భయపడొద్దు.. జాగ్రత్తగా చూసుకుంటాం

by vinod kumar |
భయపడొద్దు.. జాగ్రత్తగా చూసుకుంటాం
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో కరోనా కేసులు పంజా విసురుతున్న విషయం తెలిసిందే. మంగళవారం టెక్రియాల్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలకు చెందిన 32 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ తేలడంతో బుధవారం కలెక్టర్ శరత్ పాఠశాలను సందర్శించారు. వైద్యులను, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈసందర్బంగా పాఠశాల ఎస్.ఓ లావణ్యపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు ప్రభుత్వం కోవిడ్ టీకా పంపిణీ చేస్తూ నివారణకు కృషి చేస్తుంటే ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని ప్రశ్నించారు. మీ నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల నుంచి ఇంటికి వెళ్లి వచ్చిన విద్యార్థులను ఐసోలేషన్ చేయాలని తెలియదా అని ప్రశ్నించారు. ఎవరో ఒకరు విద్యార్థి కరోనా భారిన పడి ఉండవచ్చని, దానివల్ల అందరికి సోకి ఉంటుందన్నారు. పాఠశాలలో కరోనా సోకిన విద్యార్థులకు ప్రత్యేక ఐసోలేషన్ ఏర్పాటు చేయాలని సూచించారు.

ఇక్కడ వసతి లేకపోతే తమకు చెప్పాలన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. అనంతరం తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. ఎవరు భయపడవద్దని సూచించారు. తాము అన్ని విధాలా జాగ్రత్తగా చూసుకుంటామని భరోసా కల్పించారు. ఇబ్బంది అనుకుంటే ఇంటికి వెళ్లాలని, ఇంటి దగ్గర జాగ్రత్తలు పాటించాలన్నారు. అంతకుముందు పాఠశాల మొత్తం శానిటేషన్ చేయించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, ఆర్డీఓ శ్రీను, తహసీల్దార్ ప్రేమ్ కుమార్, మెడికల్ ఆఫీసర్ సుస్మిత రాయ్, కౌన్సిలర్ శంకర్ రావు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed