సీఎం కేసీఆర్‌కు పిండ ప్రదానం.. 5 ఏళ్ల నాటి హామీ ఏమాయే..?

by Sridhar Babu |
pindam-kcr
X

దిశ, జమ్మికుంట : కరీంనగర్‌లో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చి ఏడేళ్లు దాటినా ఇప్పటివరకు ఆ వాగ్దానం కార్యరూపం దాల్చకపోవటంతో జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక గాంధీ చౌక్‌లో కేసీఆర్ చిత్రపటానికి పిండ ప్రదానం చేశారు. ప్రధాన రోడ్డుపై బైఠాయించి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు గాంధీ చౌక్ వద్దకు చేరుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులను చెదరగొట్టారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నాయకులకు, పోలీసులు మధ్య తోపులాట జరిగింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వెంకన్న మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ వస్తే ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు విద్య, వైద్యం అందుబాటులో ఉండేదన్నారు.

అన్ని జిల్లాలకు మెడికల్ కాలేజీలు మంజూరు చేసి ఒక్క కరీంనగర్ జిల్లాకు ఇవ్వకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. గత 5 ఏళ్ల కిందట మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చాలని మాజీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ ఆమరణ నిరాహార దీక్ష చేపడితే జీర్ణించుకోలేక సీఎం కేసీఆర్ భయపడి తన అధికార బలంతో పోలీసుల ద్వారా దీక్షను భగ్నం చేయించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి సలీం, కిసాన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అయోధ్య, జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సాయిని రవి, మహిళ అధ్యక్షురాలు పూడరి రేణుక శివకుమార్ గౌడ్, సీనియర్ నాయకులు యగ్గని శ్రీనివాస్, ముద్దమల్ల రవి పాల్గొన్నారు.

Advertisement

Next Story