పాతబస్తీలో పొంచి ఉన్న ప్రమాదం

by vinod kumar |
పాతబస్తీలో పొంచి ఉన్న ప్రమాదం
X

దిశ, హైదరాబాద్ : కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. దేశాలన్నీ వైరస్ వ్యాప్తికి వణికిపోతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ దాదాపుగా లాక్ డౌన్ బాట పడుతున్నాయి. వైరస్ ను అరికట్టేందుకు ప్రభుత్వాలే లాక్ డౌన్ ప్రకటించాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఫలితంగా మన దేశంలో 10 రోజులుగా లాక్ డౌన్ అమల్లో ఉంది. కరోనా వైరస్ సోకిన బాధితులు పెరుగుతున్న కొద్దీ వైరస్ వ్యాపించిన మూలాలు క్రమేపీ వెలుగులోకి వస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే వైరస్ వ్యాప్తి ప్రమాదం ఉందని భావించిన ప్రభుత్వాలు.. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి ఢిల్లీ కేంద్రంగా నిర్వహించిన ప్రార్థనల చుట్టూ తిరుగుతోంది. కరోనా వైరస్ కు కులం, మతం, ప్రాంత బేధాలు లేనందున వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాల్సిందే. అందుకు వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత, స్వీయ నిర్భంధం, సామాజిక దూరం పాటించాలంటూ ప్రభుత్వం పదే పదే చెబుతోంది.

ఢిల్లీ ప్రార్థనల నేపథ్యంలో..

ఢిల్లీ ప్రార్థనలకు గల్ఫ్ దేశాలకు చెందిన వారు కూడా హజరు కావడంతో.. ఈ ప్రార్థనలకు వెళ్ళొచ్చిన వారందర్నీ అధికారులు గుర్తిస్తున్నారు. గుర్తించిన వారందరినీ కరోనా నిర్థారణ పరీక్షలకు పంపుతున్నారు. అవసరమైతే క్వారంటైన్ లో ఉంచుతున్నారు. అందుబాటులో లేని మరికొందరిని ఫోన్ నంబర్ ఆధారంగా పట్టుకుంటున్నారు. అన్నింటికంటే ముందు ఢిల్లీ ప్రార్థనలకు ఎవరైతే వెళ్లారో వారంతా స్వచ్ఛంధంగా సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. ప్రభుత్వానికి సహకరించేందుకు మత్త పెద్దలు కూడా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, వారందర్నీ గుర్తించే పనిలో ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ మత ప్రచారానికి వచ్చిన వారిలోనే కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా రావడంతో.. ఇప్పడు దృష్టంతా ప్రార్థనలకు వెళ్ళి వచ్చినవారిపైనే ప్రభుత్వం కేంద్రీకరించింది. అయితే, హైదరాబాద్ నగరంలో ముస్లీం జనాభా అధికంగా ఉండడంతో, ముఖ్యంగా పాతబస్తీలో మెజార్టీ ప్రజలు ముస్లీంలే ఉంటున్నందున పాతబస్తీకి కరోనా ప్రమాదం పొంచి ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు.

పాటించని సామాజిక దూరం…

తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు వెయ్యికి పైగా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్ళినట్టు అధికార వర్గాల సమాచారం. అందులో గ్రేటర్ హైదరాబాద్ నుంచి సుమారు 604 మంది ఉండగా, హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో దాదాపుగా 164 మందికి పైగా ఉన్నట్టు తెలుస్తోంది. సుమారు 20 మందికి కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. అంతే కాకుండా, మంగళవారం పాజిటివ్ లక్షణాలు కలిగిన వ్యక్తి ఒకరు మరణించారు. హైదరాబాద్ పాతబస్తీలో కరోనా ప్రభావం ఇంతటి ప్రమాదకరంగా ఉంటే ఇక్కడి ప్రజలు కనీసం జాగ్రత్తలు తీసుకోవడం లేదు. అయితే, చార్మినార్, మక్కా మసీదు ప్రధాన రహదారి నిర్మానుష్యంగానే ఉన్నప్పటికీ, పాతబస్తీలోని అంతర్గత రహదారులు, మసీదులు, పలు కూడళ్ళలలో ప్రజలు ఏమాత్రం సామాజిక దూరం పాటించడం లేదు. పోలీసు గస్తీ సమయంలో మాత్రమే జాగ్రత్తలు పాటిస్తున్నారు. మార్కెట్లు, రేషన్ దుకాణాల వద్ద కనీసం సోషల్ డిస్టెన్స్ కూడా పాటించడం లేదు. అయితే, ఈ పరిస్థితులను ప్రభుత్వ అధికారులు చక్కదిద్దాలని స్థానికులు కోరుతున్నారు.

Tags: Corona Effect on Old City, Hyderabad, Charminar, No Social Distance

Advertisement

Next Story