సీఎంఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్

by vinod kumar |
సీఎంఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలోని కరోనా ఉధృతి ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని తాకింది. పాత సచివాలయంలోని సీఎంఓ కార్యాలయం బేగంపేట్‌లోని మెట్రోరైల్ భవన్‌లోకి షిప్టు కావడంతో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో కార్యాలయంలోని పలు ఛాంబర్లలో శానిటైజేషన్ ప్రక్రియ పూర్తయింది. వెంటనే అక్కడి వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 30మంది ఉద్యోగుల నమూనాలను సేకరించి నిర్ధారణ కోసం నగరంలోని ఛెస్ట్ ఆసుపత్రికి పంపారు. రిపోర్టులు ఆదివారం రానున్నాయి. ఇప్పటిదాకా నిమ్స్, గాంధీ, కింగ్ కోఠి, పేట్ల బురుజు లాంటి ప్రభుత్వాసుపత్రుల్లో డాక్టర్లకు కరోనా వచ్చిన వార్తలు చూశాం. ఇప్పుడు సీఎంఓ కార్యాలయంలో ఒక ఐఏఎస్ అధికారి దగ్గర పనిచేసే సీనియర్ ఉద్యోగికి కరోనా రావడంతో ఒక్కసారిగా ఉద్యోగుల్లో కలకలం రేగింది.

మెట్రో రైల్‌ భవన్‌లో పనిచేస్తున్న సీఎంవో ఉద్యోగి కుమారుడు ఇటీవలే మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు వచ్చారని, అతని ద్వారానే సోకి ఉండవచ్చని వైద్యాధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఊహించని పరిణామంతో సీఎంవో ఆఫీసుకు ఎవరూ రావొద్దని అన్ని శాఖల అధికారులకూ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. కొద్దిరోజుల పాటు సీఎంవో కార్యాలయం బంద్ కావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అధికారులు మాత్రం ఈ విషయాన్ని ఇంకా ధృవీకరించలేదు.

కరోనా వైరస్ వయసు ఎక్కువగా ఉన్నవారిని, అనారోగ్యంతో బాధపడుతున్నవారిని ఇబ్బంది పెడుతుందని ప్రభుత్వమే చెప్తున్న పరిస్థితుల్లో సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందిలో చాలా మంది యాభై ఏళ్ళ పైబడినవారే కావడంతో ఆందోళన ఒకింత ఎక్కువగానే ఉంది. కొద్దిమంది పదవీ విరమణ చేసినవారు వివిధ హోదాల్లో పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగికి కరోనా అని తేలడంతో సీనియర్ సిటిజెన్లుగా ఉన్న సిబ్బంది ఇతర ప్రాంతాల నుంచి పని చేయడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారు. ఒక సీనియర్ అధికారి కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయం నుంచి విధులు నిర్వహించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed