ఉద్యోగ సంఘాల తీరుపై విమర్శలు!

by srinivas |
ఉద్యోగ సంఘాల తీరుపై విమర్శలు!
X

దిశ, వెబ్‌డెస్క్: కరవ మంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం. తెలుగు రాష్ట్రాల్లో ఈ సామెత ఫుల్ ఫేమస్. ఇప్పుడిదే సామెత ఏపీలో ఉద్యోగ సంఘాలకు సూటయ్యేలా కనపడుతోంది. ఇటీవల పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసీ షెడ్యూల్ విడుదల చేయడంతో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడాయి. కానీ, సుప్రీం కోర్టు తీర్పుతో ఆ సంఘాలు ఎస్ఈసీ చెప్పింది చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఎన్నికల విధుల్లో పాల్గొనాలంటే ముందు తమకు వ్యాక్సినేషన్‌ వేయాలని తిరకాసు పెట్టడం వివాదస్పదం అవుతోంది.

ఎన్నికల విధుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌తో సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాలు మీడియాతో మాట్లాడారు. మా వాదనలను వినకుండానే సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకటించిందని, అయినా కోర్టు తీర్పును పాటిస్తూ.. ఎన్నికల విధుల్లో పాల్గొంటామని స్పష్టం చేశారు. అయితే ఎన్నికల విధుల్లో ఎస్ఈసీ ఉద్యోగులను ఇబ్బంది పెట్టొద్దని, ఉద్యోగులు విధుల్లో కరోనాతో చనిపోతే రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని సీఎస్‌ను మీటింగ్‌లో సైతం కోరినట్లు తెలిపారు. అయితే తమకు వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ ఇవ్వాలని పట్టుబట్టారు.

ఈ నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాలు వ్యాక్సినేషన్‌పై చేసిన ప్రకటనతో ప్రజల నుంచి సైతం భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు.. ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా వ్యాక్సినేషన్‌పై ఎందుకు హడావుడి చేస్తున్నారన్న విమర్శలు మూటగట్టుకుంటున్నారు. ప్రజలు చెల్లించే పన్నులతోనే జీతాలు తీసుకుంటూ.. ఎన్నికల విధులు అనేసరికి.. వ్యాక్సినేషన్ ఇవ్వాలని పట్టుబట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంత తొందరగా వ్యాక్సిన్ ఏం అవసరం వచ్చిందని, ఇప్పుడే కదా అందుబాటులోకి వచ్చిందని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. సామాన్యులంటే ఏవిధమైన అభిప్రాయం ఉందో ఈ ఒక్క వ్యాక్సిన్ దగ్గరే అర్థం అవుతుందని ప్రతిపక్షాలు సైతం లేవనెత్తుతుండటంతో ఉద్యోగ సంఘాలుపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వానికి అనుకూలంగా ఉద్యోగ సంఘాలు పని చేస్తున్నాయనే ఆరోపణలకు బలం చేకూర్చేలా వారి తీరు ఉందని ప్రజాసంఘాల నుంచి కామెంట్లు వస్తున్నాయి.

ఓవైపు వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్, మరోవైపు నామినేషన్లు స్వీకరణకు టైం దగ్గరపడుతున్న తరుణంలో తమకు వ్యాక్సిన్ అందితేనే విధుల్లో పాల్గొంటామని ఉద్యోగ సంఘాలు చెప్పడంతో భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఎన్నికల విషయంలో ప్రభుత్వానికి, ఎస్ఈసీకి వార్ నడుస్తుంటే నడుమలో ప్రభుత్వ ఉద్యోగులు వ్యాక్సినేషన్ ఇస్తేనే విధుల్లో పాల్గొంటామని పట్టుబడుతుండటాన్ని పాయింట్‌గా పట్టి, ‘ఊకో కాక.. ఉద్యోగ సంఘాల తీరు ఇదేనా’ అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed