నాలుగు పిల్లర్‌లతో కాంగ్రెస్ శ్వేతపత్రం

by Shamantha N |
నాలుగు పిల్లర్‌లతో కాంగ్రెస్ శ్వేతపత్రం
X

న్యూఢిల్లీ: కరోనావైరస్ తొలి రెండు వేవ్‌లను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. కరోనా మరణాల వివరాలను దాచిపెట్టిందని, అధికారిక లెక్కల కంటే వాస్తవ మరణాలు ఐదారు రెట్లు ఎక్కువగా ఉంటాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సమయానుగుణ నిర్ణయాలు తీసుకుంటే అవి చాలా మరణాలను నివారించి ఉండేవని విమర్శించారు. ప్రధానమంత్రి కన్నీరుపెడితే ప్రాణాలు ఆగవు కదా అని ఎద్దేవా చేశారు. కన్నీటికి బదులు సమయానికి ఆక్సిజన్ అందజేస్తే ఎంతో మంది తమ ఆప్తులను కాపాడుకోగలిగేవారని పేర్కొన్నారు. సెకండ్ వేవ్‌ దేశాన్ని కుదిపేసిందని, కానీ, వైరస్ మరిన్ని మ్యుటేషన్లు చెందే ప్రమాదముండటంతో థర్డ్ వేవ్ మరింత ప్రమాదకరంగా ఉండొచ్చని అన్నారు. కాబట్టి, ఇకనైనా ప్రభుత్వం థర్డ్ వేవ్‌ను ఎదుర్కోవడానికి సిద్ధమవ్వాలని సూచించారు. టీకా పంపిణీని యుద్ధప్రాతిపదికన చేపట్టాలని, ఇదే ప్రధాన అస్త్రమని, వైద్యారోగ్య వసతులను తగినన్ని కల్పించుకోవాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కరోనా నియంత్రణ చేసిన విధానాన్ని విమర్శిస్తూ కాంగ్రెస్ శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించాలనే లక్ష్యం తమకు లేదని, కానీ, ప్రజల ప్రాణాలు కాపాడుకోవడానికి, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తాము శ్వేతపత్రాన్ని రూపొందించామని వివరించారు. ఇందులో ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతూ థర్డ్ వేవ్‌ను నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు పొందుపరిచామని మీడియాతో ఆయన మంగళవారం ఉదయం మాట్లాడుతూ వివరించారు. శ్వేతపత్రంలో నాలుగు పిల్లర్‌లను పొందుపరిచినట్టు తెలిపారు. ఇది థర్డ్ వేవ్‌‌ను ఎదుర్కోవడానికి ఉపకరించే బ్లూ ప్రింట్ అని, ఇందులోని సూచనలు, సలహాలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందని ఆశించారు.

నాలుగు పిల్లర్‌లు ఇవే

కరోనాపై పోరులో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, బీజేపీ పాలిత రాష్ట్రాలని, విపక్షాల పాలిత రాష్ట్రాలని వేర్వేరుగా చూడొద్దని రాహుల్ సూచించారు. ఆయన శ్వేతపత్రంలోని నాలుగు పిల్లర్‌లను వివరించారు. గత వేవ్‌లు నియంత్రించడంలో చోటుచేసుకున్న లోటుపాట్లను పరిశీలించడమే తొలి పిల్లర్ అని పేర్కొన్నారు. వాటిని సరిచేసుకోవడంపై దృష్టిసారించాలని కేంద్రానికి సూచించారు. థర్డ్ వేవ్‌కు ప్రిపేర్ కావడం రెండో పిల్లర్ అని, అంటే అందుకు కావలసిన వైద్యారోగ్య వసతులను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. హాస్పిటల్‌లో పడకలు, ఆక్సిజన్ సహా ఇతర వైద్యారోగ్య వసతులు, పరికరాలను సమకూర్చుకోవాలని పేర్కొన్నారు. టీకా పంపిణీ ఈ పోరులో సెంట్రల్ పిల్లర్ అని, యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ చేపట్టి ఈ విపత్తు నుంచి గట్టెక్కించాలని సూచించారు. కాగా, చివరి పిల్లర్‌గా పేదలకు, బాధితులకు ఆర్థిక సహాయాన్ని ప్రస్తావించారు. కరోనాతో ప్రాణాలు చాలించిన వారి కుటుంబాలకు పరిహారాన్ని చెల్లించాలని, వారికి అండగా నిలవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కరోనావైరస్ ఆర్థిక, సామాజిక సమస్యనూ తెచ్చిపెట్టే మహమ్మారి అని, అందుకోసమే అటువైపుగా చర్యలుండాలని తెలిపారు. అవసరమైతే తమ న్యాయ్ కాన్సెప్ట్‌ను పేరు మార్చుకుని వినియోగించుకునైనా పేదలకు నగదు చేరేలా నిర్ణయాలు తీసుకోవాలన్నారు.

తొలి రోజు టీకా భేష్

నూతన పాలసీ అమల్లోకి వచ్చిన రోజున టీకా పంపిణీ రికార్డు బ్రేక్ చేసిందని, దీన్ని స్వాగతిస్తున్నామని రాహుల్ గాంధీ ప్రశంసించారు. కానీ, ఇది ఒకరోజుతో అయిపోయే కార్యక్రమం కాదని, పౌరులందరికీ టీకా వేసేవరకూ ప్రతిరోజూ ఇదే స్థాయిలో పంపిణీ ఉండాలని పేర్కొన్నారు.

Advertisement

Next Story