కరోనా కేసులు పెరుగుతున్నాయ్ జాగ్రత్త!

by vinod kumar |
కరోనా కేసులు పెరుగుతున్నాయ్ జాగ్రత్త!
X

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది. కేసులు, మరణాల సంఖ్య క్రమేపీ పెరుగుతున్నాయి. తాజాగా 24 గంటల్లో మరో 8,909 కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. మొత్తం కేసులు 2లక్షల మార్కును దాటి 2,08,543కు చేరుకున్నాయి. గత 15 రోజుల కాలంలోనే లక్ష కేసులు నమోదు కావడం గమనార్హం. మరో 221మంది మృతిచెందారు. తాజా మరణాలతో మృతుల సంఖ్య 5,834కు చేరుకుంది. 24గంటల్లో 4,531 మంది కొవిడ్-19 నుంచి కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 2,08,543 కేసుల్లో 1,00,419 మంది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాగా, 1,06,253 మంది చికిత్స పొందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఏడు దేశాల్లో 2లక్షల కేసులు నమోదయ్యాయి. అమెరికా, బ్రెజిల్, రష్యా, స్పెయిన్, యూకే, ఇటలీ తర్వాత భారత్‌లో ఈ స్థాయిలో కేసులు ఉన్నాయి. మన దేశంతో పోలిస్తే అమెరికా, రష్యా, బ్రెజిల్‌లో కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. యూకే, స్పెయిన్, ఇటలీలో కేసుల వృద్ధిరేటు క్రమేపీ తగ్గుతోంది. స్పెయిన్‌లో మొదటి లక్ష కేసులు నమోదు కావడానికి కేవలం 59 రోజులు పట్టింది. ఆ తర్వాత ఇటలీ 60 రోజులు, అమెరికా 67, బ్రెజిల్ 68, జర్మనీ 71, పెరూ 75, యూకే 77, ఫ్రాన్స్ 81, రష్యాకు 90 రోజుల్లో లక్ష మార్కును దాటాయి. భారత్‌లో ముందస్తుగా లాక్‌డౌన్ ప్రకటించడంతో కేసుల నమోదు నెమ్మదించింది. దేశంలో జనవరి 30న తొలి కేసు నమోదైంది. మే 19 నాటికి లక్ష కేసులు దాటాయి. ఇందుకు 110 రోజుల సమయం పట్టింది. లాక్‌డౌన్ ఆంక్షల్లో సడలింపులు ఇవ్వడంతో కేవలం 15రోజుల్లో మరో లక్ష కేసులు నమోదయ్యాయి.

మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి రావడం లేదు. తాజాగా 24గంటల్లో 2,358 కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 70,013కు చేరుకుంది. 76మంది మృతిచెందగా మొత్తం మృతుల సంఖ్య 2,362కు చేరుకుంది. మహారాష్ట్రలో 24 గంటల్లో కరోనా బారినపడిన వారిలో 47 మంది పోలీసులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర తర్వాత తమిళనాడులో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. తాజా 1,162 మంది వైరస్ బారిన పడగా మొత్తం కేసుల సంఖ్య 23,495కు చేరుకుంది. ఢిల్లీలో 990 కేసులు నమోదు కాగా మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 20,834కు చేరుకుంది. గుజరాత్‌లో 17,200( 24 గంటల్లో 421), రాజస్థాన్ 8,890(24గంటల్లో 149) కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 2,08,543 కేసులు నమోదైతే మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్‌లోనే 1,40,522 కేసులు ఉన్నాయి. అంటే దాదాపు 68 శాతం కేసులు ఈ రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. మొత్తం మరణాల్లో కూడా పైన పేర్కొన్న ఐదు రాష్ట్రాల్లోనే అత్యధికంగా ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 5,834 కరోనాతో మృతిచెందారు. ఆ ఐదు రాష్ట్రాల్లోనే 4327 మరణాలు (75 శాతం) నమోదయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed