సామాన్యుడిపై ప్రతీకారమా.. మరోసారి హాట్‌ టాపిక్‌గా సిద్దిపేట కలెక్టర్ తీరు

by Shyam |   ( Updated:2021-10-27 04:18:14.0  )
సామాన్యుడిపై ప్రతీకారమా.. మరోసారి హాట్‌ టాపిక్‌గా సిద్దిపేట కలెక్టర్ తీరు
X

దిశ ప్రతినిధి, మెదక్ : కలెక్టర్ గారు నోరు జారింది మీరు.. చండాడుతా… వెంటాడుతా.. కోర్టు చెప్పినా వినను.. అంటూ ఆన్ రికార్డు అంటు హుకుం జారీచేసింది మీరు.. చివరకు విమర్శల పాలైంది మీరు… మేమేం పాపంచేశామని మమ్మల్ని వేటాడే ప్రయత్నం చేస్తున్నారు..? మీరేకదా ఆన్ రికార్డు అంటూ నోటికొచ్చింది మాట్లాడి ఇప్పుడు రికార్డు చేసింది. చివరకి తప్పు మేమే చేశామన్నట్లు ప్రవర్తించటం ఇదేక్కడి న్యాయం సర్ అంటూ ఆ సమావేశానికి హాజరైన అధికారులు, డీలర్లు నాలుక కరుచుకుంటున్నారు.

కలెక్టర్ వ్యవహరించిన తీరుపై ఇటు ప్రజలు, రైతులు, ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష నేతలు దుమ్మేత్తి పోస్తుంటే మరోవైపు కలెక్టర్ ఆ వీడియో తీసింది, లీకు చేసింది ఎవరా అని ఆరా తీస్తున్నారు.. దీనిపై సిద్దిపేట కలెక్టరేట్ లో ఒకటే చర్చ .. కలెక్టర్ మాట్లాడిన మాటల్ని రికార్డు చేసింది ఎవరు ?, ఎందుకిలా చేశారు అనే చర్చ జోరుగా జరుగుతుంది. ప్రస్తుతం దీనిపై సీరియస్‌గా ఉన్న కలెక్టర్ అధికారులచే సీసీ టీవీ పుటేజీ పరిశీలించి వీడియో రికార్డు చేసిన వ్యక్తిపై చర్యలకు సిద్ధమయ్యాడు అంటే అధికార వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు దాదాపు అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటికే సీసీ టీవీ డేటాను మంగళవారం రోజునే సిద్దిపేట పోలీస్ కమిషనర్ కు అందించినట్లు సమాచారం. ఆయన విచారణ పూర్తి కాగానే వీడియో తీసిన వ్యక్తిపై చర్యలు తీసుకునేందుకు సైతం కలెక్టర్ వెనుకాడటం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా కలెక్టర్ తీరుపై సంతృప్తి చెందని కాంగ్రెస్ నాయకులు కలెక్టరేట్ ముట్టడికి కార్యచరణ రూపొందిస్తున్నట్టు సమాచారం.

వీడియో తీసిన వారిపై చర్యలకు సిద్ధం .. ?

సిద్దిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలనే అంశంపై వ్యవసాయాధికారులు, విత్తన డీలర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆన్ రికార్డు చెబుతున్నా, చెండాడుతా … వెంటాడుతా , ఖబడ్డార్, సుప్రీం చెప్పిన నో అని ఘాటైన వ్యాఖ్యలు చేసిన సిద్దిపేట కలెక్టర్ ప్రస్తుతం తన రూట్ మార్చుకున్నారు. ప్రతిపక్ష నాయకులు, రైతు సంఘాలు, అన్నదాతల నుండి తీవ్ర విమర్శలు రావడంతో ఇంతకి ఆ వీడియో తీసిందెవరూ అనే అంశంపై దృష్టి సారించారు. మంగళవారం రోజునే కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లోనున్న సీసీ టీవీ పుటేజీని పరిశీలించి దానికి సంబంధించిన డాటాను సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ కి అందించినట్టు అధికార వర్గాల నుండి అందుతున్న సమాచారం. వీడియో తీసిన వ్యక్తిపై ఒత్తిడి తెచ్చేందుకు కలెక్టర్ ఈ కార్యక్రమానికి పూనుకున్నాడని తెలుస్తోంది. విచారణ అనంతరం సీసీ ఆదేశాల మేరకు కలెక్టర్ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటాడనేది ఆసక్తి కరంగా మారింది.

కలెక్టరేట్ ముట్టడికి సిద్ధమవుతున్న కాంగ్రెస్ ..

సిద్దిపేట కలెక్టర్ వ్యవసాయాధికారులు, విత్తన డీలర్లతో మాట్లాడిన మాటలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. సిద్దిపేట కలెక్టర్ తీరుపై స్థానిక నాయకులు సహా రాష్ట్ర స్థాయి ప్రతిపక్ష నేతలు, రైతు సంఘాల నాయకులు కలెక్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ తన మాటలు వక్రీకరిస్తున్నారంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే దీనిపై సంతృప్తి చెందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియా సమావేశం నిర్వహించి కలెక్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ నేరుగా రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సింది పోయి మీడియాపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నాడని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. నేరుగా రైతులకు క్షమాపణ చెప్పని పక్షంలో నేడో, రేపో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి చేస్తామని, కలెక్టర్ ఎక్కడ ఉంటే అక్కడ .. అంటే ఇంట్లో ఉంటే ఇంట్లో, ఆఫీస్ లో ఉంటే ఆఫీస్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. మరి దీనిపై సిద్దిపేట కలెక్టర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed