కర్ఫ్యూ‌లోనూ ఆర్టీసీ బస్సులు

by Shyam |
కర్ఫ్యూ‌లోనూ ఆర్టీసీ బస్సులు
X

దిశ, న్యూస్ బ్యూరో : కర్ఫ్యూ సమయంలోనూ ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. జిల్లాల నుంచి వచ్చే బస్సులు ప్రస్తుతం జేబీఎస్‌కు మాత్రమే అనుమతిస్తుండగా.. గురువారం నుంచి ఎంజీబీఎస్‌లోకి కూడా బస్సులను అనుమతిస్తున్నట్టు తెలిపారు. బుధవారం ప్రగతి భవన్‌లో ఆర్టీసీపై నిర్వహించిన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాత్రిపూట కర్ఫ్యూ కారణంగా పూర్తి స్థాయిలో బస్సులు తిరగకపోవడంతో ఆదాయం సరిగా రావడం లేదని ఆర్టీసీ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సాధారణంగా రోజుకు 11-12 కోట్ల వరకూ ఆదాయం రావాలని, ఎండాకాలం, పెళ్లిళ్ల సీజన్‌లో రూ.15 కోట్ల వరకూ ఆదాయం వస్తుందని, కానీ ప్రస్తుతం కేవలం రూ.2కోట్లు మాత్రమే వస్తుందని అధికారులు వివరించారు. 39 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే వస్తోందని, ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు రాత్రి 7 గంటల లోపు గమ్యస్థానాలకు చేరుకోవడం సాధ్యం కావడం లేదని తెలిపారు. ఆర్టీసీ సమస్యలపై అధికారుల వివరాలను పరిగణలోకి తీసుకున్న కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ నిబంధనల నుంచి మినహాయింపునిస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. కర్ఫ్యూ సమయంలో కూడా ఆర్టీసీ బస్సులు గమ్యస్థానం చేరడానికి అవకాశం ఇస్తారని, బస్టాండ్లలో ట్యాక్సీలు, ఆటోలు తదితర రవాణా వాహనాలను కూడా అనుమతినిస్తారని తెలిపారు. బస్ టికెట్ కలిగిన ప్రయాణీకులు కర్ఫ్యూ సమయంలో కూడా ప్రైవేటు వాహనాల్లో తమ ఇండ్లకు చేరుకునేందుకు పోలీసుల అభ్యంతరం ఉండదని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి, మరికొన్ని రోజుల వరకూ నగరంలో సిటీ బస్సులు నడపరని, అంతర్రాష్ట్ర బస్ సర్వీసులను కూడా నడిపించడం లేదని తెలిపారు. ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్టీసీ ఎండీ సునిల్ శర్మ, ఈడీ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed