కరోనా కట్టడి.. అమెరికాలో ఇలా?

by sudharani |
కరోనా కట్టడి.. అమెరికాలో ఇలా?
X

కరోనా దెబ్బకు ప్రపంచమంతా స్తంభిస్తోంది. వైరస్ వ్యాప్తిని నిలువరించడమే లక్ష్యంగా ఆయా దేశాలు విధిస్తున్న ఆంక్షలతో జనం ఇల్లకే పరిమితమవుతున్నారు. కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అమెరికా కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.

అమెరికాలో రోజురోజుకూ విజృంభిస్తున్న కరోనా వైరస్‌ను అరికట్టే చర్యలను ముమ్మరం చేసేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. 10 మంది కంటే ఎక్కువ మంది ఎక్కడా గుంపుగా చేరకూడదని అమెరికా ప్రజలకు ట్రంప్ విజ్ఞప్తి చేశారు. న్యూజెర్సీ, శాన్‌ఫ్రాన్సిస్కోల్లో కర్ఫ్యూ విధించారు. చాలావరకు విమానయాన సర్వీసులను నిలిపివేశారు. పదిమంది కంటే ఎక్కువ హాజరయ్యే సమావేశాలను రద్దు చేసుకోవాలని సూచించారు. దేశంలో కర్ఫ్యూ విధించే పరిస్థితి లేదని అన్నారు. కరోనా వైరస్‌ను అదుపులోకి తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని, ఆగస్టులో అదుపులోకి వచ్చే అవకాశం ఉందని ట్రంప్ అన్నారు. అమెరికాలో టెస్టింగ్ కిట్‌లు తగినంత లేవని అధ్యక్ష భవనం శ్వేతసౌధం మార్చి ఆరంభంలో అంగీకరించింది. కొన్ని ఆరోగ్య కేంద్రాలయితే.. ఉన్న టెస్టింగ్ కిట్లను ఉపయోగించటం కూడా కష్టంగా ఉందని నివేదించాయి. ఇప్పటివరకూ 10 లక్షలకుపైగా కిట్లను పంపిణీ చేశామని, మరిన్ని రాబోతున్నాయని ప్రభుత్వం చెప్తోంది. ప్రతి పది లక్షల మందిలో అమెరికా కేవలం 26 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహించింది. పరీక్షలు అతి తక్కువగా నిర్వహించటంవల్ల ఈ వైరస్ అమెరికాలో ఎక్కువగా వ్యాప్తి చెందింది. దీంతో అమెరికాలో రోజురోజుకూ మరణాల రేటుతోపాటు కరోనా బాధితుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది.

అలర్ట్.. హెల్త్ ఎమర్జన్సీ

అగ్రరాజ్యం అమెరికా హెల్త్ ఎమర్జన్సీని ప్రకటించింది. వైర‌స్ నియంత్ర‌ణ‌కు 50 బిలియ‌న్ డాల‌ర్ల నిధిని అమెరికా ప్రభుత్వం కేటాయించింది. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో అమెరికాకు కార్నివాల్‌, రాయ‌ల్ క‌రేబియ‌న్‌, నార్వేయ‌న్‌, ఎంఎస్‌సీ లాంటి క్రూయిజ్‌ల‌ను 30 రోజులపాటు నిలిపేసింది. విదేశీయులెవరైనా గడచిన 14 రోజుల్లో చైనాకు వెళ్లి ఉన్నట్లయితే వారు అమెరికాలో ప్రవేశించరాదంటూ జనవరి 31వ తేదీన నిషేధం విధించారు. చైనాకు విమానాలు నడుపుతున్న మూడు ప్రధాన అమెరికా ఎయిర్‌లైన్స్ సంస్థలు.. ఆ విమాన సర్వీసులను రద్దు చేశాయి. అనంతరం.. ఫిబ్రవరిలో ఇరాన్‌ విషయంలోనూ ఇదే తరహా ఆంక్షలు విధించారు. గడచిన 14 రోజుల్లో ఆ దేశానికి వెళ్లిన విదేశీయులకు అమెరికాలో ప్రవేశం నిరాకరించారు. ఇప్పుడు యూరప్‌లోని 26 దేశాల నుంచి అమెరికన్లు కాని వారు తమ దేశంలో ప్రవేశించటానికి వీలులేదంటూ నిషేధించారు. అమెరికా పౌరులు, వారి కుటుంబాలకు ఈ ఆంక్షలన్నింటి నుంచీ దాదాపుగా మినహాయింపు ఉంది. అమెరికా ప్రయాణ ఆంక్షలు విధించింది. క్వారంటైన్ చర్యలు చేపట్టింది.

ఇల్లు దాటొద్దు :

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలంతా ఇల్లకే పరిమితం కావాలని ప్రభుత్వం సూచించింది. 15 రోజులపాటు ప్రజలు స్వచ్ఛందంగా ఇంట్లోనే ఉండాలని, ఇంటి వాతావరణాన్ని ఆస్వాదించాలని ట్రంప్ పిలుపునిచ్చారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, సమూహాలకు దూరంగా ఉండటం వల్ల వైరస్‌ను కట్టిడిచేయవచ్చని సూచనలు చేస్తున్నారు. అందరూ మాస్క్‌లు ధరించి వ్యక్తిగత భద్రత పాటించాలని వైద్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

క్లబ్‌లు, బార్లు, రెస్టారెంట్లు మూసివేయాలని ఆదేశించినట్లు గవర్నరు తెలిపారు. దాదాపు అన్ని రాష్ట్రాలూ స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీలు, వివిధ సంస్థలు, వినోద కేంద్రాలు, వ్యాయామ, ఈతకొలను కేంద్రాలు.. ఇలా అన్నింటిని మూసివేశారు. అయితే ప్రభుత్వం ఇస్తున్న సలహాలను ప్రజలు గనక పాటించకపోతే ఏం చర్యలు తీసుకోవాలన్నదానిపై ప్రభుత్వంలో స్పష్టత లేదు. వందల కొద్దీ కంపెనీలు, వాణిజ్య సంస్థలు మూతపడడం వల్ల ఆర్థిక నష్టం జరగడమే కాక పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు పోవడం ఖాయమని అమెరికన్‌ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. హోమ్‌ డెలివరీ సర్వీసులు కొనసాగుతున్నాయి. కరోనా వైరస్‌ అమెరికాలోని 50 రాష్ట్రాలకు విస్తరించినట్లు తెలుస్తోంది. కఠిన చర్యలు తీసుకోకపోతే అమెరికాలో ఏకంగా 22 లక్షల మంది చనిపోవచ్చని, బ్రిటన్‌లోనూ 5 లక్షల మంది మృత్యువాత పడవచ్చని లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీ జరిపిన ఓ అధ్యయనం అంచనా వేసింది. టాయిలెట్‌ పేపర్‌ కొరత కూడా అమెరికన్లను వేధిస్తోంది. న్యూ ఓరెగాం రాష్ట్రంలో అనేకమంది టాయిలెట్‌ పేపర్ల కోసం ఎమర్జెన్సీ సర్వీసు- 911 కు ఫోన్‌ చేయడం విశేషం.

త్వరలోనే వ్యాక్సిన్ తయారీ

కొత్త కరోనావైరస్‌కు వ్యాక్సిన్ తయారు చేయటానికి ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు చాలా కష్టపడుతున్నప్పటికీ.. ప్రస్తుతం ఎలాంటి వ్యాక్సిన్ లేదు. వాస్తవంగా అయితే.. వచ్చే సంవత్సరం మధ్య వరకూ వ్యాక్సిన్ సిద్ధం కాబోదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. జంతువుల మీద వ్యాక్సిన్ పరీక్షలు ఇప్పటికే మొదలయ్యాయి. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈ ఏడాది చివర్లో మనుషుల మీద పరీక్షించే అవకాశముందని అమెరికా ప్రభుత్వం చెబుతోంది. మెడికల్‌ టెలిహెల్త్‌ సర్వీసులను విస్తృతం చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ‘ఇక నుంచి పేషెంట్లు తమ సమీప డాక్టర్లను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కాంటాక్ట్‌ చేయవచ్చు. ఫేస్‌టైమ్‌ లేదా స్కైప్‌ను వినియోగించండి’ అని ఆయన పిలుపునిచ్చారు.

చట్టసభ ప్రతినిధులకు కోవిడ్

అమెరికాలో ఇద్ద‌రు చ‌ట్ట‌స‌భ‌ ప్ర‌తినిధుల‌కు క‌రోనా వైర‌స్ సోకింది. రిప‌బ్లిక‌న్ నేత మారియో డియాజ్ బ‌లార్ట్‌, డెమోక్ర‌టిక్ నేత బెన్ మెక్ ఆడ‌మ్స్‌లు క‌రోనా ప‌రీక్ష‌లో పాజిటివ్‌గా తేలింది. అమెరికాలో ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య 150 దాటింది. ప‌దివేల మందికి వైర‌స్ సోకింది. ఫ్లోరిడాకు చెందిన మారియో డియాజ్‌.. వైర‌స్ సోకిన తొలి అమెరికా నేత‌గా నిలిచారు. డియాజ్ జ్వ‌రం, త‌ల‌నొప్పితో బాధ‌ప‌డుతున్నారు. బుధవారం నిర్వ‌హించిన ప‌రీక్ష‌లో ఆయ‌న‌కు కోవిడ్‌-19 సోకిన‌ట్లు తేలింది. దీంతో వాషింగ్ట‌న్ డీసీలో ఉన్న త‌న అపార్ట్‌మెంట్‌లో క్వారెంటైన్ అయిన‌ట్లు డియాజ్ ఓ ప్ర‌క‌ట‌న రిలీజ్ చేశారు. గ‌త శ‌నివారం త‌న‌కు స్వ‌ల్ప జ‌లుబు ల‌క్ష‌ణాలు న‌మోదు అయిన‌ట్లు కూడా బెన్‌మెక్ ఆడ‌మ్స్ తెలిపారు. తాను కూడా సెల్ఫ్ క్వారెంటైన్ అయిన‌ట్లు ఆడ‌మ్స్ చెప్పారు.

పెరిగిన కేసులు

అమెరికాలో కరోనా వైరస్‌తో బుధవారం ఏకంగా 44 మంది మృతిచెందారు. దీంతో అక్కడ మృతుల సంఖ్య 153కి చేరింది. కరోనా వైరస్ కేసుల సంఖ్య దాదాపు 10 వేలకు చేరువయ్యాయి.

Tags : coronavirus, covid-19, america, corona prevention, precautions, trump, toilet paper, 911,

Advertisement

Next Story

Most Viewed