- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్వరలో కరోనా ఫ్రీ తెలంగాణ: సీఎం కేసీఆర్
దిశ, న్యూస్ బ్యూరో :
”ఇప్పటివరకు రాష్ట్రం 70 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఇప్పటికే ఒకరు డిశ్చార్జి అయ్యారు. చికిత్స ఫలించడంతో 11మంది పేషెంట్లకు జబ్బు నయమైంది. సోమవారం వారు డిశ్చార్జి అవుతున్నారు. దీంతో ఇక 58 మంది యాక్టివ్ పాజిటివ్ పేషెంట్లు చికిత్సలో ఉన్నారు. ఇందులో ఒకరి పరిస్థితి మాత్రమే ఆందోళనగా ఉంది. మిగిలినవారంతా ఆరోగ్యంగా ఉన్నారు. క్వారంటైన్‌లో ఉన్నవారి సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. పద్నాలుగు రోజుల క్వారంటైన్ సమయం ముగుస్తుండడంతో చాలా మంది ఇళ్ళకు వెళ్ళిపోతున్నారు. ఏప్రిల్ 7వ తేదీ నాటికి మొత్తం ఇళ్ళకు వెళ్ళిపోతారు. ఇక క్వారంటైన్‌లో ఎవ్వరూ ఉండరు. కొత్త కేసులేవీ నమోదు కాకుంటే తెలంగాణ ‘కరోనా-ఫ్రీ’ రాష్ట్రం అవుతుంది” అని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. రైతులు పండించిన ప్రతీ గింజనూ ప్రభుత్వం కొంటుందని, రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కూపన్ల ద్వారా రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. పంటను కోసే హార్వెస్టర్లను కూడా సిద్ధం చేస్తున్నామని, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా మిషన్లను తెప్పిస్తున్నామన్నారు. రైతుల నుంచి కనీస మద్దతు ధరకే పంటలను కొంటామని, ఎవ్వరికీ ఆందోళన అవసరం లేదని, పట్టణాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఉంటాయని, డబ్బులు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయన్నారు.
కరోనా కట్టడి, రైతుల పంటల కొనుగోళ్ళపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించిన అనంతరం మీడియా సమావేశంలో సీఎం పై వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో విదేశీ ప్రయాణం, ఇతర రాష్ట్రాల ప్రయాణం చేసి వచ్చి క్వారంటైన్‌లో ఉన్నవారు మొ్తం 25,937 మంది అని, వీరి ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోడానికి నిరతరం 5,746 ప్రభుత్వ బృందాలు పనిచేస్తున్నాయని, ఒకటి రెండు రోజుల తర్వాత పర్యవేక్షణ అవసరం ఉండకపోవచ్చునని అన్నారు. సోమవారం 1899 మంది, మార్చి 31న 14 వేల మంది, ఆ తర్వాతి రోజు మరికొంతమంది… ఇలా ఏప్రిల్ 7వ తేదీ నాటికి క్వారంటైన్‌లో ఉన్నవారంతా ఇళ్ళకు పోతారని, ఇక ఎవ్వరూ క్వారంటైన్‌లో ఉండరని అన్నారు. ఒకవేళ కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలితే వారిని మాత్రం ఆసుపత్రికి పంపిస్తామని అన్నారు. విదేశీ విమాన సర్వీసులన్నీ ఆగిపోయినందున ఇకపైన వచ్చే అవకాశమే లేదన్నారు. అయితే స్థానికంగా ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా చూసే బాధ్యతే మిగిలిందన్నారు. అందువల్లనే కొత్తగూడెం, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో అధికారులు సీరియస్ దృష్టి పెట్టారని, ఇకపైన వ్యాప్తి చెందకుండా చూడడమే ఏకైక మందు అని అన్నారు.
డిశ్చార్జి అయిన పేషెంట్‌తో ప్రధాని సంభాషణ
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందిన కరోనా పేషెంట్‌తో ప్రధాని కూడా మాట్లాడారని, ఆసుపత్రిలో మంచి చికిత్స లభించినట్లు పేషెంట్ చెప్పాడని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. వైద్యులు ఇచ్చిన సహకారాన్ని కూడా పేషెంట్ వివరించారన్నారు. కరోనా వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో పేషెంట్ వివరించారని, దాని వ్యాప్తి ఎంత తీవ్రంగా ఉంటుందో, దాన్ని కట్టడి చేయడానికి దేశం, రాష్ట్రం తీసుకున్న చర్యలను అనేక అంతర్జాతీయ హెల్త్ మ్యాగజైన్లు ప్రశంసించాయని కేసీఆర్ గుర్తుచేశారు. ప్రజల స్వీయ నియంత్రణ ఇదే విధంగా కొనసాగితే వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. అందుకే క్వారంటైన్‌లో ఉన్నవారిని వైద్యులు రోజుకు రెండుసార్లు పర్యవేక్షిస్తున్నారన్నారు. కరోనాకు మందు లేనప్పుడు ఇళ్ళకు పరిమితం కావడమే ఏకైక మందు అన్నారు. దేశంలో వైద్య సదుపాయాలు పూర్తిస్థాయిలో లేనప్పుడు జబ్బు బారిన పడకుండా నివారణ ఉపాయం చేయడమే ఉత్తమమని అన్నారు. లాక్ డౌన్ కాలం ముగిసే వరకు ప్రజల క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ ఇలాగే కొనసాగాలని పిలుపునిచ్చారు.
ప్రతీ గింజను ప్రభుత్వం కొంటుంది
రైతులు పండించిన వరి, మొక్కజొన్న తదితర అన్ని పంటలనూ చివరి కేజీ వరకు ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొంటుందని, రైతులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని, అయితే ఎక్కువ మంది గుమికూడితే కరోనా వచ్చే ప్రమాదాన్ని గుర్తించి రైతులకు ముందుగానే టోకెన్లను పంపిణీ చేసి ఒక క్రమపద్దతిలో తీసుకుంటుందని కేసీఆర్ వివరించారు. వ్యవసాయ విస్తరణ అధికారి మొదలు జిల్లా కలెక్టర్ వరకు ఆయా గ్రామాల్లోని పంటల దిగుబడి, రైతుల సంఖ్య తదితరాలను దృష్టిలో పెట్టుకుని కూపన్ల పంపిణీ జరుగుతుందన్నారు. రైతులు పట్టణాల మార్కెట్‌ల దాకా వెళ్ళకుండా గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు జరుగుతుందని, కూపన్లలో ఇచ్చిన తేదీ ప్రకారం పంటను తీసుకురావాలని వివరించారు. పాస్ బుక్, బ్యాంకు ఖాతా నెంబరు తీసుకొస్తే డబ్బు బ్యాంకులో జమ అవుతుందన్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బు లేకపోయినా పౌరసరఫరాల శాఖకు రూ. 25 వేల కోట్లను, మార్క్‌ఫెడ్‌కు రూ. 3200 కోట్లను సమకూర్చిందని తెలిపారు.
గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో 40 లక్షల ఎకరాల్లో వరి సాగుబడి జరిగిందని, సుమారు 1.05 కోట్ల టన్నుల వడ్లు వస్తున్నాయని, దీనికి తోడు 14.40 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట ఉందని, దీనికి ప్రస్తుతం మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేకపోయినా ప్రభుత్వమే కొంటుందని సీఎం తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాల దగ్గర క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ పాటిస్తే కరోనా రాకుండా నివారించవచ్చునని, అందుకోసమే ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దాదాపు మే నెల 15వ తేదీ వరకు కొనుగోళ్ళు కొనసాగుతాయని, అవసరమైతే నాలుగైదు రోజులు పొడిగించుకోవచ్చన్నారు. కానీ రైతుల మాత్రం ఆగమాగం కావద్దని, పట్టణాల మార్కెట్‌లకు పోవద్దని స్పష్టం చేశారు. మంత్రులు, జిల్లా కలెక్టర్లు సమన్వయం చేసుకుంటూ కూపన్ల పంపిణీని ఒకటి రెండు రోజుల్లోనే మొదలుపెడతారన్నారు.
గ్రామాల్లో కంచెలు తొలగించాలి
కరోనా వ్యాప్తి నిరోధానికి గ్రామాల ప్రజలు స్వీయ నియంత్రణతో కంచెలు వేసుకోవడం మంచి ఆలోచనేగానీ, అత్యవసర సమయాల్లో ఇబ్బందులు వస్తున్నందు వెంటనే తొలగించాలని, అవసరమైతే అక్కడ సబ్బు, నీళ్ళు లాంటివి పెట్టాలని సూచించారు. పంటల కోత సమయంలో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఊర్లలోని దుకాణాలకు నిత్యావసర వస్తువులు వస్తుంటాయి కాబట్టి కంచెలను తొలగించాలన్నారు. ప్రస్తుతం మన దగ్గర ఐదు వేల హార్వెస్టర్లు మాత్రమే ఉన్నాయని, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి మరో 1500 వస్తాయని, వాటి రిపేర్లు, సర్వీసు కోసం చాలా వాహనాలు వస్తాయని, వాటికి కూడా అనుమతి ఇవ్వాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ట్రాక్టర్లపై హార్వెస్టర్లను బిగించడానికి అవసరమయ్యే టెక్నీషియన్లు పట్ణణాల నుంచి గ్రామాల్లోకి వెళ్ళడానికి, స్పేర్ పార్టులను కొనుక్కోడానికి దుకాణాలను తెరిచే ఏర్పాట్లు చేయాలని పోలీసులను ఆదేశించారు.
ధాన్య సేకరణ జరిగిన తర్వాత సివిల్ సప్లయ్స్ శాఖకు అందించడం మొదలు రైసు మిల్లులకు వెళ్ళి తిరిగి గోడౌన్లకు చేరేంతవరకు హమాలీల అవసరం ఉంటుందని, ఎక్కువగా బీహార్ రాష్ట్రానికి చెందినవారే అయినందున హోలీ పండుగ కోసం అక్కడికి వెళ్ళి తిరిగి రాలేకపోయారు కాబట్టి ప్రత్యేక రైళ్ళ ద్వారా వారిని తీసుకొస్తామని సీఎం వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.05 కోట్ల టన్నుల వరి ధాన్యం కోసం సుమారు 70 లక్షల గోనెసంచులు అవసరమవుతాయని, కానీ మన దగ్గర 35 లక్షలే ఉన్నందున ఇంకా 35 లక్షలను సమకూర్చుకోవాల్సి ఉందన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులు తప్పనిసరిగా మీటరు దూరం నిబంధన పాటించాల్సిందేనని, పట్టణాల్లోని కరోనా గ్రామాల్లోకి రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇది తప్పదన్నారు.
ఇతర రాష్ట్రాల కూలీలకూ సాయం
మన రాష్ట్రంలో కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలకు తలా పన్నెండు కిలోల ఉచిత బియ్యం, తలా రూ. 1500 ఇస్తున్నట్లుగానే ఇతర రాష్ట్రాల నుంచి వివిధ పనుల నిమిత్తం వచ్చిన రోజువారీ కూలీలకు కూడా తలా ఆరు కిలోల బియ్యం, రూ. 500 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని సీఎం తెలిపారు. ప్రస్తుతం నగరంలో సుమారు మూడున్నర లక్షల మంది ఇలాంటి వారు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించిందని, వారు ఉన్న క్యాంపుల్లోనే వీటిని అందజేస్తామన్నారు. పస్తులుండాల్సిన అవసరం లేదని, లాక్‌డౌన్ పరిస్థితి ఉన్నందున వారి కడుపు నింపుతామన్నారు. ఆ తర్వాత వారి ఇష్ట ప్రకారం స్వగ్రామాలకు వెళ్ళవచ్చన్నారు. వీరికి రేషను కార్డు లేకున్నా అందజేస్తామని తెలిపారు. ఇక రాష్ట్రంలో రేషనుకార్డు ఉన్నవారికి బయోమెట్రిక్ వ్యవస్థ లేకుండానే రేషను సరుకులను ఇస్తామని, నగదును మాత్రం బ్యాంకు ఖాతాల్లో జమ జేస్తామని తెలిపారు.
రైతుబజార్లలో పండ్ల విక్రయం
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిమ్మ, నారింజ, బత్తాయి, ఆరంజ్, దానిమ్మ తదితర పండ్లు పండుతున్నాయని, వీటిని ఇతర రాష్ట్రాలకు రవాణా చేయడానికి బదులుగా మన రాష్ట్రంలోనే అన్ని రైతు బజార్లలో విక్రయించేలా హార్టికల్చర్ విభాగం అధికారులు ఏర్పాట్లు చేస్తారని సీఎం తెలిపారు. కరోనా పరిస్థితుల్లో రోగనిరోధక శక్తి పెంచే ఈ పండ్లను ప్రజలు విరివిగా వినియోగించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పండ్లను కూడా తీసుకోవాలన్నారు. నిత్యావసర వస్తువులు రాష్ట్రాల మధ్య రవాణా అయ్యేందుకు వీలుగా లారీలకు పోలీసులు అనుమతి ఇవ్వాలని డీజీపీని ఆదేశించారు.
అదనపు వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండాలి
రాష్ట్రంలో కరోనా ప్రస్తుతం అదుపులోనే ఉందని, ఏప్రిల్ రెండవ వారం తర్వాత పెద్దగా కేసులు ఉండకపోవచ్చునని, కానీ అంచనాలు తారుమారై విస్ఫోటనంలా విజృంభిస్తే కట్టడి చేయడానికి వీలుగా ప్రభుత్వం అదనపు వైద్య సిబ్బందిని సమకూర్చుకుంటూ ఉందని సీఎం తెలిపారు. ఇప్పటికే అలాంటివారి జాబితాను సిద్ధం చేసిందన్నారు. డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు… ఇలా అందరి వివరాలు వేర్వేరుగా ఉన్నాయని, ప్రభుత్వానికి అవసరమైన వెంటనే సేవలందించేందుకు వీలుగా ప్రభుత్వం ఒక ప్రకటన కూడా విడుదల చేసిందన్నారు. అవసరం కంటే 30% మందిని ఎక్కువగానే సిద్ధం చేసుకుంటున్నామని, అందులో భాగమే గచ్చిబౌలి స్టేడియంలో 1500 పడకల ఐసొలేషన్ వార్డుల ఏర్పాటు అని తెలిపారు. పదవీ విరమణ చేసినవారితో సహా సేవలందించడానికి సిద్ధంగా ఉండేవారిందరి వివరాలు ప్రభుత్వం దగ్గర సిద్ధంగా ఉన్నాయన్నారు.
ఉద్యోగులకు కూడా జీతాలు వస్తాయో రావో…
దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో రాష్ట్రంలోనూ అదే పరిస్థితి ఉందని, ఈ నెల 15వ తేదీ నుంచి వ్యాపార కార్యకలాపాలు బాగా దెబ్బతిన్నాయని, ఆర్థిక వనరులు బాగా తగ్గిపోయాయన్న సీఎం కేసీఆర్ ఈ నెల ఉద్యోగులకు సైతం జీతాలకు డబ్బులు ఉంటాయో ఉండవో అని అన్నారు. కరోనా నేపథ్యంలో అందరూ పొదుపుగా ఉంటూ ఖర్చులను, అవసరాలను తగ్గించుకుంటూ ఉన్నప్పుడు సమాజంలో భాగంగా ఉన్న ఉద్యోగులు సైతం అర్థం చేసుకుని తగ్గించుకోవాల్సి వస్తుందన్నారు. ఎమ్మెల్యేలకు సైతం జీతాలు అందుతాయో లేవోనని అవసరమైతే ఆపేయాల్సి వస్తుందేమో అన్నారు. మొత్తానికి మొత్తం పన్నులన్నీ తగ్గిపోతే ప్రభుత్వం రైతులకు ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతో పౌరసరఫరాల శాఖకు, మార్క్‌ఫెడ్‌కు డబ్బులు సమకూర్చిందని, ఏ రాష్ట్రంలో ఇలాంటి చొరవ కనిపించలేదన్నారు. ఆర్థిక పరిస్థితి మరింతగా క్షీణిస్తే ప్రధానితో మాట్లాడి రిజర్వు బ్యాంకు నుంచి ఓవర్ డ్రాఫ్ట్‌కు అనుమతి తెచ్చుకుంటామని సూచనప్రాయంగా తెలిపారు.