ప్రభుత్వం పట్టు'తప్పె'.. కరోనా కట్టుదప్పె!

by Shyam |   ( Updated:2020-06-05 21:27:25.0  )
ప్రభుత్వం పట్టుతప్పె..  కరోనా కట్టుదప్పె!
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వైరస్‌ను ఎదుర్కోవడం రాష్ట్ర ప్రభుత్వానికి సవాలుగా మారింది. వైరస్ వ్యాప్తిని అదుపులో పెట్టాలంటే లాక్‌డౌన్ ఆంక్షలను కొనసాగించక తప్పట్లేదు. ప్రజలందరినీ ఇంటిపట్టునే ఉంచి దీర్ఘకాలం ప్రభుత్వమే పోషించడం కష్టసాధ్యమవుతోంది. అందుకు తగిన ఆర్థిక స్థోమత ప్రభుత్వానికి లేదు. ఆదాయం కోసం ఆంక్షలను ఎత్తివేస్తే వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ‘బతికుంటే బలుసాకు తినొచ్చు’ అని పైకి చెప్పినా దాన్ని ఆచరించడం సులభమేమీ కాదని ప్రభుత్వానికి అర్థమైపోయింది. ఇటు ప్రజల ప్రాణాలూ ముఖ్యమే.. అటు ఆర్థిక వనరులను సమకూర్చుకోవడమూ అవసరమే. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుని వ్యవహరించడం ప్రభుత్వానికి కత్తిమీద సాములా మారింది. తగిన జాగ్రత్తలు తీసుకునే డాక్టర్లు, వైద్య సిబ్బందికే వందల సంఖ్యలో పాజిటివ్ వస్తుంటే ఇక రోడ్లమీద ప్రజల కదలికలు పెరగడంతో నియంత్రించడం ప్రభుత్వానికి తలకు మించిన భారమవుతోంది. కరోనాకు మందు లేదా వ్యాక్సిన్ వచ్చేంత వరకు ప్రభుత్వానికి ముందు నుయ్యి వెనక గొయ్యి లాంటి పరిస్థితి తప్పదు.

ఆంక్షల సడలింపులతో..

లాక్‌డౌన్ పటిష్టంగా అమలైనప్పుడు అదుపులోనే ఉన్న వైరస్ వ్యాప్తి ఆంక్షలు సడలించడంతో ఉధృతమైంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మే 18 నుంచి రాష్ట్రంలో ఆంక్షల సడలింపు మొదలైంది. అప్పటివరకూ (మే 17) రాష్ట్రం మొత్తం మీద 1,551 పాజిటివ్ కేసులుంటే జూన్ 4 నాటికి రెట్టింపై 3,147కు చేరుకుంది. మార్చి 2వ తేదీన తొలి కేసు నమోదైన తర్వాత వెయ్యి కేసులకు చేరుకోడానికి 56 రోజులు పట్టింది. కానీ, ఆ తర్వాతి వెయ్యి కేసులకు 36 రోజులు పట్టింది. ఇప్పుడు మూడవ వెయ్యి కేసులకు కేవలం వారం రోజులే పట్టింది. దీన్ని బట్టి కేసులు ఎంత వేగంగా పెరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు టెస్టులు చాలా తక్కువగా చేస్తోందని కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖతో పాటు వివిధ వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు నగరంలోని స్థానిక కేసులతో పాటు విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారి ద్వారా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గాంధీ ఆసుపత్రిలో బెడ్‌లు సరిపోక గచ్చిబౌలిలోని టిమ్స్ నుంచి సమకూర్చుకోవాల్సి వస్తోంది.

సడలింపులతో పెరుగుతున్న కేసులు

రాష్ట్రంలో తొలి కరోనా పాజిటివ్ కేసు మార్చి 2వ తేదీన నమోదైంది. అప్పటి నుంచి మార్చి 14 వరకు ఒక్క కొత్త కేసు కూడా రాలేదు. తొలుత విదేశీ ప్రయాణీకుల ద్వారా వచ్చిన కరోనా వైరస్ ఆ తర్వాత మర్కజ్ యాత్రకు వెళ్ళివచ్చినవారితో తీవ్రమైంది. జనతా కర్ప్యూ వచ్చేనాటికి రాష్ట్రం మొత్తం మీద కేవలం 19 కుటుంబాలకు చెందిన 22 మందికి మాత్రమే పాజిటివ్ నమోదైంది. లాక్‌డౌన్ పకడ్బందీగా కొనసాగిన మే నెల 17వ తేదీ వరకు మొత్తం 75 రోజుల వ్యవధిలో 1,551 కేసుల స్థాయికి చేరుకుంది. మే నెల 18 నుంచి ఆంక్షలు సడలడంతో రెండు వారాల వ్యవధిలోనే ఆ సంఖ్య రెట్టింపైంది. ఆంక్షలు పటిష్టంగా అమలైనప్పుడు వైరస్ వ్యాప్తి అదుపులో ఉంటే సడలింపులతో అది వీగిపోయింది. కరోనాను కట్టడి చేయాలంటే లాక్‌డౌన్ తప్పదంటూ స్వయంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించి కేంద్ర ప్రభుత్వంకంటే ఒక అడుగు ముందుకేసి లాక్‌డౌన్‌ను మే 31 వరకూ కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు కంటైన్‌మెంట్ జోన్లు మినహా రాష్ట్రమంతా మామూలు స్థితి నెలకొనడంతో వైరస్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.

వలస కార్మికులతో..

స్థానికంగా ఒకరి నుంచి మరొకరికి అంటుకోవడమే కాకుండా శ్రామిక్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళ ద్వారా వచ్చే వలస కార్మికులు, విమానాల ద్వారా వచ్చే ప్రయాణికులు, విదేశాల నుంచి వందేభారత్ విమానాల ద్వారా వచ్చేవారు.. ఇలా అనేక కారణాలతో వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దుబాయ్ నుంచి వచ్చిన 458 మంది ప్రయాణికుల్లో దాదాపు సగం మంది పాజిటివ్ పేషెంట్లుగా తేలారు. వలస కార్మికుల్లో సైతం 200 మందికిపైగా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో మున్ముందు వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో మరింతగా పెరిగే వైరస్ వ్యాప్తిని ఎదుర్కోవడం ఇప్పుడు ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు ఇప్పటికే ఆసుపత్రుల్లో తగినంత సంఖ్యలో బెడ్‌లు సమకూర్చడం కష్టంగా మారుతూ ఉంది. మరోవైపు వారికి చికిత్స చేసే వైద్యులకు కూడా ఇన్‌ఫెక్షన్ సోకుతోంది. ఇంకోవైపు కరోనా మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. గత పది రోజులుగా ప్రతీరోజు సగటున ఐదారు మంది కరోనా కారణంగా చనిపోతున్నారు.

టెస్టులు చేయడంలేదని విమర్శలు

తెలంగాణలో తక్కువ సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారన్న విమర్శ ప్రభుత్వంపై తీవ్రంగాఉంది. ఒక దశలో కేంద్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సైతం ఘాటుగా లేఖ రాసి టెస్టులు తక్కువ సంఖ్యలో చేస్తున్నందువల్లనే పాజిటివ్ కేసులు బైటకు రావడంలేదని వ్యాఖ్యానించారు. కానీ, ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ ప్రకారమే చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం బదులిస్తోంది. రాష్ట్రంలో వైరస్ కేసులు నమోదైన తొలినాళ్లలో ఒక పాజిటివ్ పేషెంట్‌తో సంబంధాల్లో ఉన్న ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను సైతం వెతికి మరీ టెస్టులు చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఒకవేళ పాజిటివ్ అయినప్పటికీ కరోనా లక్షణాలు కనిపించకపోతే పరీక్ష చేయాల్సిన అవసరం లేదనే వైఖరి తీసుకుంది. ఇప్పటివరకు సుమారు 36 వేల టెస్టులు జరిగినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం సుమారు మూడున్నర లక్షల టెస్టింగ్ కిట్లు ఇస్తామన్నా తీసుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం నోడల్ ఏజెన్సీకి ఇండెంట్ ఇవ్వలేదని కేంద్ర వైద్యారోగ్య శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఒకవైపు ఎలాంటి లక్షణాలు లేకుండానే పాజిటివ్ వస్తోందని ప్రభుత్వం చెప్తూనే మరోవైపు పరీక్షలు చేయడానికి చొరవ తీసుకోవడంలేదు. రాష్ట్ర హైకోర్టు సైతం ఒక పిటిషన్‌పై విచారణ సందర్భంగా టెస్టుల సంఖ్య పెంచాలని సూచించింది. ఆర్థిత స్థోమత ఉన్నవారు ప్రైవేటు లేబొరేటరీల్లో పరీక్షలు చేయించుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించాలని సూచించింది. ఐసీఎంఆర్ ప్రైవేటు లేబొరేటరీల జాబితాను ప్రకటించి అనుమతి ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అనుమతి ఇవ్వలేదు. అయినా కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో గుట్టుచప్పుడు కాకుండా పరీక్షలు, చికిత్స జరుగుతూనే ఉన్నాయి.

అంతా గోప్యమే

కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలన్నీ గోప్యంగానే జరుగుతున్నాయి. ఎన్ని టెస్టులు జరిగాయో, ఎంత మంది పేషెంట్లు ఏయే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారో, మృతి చెందినవారు ఏయే జిల్లాలకు చెందినవారో, వలస కార్మికులు వచ్చిన తర్వాత ఎన్ని జిల్లాల్లో వారు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారో, ఎంత మంది ఇంకా క్వారంటైన్‌లో ఉన్నారో, ఎంత మందికి ఆక్సిజన్, వెంటిలేటర్ అవసరం ఏర్పడిందో, ఎన్ని టెస్టింగ్ కిట్లు ఉన్నాయో, ఎన్ని పీపీఈ కిట్లు ఉన్నాయో, ప్రభుత్వం ఇప్పటివరకూ ఎన్ని కొనుగోలు చేసిందో.. ఇలా అనేక అంశాలు బహిర్గతం కాకుండా రహస్యంగానే ఉండిపోయాయి. కేంద్రం నుంచి కరోనా కట్టడి కోసం అందిన ఆర్థిక సాయం ఎంతో, దాన్ని ఏయే అవసరాలకు ఖర్చు పెట్టిందో కూడా తెలియదు. కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా ఉన్న వైద్య సిబ్బందిలో ఎంత మందికి ఇన్‌ఫెక్షన్ సోకిందో కూడా ప్రభుత్వం వెల్లడించలేదు. కరోనా కారణంగా మృతి చెందిన ఒక వ్యక్తి అంత్యక్రియలను అతని భార్యకు కూడా తెలియకుండానే పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది కలిసి చేసిన విషయం చివరకు కోర్టుదాకా వెళ్ళింది.

రూ. కోట్ల నిధులు..

వైద్యారోగ్య శాఖ కార్యాలయం ద్వారా అందిన వివరాల ప్రకారం ఏప్రిల్ 30వ తేదీ నాటికి కోటి రూపాయలు పెట్టి 200 బీఐపీఏపీ (పాజిటివ్ ఎయిర్‌వే ప్రెజర్) ఉపకరణాలను కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఒక్కో వెంటిలేటర్‌కు రూ. 7.27 లక్షల చొప్పున 322 కొత్తవాటిని సమకూర్చుకోడానికి రూ. 23.42 కోట్లను ఖర్చు చేసింది. కరోనా కట్టడికి అవసరమైన పలు చర్యల కోసం రూ. 370.06 కోట్లను విడుదల చేసింది. కాల్ సెంటర్, సర్వియలెన్స్ కార్యకలాపాల కోసం రూ. 2.37 కోట్లు ఖర్చు చేసింది. డాక్టర్లు, వైద్య సిబ్బంది ప్రోత్సాహకం కోసం రూ. 16 కోట్లను, నాలుగు ఆయుష్ ఆసుపత్రుల్లో 820 ఐసొలేషన్ బెడ్‌లను సిద్ధం చేయడానికి రూ. 44 లక్షలను, నిమ్స్‌లో ఐసొలేషన్ వార్డుల ఏర్పాటుకు అవసరమైన సివిల్ పనుల కోసం రూ. 42 లక్షలను, కరోనా కట్టడి ప్రచారం కోసం రూ. 85 లక్షలను, మందులు, డిస్పోజబుల్ పరికరాలు తదితరాల కోసం రూ. 349 కోట్లను ఖర్చు చేసినట్లు తెలిసింది.

తక్షణ కర్తవ్యమేంటి?

కరోనా కట్టడి చేయాలంటే లాక్‌డౌన్ తప్పనిసరి అని ముఖ్యమంత్రి చెప్తున్నారు. కానీ లాక్‌డౌన్‌తో ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. అటు ప్రజల ప్రాణాలు, ఇటు ఆదాయం… రెండూ ముఖ్యమే కాబట్టి ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పుడున్న అనిశ్చిత పరిస్థితి ఎంతకాలం ఉంటుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో పాజిటివ్ రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే అని చేతులెత్తేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed