కరోనా మళ్లీ వస్తోంది.. జరభద్రం..?

by Anukaran |
Corona
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా పూర్తిగా కనుమరుగు కాలేదని, జాగ్రత్తలు పాటించకపోతే మళ్లీ తిరగబెట్టే చాన్స్​ ఉన్నదని సీఎస్​ సోమేష్​కుమార్ హెచ్చరించారు. ప్రపంచంలోని పలు పాశ్చాత్య దేశాలైన బ్రిటన్, రష్యా, ఉక్రెయిన్, బ్రెజిల్, జర్మనీ, నెదర్లాండ్ తదితర దేశాలతో పాటు చైనా లోనూ కొవిడ్​మళ్లీ తిరిగి ప్రబలినట్టు పేర్కొన్నారు. దీంతో పాటు మహరాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోనూ కేసులు పెరుగుతున్నట్లు గుర్తుచేశారు. ఈ క్రమంలో వ్యాక్సినేషన్‌ను స్పీడప్​చేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన నొక్కి చెప్పారు. వంద శాతం వ్యాక్సిన్​లక్ష్యాన్ని సాధించేందుకు క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సీఎస్​అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. వాక్సినేషన్ పై మంగళవారం బీఆర్‌కే భవన్‌లో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎస్​ మాట్లాడుతూ.. ఇప్పటివరకు మూడు కోట్ల వ్యాక్సిన్లను పంపిణీ చేశామని, అర్హులందరికీ వేగంగా పూర్తి చేయాలలని ఆదేశించారు. అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో వ్యాక్సినేషన్‌ను మరింత ఉధృతంగా చేపట్టేందుకు వార్డు స్థాయి నుంచి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ ప్రత్యేక బృందంలో ఆశా వర్కర్, అంగన్వాడీ వర్కర్, పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఏ లను సభ్యులుగా భాగస్వామ్యం చేయాలన్నారు. పర్యవేక్షణ కోసం ప్రతీ గ్రామానికి ఒక నోడల్ అధికారిని, మండలానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించాన్నారు. వీరు ఆయా ప్రాంతాల్లో వ్యాక్సిన్ డోసులు, సిరంజీలు సరిపడా ఉన్నాయో లేదో? ఎప్పటికప్పుడు మానిటరింగ్​ చేయాలన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పంచాయతీ రాజ్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణ, ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫ్ రాజ్ అహ్మద్, పంచాయతీ రాజ్ కమిషనర్ డాక్టర్ ఎ.శరత్, మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్, ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాస్ రావు, వైద్య విద్యా శాఖ సంచాలకులు డాక్టర్ రమేష్ రెడ్డి, ఓఎస్‌డీ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed