ఏపీ కరోనా @ 893

by srinivas |
ఏపీ కరోనా @ 893
X

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. భారీ సంఖ్యలో కేసులు నమోదవుతూ రాష్ట్ర పాలకులతో పాటు అధికారులు, ప్రజల్లో ఆందోళన పెంచుతున్నాయి. ఒక్క రోజే 80 కేసులు నమోదవడం రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న విధానాన్ని వెల్లడిస్తోంది. గత మూడు రోజుల్లో 170 కేసులు నమోదు కావడం రాష్ట్రంలో వైరస్ తీవ్రతను తెలియజేస్తోంది.

ఏపీలో గడచిన 24 గంటల్లో 80 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. కర్నూలులో కొత్తగా 31, గుంటూరులో 18, చిత్తూరు జిల్లాలో 14, అనంతపురంలో 6, తూర్పు గోదావరి జిల్లాలో 6, ప్రకాశం జిల్లాలో 2, కృష్ణా జిల్లాలో 2, విశాఖ జిల్లాలో ఒక కేసులు నమోదయ్యాయని ప్రకటించింది. దీంతో లాక్‌డౌన్ విధించిన సరిగ్గా నెల రోజులకు ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 893కి చేరుకుంది.

గత మూడు వారాలుగా కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కరోనా వైరస్‌ తీవ్రత ప్రమాదకర స్థాయిలో ఉంది. లాక్‌డౌన్, కఠిన ఆంక్షలు, సర్వేలు, క్వారంటైన్, ఐసోలేషన్, రెడ్ జోన్, చికిత్స ఇలా ఎన్ని ఆంక్షలు విధించినా కరోనా కంట్రోల్ కావడం లేదు. ఏపీలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో 46 శాతానికి పైగా కేసులు ఈ రెండు జిల్లాల్లోనే నమోదు కావడం గమనార్హం. దీంతో ఈ జిల్లాల వాసుల్లో కరోనా భయం పెరిగిపోతోంది.

కరోనా కారణంగా మృతుల సంఖ్య 27కి చేరింది. ఏపీలో 893 కేసులు నమోదు కాగా, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు 725 మంది. వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకుని 141 మంది డిశ్చార్జ్ అయ్యారు.

tags: coronavirus, covid-19, ap, health department

Advertisement

Next Story

Most Viewed