ఎనర్జీ ఎక్స్‌పోర్ట్ పాలసీ తయారు చేయండి: జగన్

by srinivas |
ఎనర్జీ ఎక్స్‌పోర్ట్ పాలసీ తయారు చేయండి: జగన్
X

ఎనర్జీ ఎక్స్ పోర్ట్ పాలసీ తయారుచేయాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. రాష్ట్ర విద్యుత్ రంగంపై అమరావతిలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యుదుత్పత్తి అనుకూల విధానం ఉండాలని అన్నారు. విద్యుత్ విక్రయించే సంస్థలకు సానుకూల వాతావరణం కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు.

లీజు ప్రాతిపదికన పరిశ్రమలకు భూములిచ్చే అంశంపై కూడా చర్చించారు. అలా చేయడం వల్ల పరిశ్రమల ఏర్పాటుకు భూములిచ్చేవారికి మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. భూములు లీజుకివ్వడం వల్ల యాజమాన్యపు హక్కుల మారవని, అదే సమయంలో భూ యజమానికి ఏటా క్రమం తప్పకుండా ఆదాయం వస్తుందని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి అనుకూల విధానం ఉండేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన సూచించారు.

విద్యుత్ రంగంలో మరిన్ని పెట్టుబడుల ఆకర్షణ, మరిన్ని ఉద్యోగాల కల్పనే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఎన్టీపీసీ మరో 1000 మెగావాట్ల విద్యుదుత్పత్తికి సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. అయితే అందుకు సంబంధించిన భూమి అందుబాటులో లేదని, త్వరలోనే ఎన్టీపీసీకి భూమిని కేటాయిస్తామని చెప్పారు. 10 వేల మెగావాట్ల సోలార్ ప్లాంట్ నిర్మాణం, విధివిధానాలపై కూడా చర్చించారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ కోసం ఫీడర్లు ఏర్పాటు చేసి, వాటి ఆటోమేషన్ కూడా రెండేళ్లలో పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed