సంక్రాంతి వేళ మండుతున్న నూనే ధరలు

by Shyam |
సంక్రాంతి వేళ మండుతున్న నూనే ధరలు
X

దిశ, ధర్మపురి: పండగ పూట వంట నూనె ధరలు ఆకాశాన్నంటాయి. పండుగ వచ్చిందంటే నిత్యావసర వస్తువుల ధరలు ఒకే సారి అమాంతం పెరిగి పోతున్నాయి. ముందే ఈ సంవత్సరం కరోనాతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ఆర్థికంగా అవస్థలు పడుతూనే ఉన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పిండి వంటలు చేయాలంటే నూనె ధరలు చూసి సామాన్యులు విలవిలలాడుతున్నారు. పెరిగిన ధరలతో పిండి వంటలు చేయాలంటే విముఖత చూపుతున్నారు.

రూ. 20 వరకు పెంపు

వంట నూనె ధరలు మండిపోతున్నాయి. నూనె ధరలు స్థాయికి మించి పెరగడంతో సామాన్య ప్రజలు కొనలేక సతమతమవుతున్నారు. నూనె ధరలు ఇలా ఉంటే పండుగ జరుపుకునేది ఎలా అని మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత నెలలో పల్లీ నూనె రూ.130 ఉండగా.. ప్రస్తుతం రూ. 150కి పెరిగింది. సన్​ ఫ్లవర్​ రూ. 120 నుంచి రూ. 135కి పెరిగింది. పామాయిల్ రూ. 100 నుంచి రూ. 120కి చేరింది. అవేకాక ఇతర నూనెల ధరలు కూడా పెరిగి పోయాయి.

పిండి వంటల పండుగ

సంక్రాంతి అంటేనే పిండి వంటల పండుగ. సకినాలు, గారెలు, మురుకులు, లడ్డూలు, అరిసెలు లాంటి వివిధ రకాలైన పిండి వంటలు చేసుకుంటారు. ఈ పదార్థాల్లో ఏది చేయాలన్నా నూనె తప్పనిసరి. కాగా, నూనెల ధరలు పెరిగితే చేసేదెలా అని మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు.

అప్పాలు చేసుకోలేక పోతున్నాం: ఉమ గృహిణి ధర్మపురి

ఈ సంవత్సరం నూనె ధరలు అధికంగా పెరగడంతో అప్పాలు చేసుకోలేక పోతున్నాం. ప్రతి సంవత్సరం రెండు మూడు రకాల పిండివంటలు చేసుకునేవాళ్లం. ఈ సారి నూనె ధరలు పెరగడంతో ఒకే రకం చేసుకున్నాం. అది కూడా తక్కువగానే చేసుకుంటున్నాం.

Advertisement

Next Story

Most Viewed