నల్ల చట్టాలు రద్దు చేస్తే.. కేసీఆర్‌కు పాలభిషేకం చేయడం సిగ్గుచేటు

by Shyam |
Congress party
X

దిశ, ఖైరతాబాద్: ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్ని చిత్రహింసలకు గురిచేసినా రైతులు అలుపెరగకుండా సాగించిన పోరాటాల వల్లే‌ నల్ల చట్టాలు రద్దు అయ్యాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో అమరులైన రైతులకు నివాళులర్పించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్ ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. దేశానికి, రాష్ట్రానికి పట్టిన పీడ మోడీ, కేసీఆర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పోరాట ఫలితంగా ప్రధాని మోడీ చట్టాలను వెనక్కి తీసుకుంటే అవి మా గొప్ప అని కేసీఆర్‌కు గులాబీ చీడపురుగులు పాలాభిషేకం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ చట్టాలు తెచ్చినప్పుడు అసెంబ్లీలో వ్యతిరేకిస్తూ తీర్మానం చేయమంటే చేయలేని ఘనుడు కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ రైతు ఉద్యమానికి మద్దతు పలకలేదని అన్నారు.

మోడీకి మొదటి నుంచి మద్దతు పలికిన ఏకైక వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. మోడీ, కేసీఆర్‌లు ఇద్దరు తోడు దొంగలే అన్నారు. తెలంగాణలో కేసీఆర్ చేసిన ఒక్కరోజు పోరాటానికి భయపడే కేంద్రం నల్ల చట్టాలను రద్దు చేస్తే, రాష్ట్రంలో పండించిన లక్షల టన్నుల ధాన్యాన్ని ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. కల్లాల్లో మరణించిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు పోరాటాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కేసీఆర్ మోసాలను రైతులు తెలుసుకోవాలి, రైతులకు న్యాయం చేయకపోతే కేసీఆర్‌ను ఉరి తీయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్ కుమార్ గౌడ్, సీతక్క, మధుయాష్కీ పాల్గొన్నారు.

Advertisement

Next Story