అందరినీ పరేషాన్ చేసిన కరోనా పేషెంట్

by Shyam |
అందరినీ పరేషాన్ చేసిన కరోనా పేషెంట్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: నేను ఈ దవాఖానాల ఉండను… నేను మా ఇంటికే పోతా అంటూ పెట్టెబేడా సర్దుకుని ఎంచక్కా బయటకు వచ్చేస్తున్నాడు. డ్యూటీలో ఉన్న ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు వారించినా ఆయన అలాగే బయటకు వెళ్తున్నాడు. దగ్గరకు వెళ్లి అతన్ని నిలువరించే ప్రయత్నం చేద్దామంటే తాము వ్యాధి బారిన పడితే ఎలా అన్న భయం ఓ వైపున అతన్ని అలాగే వదిలేస్తే సమాజానికే నష్టం అన్న ఆందోళన కల్గుతున్న ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు వారంతా. అక్కడే ఉండూ వార్డులోపలకు వెళ్లు అంటూ అతన్ని మాటలతోనే ఆపే ప్రయత్నం చేశారు. చివరకు స్థానిక ఎస్సై రంగంలోకి దిగి అతన్ని వారించడంతో ఐసోలేషన్ వార్డులోకి వెల్లిపోయాడు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బాధితుడు అందరిని పరేషాన్ చేశాడు. రామగుండానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ కావడంతో పెద్దపెల్లిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. గురువారం రాత్రి బాధితుడు ఇంటికి వెళ్లిపోతానని బట్టల సంచితో బయళ్దేరడంతో మెడికల్, పోలీస్ అధికారులు ఆందోళన చెందారు. ఐసోలేషన్ వార్డు నుండి నేరుగా ఆస్పత్రి ఆవరణలోకి వచ్చాడు. అతన్ని గమనించిన ఆసుపత్రి సిబ్బంది పోలీసులు అతన్ని వారించినా వినకుండా బయటకు వెళ్లేందుకే ముందుకు సాగాడు. దాదాపు గంటసేపు ఇబ్బంది పెట్టాడు. చివరకు శుక్రవారం ఇంటికి పంపిస్తామని పెద్దపల్లి ఎస్సై రాజేష్ తో పాటు వైద్యులు, సిబ్బంది అతనికి నచ్చచెప్పడంతో తిరిగి ఐసోలేషన్ వార్డులోకి వెళ్లాడు. ఎంత చెప్పినా వినకుండా కరోనా బాధితుడు మొండిగా వ్యవహరించడంతో అతన్ని కట్టడి చేయడం ఎలా అని ఆందోళన చెందారు. చివరకు వార్డులోపలకు వెల్లడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed