కరోనా రెండు రకాలుగా సోకుతది: నల్లగొండ ఎస్పీ

by Shyam |
కరోనా రెండు రకాలుగా సోకుతది: నల్లగొండ ఎస్పీ
X

దిశ ప్రతినిధి, నల్లగొండ : కరోనా వైరస్ సామూహిక వ్యాప్తికి చేరుకున్న నేపథ్యంలో పోలీస్ అధికారులు గ్రామీణ ప్రాంత ప్రజలలో కోవిడ్ -19పై మరింత అవగాహన కల్పించేలా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని నల్లగొండ జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ చెప్పారు. అదనపు ఎస్పీ నర్మద నేతృత్వంలో మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కోవిడ్ బారిన పడి కోలుకుని తిరిగి విధుల్లో చేరిన పోలీస్ అధికారులు, సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా సోకిన వారు ఎవరూ భయపడవద్దని చెప్పారు. కరోనా రెండు రకాలుగా వస్తుందని దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలతో కూడిన పాజిటివ్ వచ్చిన వ్యక్తులు కచ్చితంగా వైద్యులను సంప్రదించి వారి సూచనల ప్రకారం చికిత్స చేయించుకోవాలని చెప్పారు. యాంటీ వైరల్ డ్రగ్స్, స్టెరాయిడ్స్ తీసుకోవడం ద్వారా శరీరంలో ఇమ్యూనిటీ పెంచడం ద్వారా కరోనా నుండి బయట పడేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

పాజిటివ్ వచ్చిన వాళ్లు వారి శరీరంలో జరుగుతున్న మార్పులను గమనిస్తూ అందుకు అనుగుణంగా చికిత్స పొందాలని, కరోనా సోకిన వ్యక్తులు అయిదవ రోజు నుండి 12వ రోజు వరకు అత్యంత జాగ్రత్తగా ఉండాలని వైద్యుల సూచనలు పాటించాలని సూచించారు. అదే సమయంలో అసలు ఎలాంటి లక్షణాలు లేకుండా సైతం చాలా మందికి కరోనా పాజిటిక్ నమోదు అవుతున్నదని అలాంటి వారు కనీసం 14 రోజుల పాటు హోం క్వారంటైన్ పాటించడం, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడం ద్వారా చాలా మంది కరోనాను జయిస్తున్నారని తెలిపారు.

ఈ విపత్కర పరిస్థితిలో సమాజం మొత్తం ఒకటిగా ఉండాల్సిన సమయమన్నారు. కరోనా వైరస్ సామూహిక వ్యాప్తి దశకు చేరుకున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించేలా పోలీస్ అధికారులు స్థానిక సర్పంచులతో కలిసి కృషి చేయాలని, తద్వారా మరింత నష్టం జరగకుండా ప్రజలను రక్షించాలని ఆయన సూచించారు. రాబోయే రెండు, మూడు నెలలు పోలీస్ సిబ్బంది, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉంటూ అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తూ స్వీయ నియంత్రణతో కరోనా మహమ్మారిపై పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదని ఎస్పీ రంగనాధ్ చెప్పారు.

ప్రస్తుతం కరోనా గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించిందని, కమ్యూనిటీ స్ప్రెడ్ క్రమంలో గ్రామీణ ప్రాంతాల ప్రజలు కరోనా బారిన పడకుండా పోలీస్ అధికారులు అన్ని గ్రామాలను సందర్శించి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ రంగనాధ్ తెలిపారు. ఆవిరి పట్టడం, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడం, వైద్యులు సూచించిన మెడిసిన్ తీసుకోవడం ద్వారా త్వరగా కోలుకోవచ్చని డిపిఓ సూపరింటెండెంట్ అతిఖుర్ రెహమాన్ తమ అభిప్రాయం తెలిపారు. కరోనా వచ్చిన వారు ఎవరు భయపడవద్దని అన్ని రకాల జాగ్రత్తలు, స్వీయనియంత్రణ పాటిస్తూ తాను కరోనాను జయించానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సి. నర్మద, ఏఆర్ డీఎస్పీ సురేష్ కుమార్, పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్, డీపీవో సూపరింటెండెంట్ అతిఖుర్ రెహమాన్, ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్, కరోనాను జయించిన పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed