మాపైనే కరోనా ప్రభావం ఎక్కువ

by Anukaran |
మాపైనే కరోనా ప్రభావం ఎక్కువ
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కరోనా కట్టడిలో భాగంగా రాత్రి, పగలు కష్టపడి పనిచేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్‌ను మహమ్మారి వణికిస్తోంది. వైరస్‌ను ఎదుర్కోవడానికి వైద్య ఆరోగ్య శాఖలో వైద్యులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీస్ శాఖలు ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌ కాలంలో నిజామాబాద్ జిల్లాలో 61 కేసులకు, కామారెడ్డి జిల్లాలో 12 కేసులకు కోవిడ్‌ను పరిమితం చేయగలిగారు. తరువాత వచ్చిన అన్‌‌ లాక్‌డౌన్ కాలంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కరోనా వైరస్ విజృంభించింది. ఉమ్మడి జిల్లాలో ఐదు వందలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. 16 మంది వైరస్‌తో పోరాడుతూ చనిపోయారు. పాజిటివ్ కేసుల్లో కరోనా వారియర్స్ సంఖ్య 50 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొదట్లో పీపీఈ కిట్ల కొరత, తరువాత కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటు, వైరాలజీ ల్యాబ్‌లో కరోనా టెస్టులు, ర్యాపిడ్ యాంటిజెన్ డిటెన్షన్ టెస్టులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో షురూ కాగా.. ఇలాంటి సమయంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్ వైరస్ బారిన పడడంతో సామాన్యుల్లో వైరస్ గుబులు రేపుతోంది.

వైద్య సిబ్బందే ఎక్కువ

కొవిడ్ వైరస్ ను నియంత్రించేందుకు మందువరుసలో ఉండి వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బందిపైనే కరోనా ఎక్కువ ప్రభావం చూపుతోంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తొలి కేసు పాజిటివ్ అని తెలియడంతో ఇద్దరు ప్రైవేట్ వైద్యులు, కుటుంబ సభ్యులు క్వారంటైన్‌కు వెళ్లారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ జనరల్ ఆసుపత్రి వైధ్యాధికారికి కూడా వచ్చింది. ఆసుపత్రిలో ఇద్దరు వైద్యులకు, ఒక జూనియర్ డాక్టర్‌ సైతం వైరస్ బారిన పడ్డారు. కమ్మర్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, ఆమె భర్త ప్రైవేట్ వైద్యుడికీ కరోనా సోకింది. కామారెడ్డి జిల్లా బిక్కనూర్, పిట్లం పీహెచ్‌సీల వైద్యులు దాని బారినపడగా, కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో టెక్నిషియన్‌కు వచ్చింది. తాజాగా బోధన్ జిల్లా ఆసుపత్రిలో ముగ్గురు స్టాఫ్‌నర్సులకు సోకింది. జిల్లా కేంద్రంలోని వైద్యులకు పాజటివ్ రాగా మూడు ఆసుపత్రులు మూసివేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇద్దరు ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేసే నర్సులు, ఇక సిటీ స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడు దాని బారిన పడ్డారు. ఇటీవల ఆర్మూర్‌కు చెందిన ప్రైవేట్ వైద్యుడు వైరస్‌తో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం వైద్య ఆరోగ్యశాఖను కుదిపేసింది. కరోనా కారణంగా ప్రైవేట్ వైద్యశాలలు థర్మల్ స్ర్కీనింగ్ జరిగిన తరువాతనే రోగులను అనుమతించిన శ్వాస, గుండె సంబంధిత వ్యాధిగ్రస్థులకు వైద్యానికి జంకుతున్నారు.

20 మంది పోలీసులకు..

నిజామాబాద్ ఒకటో టౌన్ ఎస్ హెచ్ఓ డ్రైవర్ కు తొలుత పాజిటివ్ అని తెలింది. తరువాత రూరల్ పోలిస్ స్టేషన్ కానిస్టేబుల్ కు వచ్చింది. తరువాత కాలంలో ఆర్మూర్‌లో ఓ ఏఎస్ఐతో ఒక సీఐ, మరో ఎస్సై, కానిస్టేబుల్స్, హోంగార్డులకు సోకింది. కామారెడ్డి జిల్లా నసూరుల్లాబాద్ పీఎస్ లో ఇద్దరికి పాజిటివ్ అని తెలింది. రూరల్ పోలిస్ స్టేషన్ లో హోంగార్డు కరోనాతో చనిపోవడంతో పోలీస్ శాఖ అప్రమత్తం అయింది. కాగా, పారిశుద్ధ్య కార్మికులు ఎవరూ కరోనా బారిన పడలేదు.

Advertisement

Next Story