా..?

by Sridhar Babu |
నో ట్రేసింగ్..నో టెస్టింగ్.. కరోనా కట్టడి ఎలా..?
X

దిశ, కరీంనగర్ సిటీ : గతేడాది ఇదే సమయంలో కరోనా పాజిటివ్ కేసులు కనిపిస్తే చాలు..వైరస్ సోకిన వ్యక్తి ఇల్లు, కుటుంబం, నివసించే ప్రాంతం, రోగ నిర్ధారణకు 15 రోజుల ముందునుంచి రోగి కలిసిన, మాట్లాడిన వారందరినీ గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించేవారు. వైరస్ సోకిన వ్యక్తి నివసించిన పరిసరాల్లోకి ప్రవేశం కూడా నిషేదించేవారు. ఆప్రాంతం మొత్తం సానిటైజ్ చేసి, వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించేవారు. తగు రక్షణ చర్యలు తీసుకోకుండా బజారుకు రావాలంటే సామాన్యులు కూడా భయంతో వనికిపోయేవారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో జిల్లాలో ఫస్ట్ వేవ్ కరోనా ప్రభావం నామమాత్రానికే పరిమితమైనది. గత నెల నుంచి కరోనా సెకండ్ వేవ్ మొదలవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై టెస్టింగ్.. ట్రేసింగ్.. ట్రీట్ మెంట్.. అంటూ అందరిని పరీక్షించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ కింది స్థాయి సిబ్బంది, ఇటు ప్రజలు నిర్లక్ష్యం ప్రదర్శించటంతో, కోవిడ్ మహమ్మారి జిల్లాలో విలయతాండవం చేస్తుంది.

రోజుకు రెండు నుంచి మొదలైన కేసులు ప్రస్తుతం సగటున రోజుకు 90కి చేరాయి. ఇప్పటికే జిల్లాలో 15000కు పైగా గుర్తించినట్లు తెలుస్తుంది. గత వారం రోజుల నుంచి కేసుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుండగా, ట్రేసింగ్..టెస్టింగ్ చేయటంలో వైద్య సిబ్బంది చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ లను గుర్తించకపోవటంతో, దర్జాగా జనాల్లోనే తిరుగుతూ మరింత మందికి అంటగడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. వైరస్ సోకిన వ్యక్తిని గుర్తించిన వెంటనే గతేడాది మాదిరిగా, వైద్య పరీక్షలు నిర్వహించి, కట్టుదిట్టమైన చర్యలు చేపడితే, పరిస్థితులు ఇలా చేయి దాటి పోయేవి కావనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సెకండ్ వేవ్ పై అపోహలుమాని ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకుంటే, మరింతమంది వైరస్ బాధితులు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికయినా వైద్యాధికారులు స్పందించి, ప్రైమరీ, సెకండరీ కాంటాక్టుల వివరాలు సేకరించటంపై శ్రద్ధ పెడితే తప్పా.. కేసులు తగ్గుముఖం పట్టె అవకాశం లేదని వైద్యశాఖ వర్గాలు పేర్కొనడం గమనార్హం.

Advertisement

Next Story