KCR :కేంద్ర మంత్రులతో సీఎం కేసీఆర్ ఏం చర్చించారు..? అవన్నీ పట్టాలెక్కేనా..?

by Anukaran |   ( Updated:2021-09-06 23:16:56.0  )
KCR
X

దిశ, తెలంగాణ బ్యూరో : కృష్ణా జలాల వివాదాల పరిష్కారానికి కొత్త ట్రిబ్యునల్ వేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌‌ను ఉపసంహరించుకోనున్నట్లు దరఖాస్తు చేశామని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌కు వివరించారు. గత అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చేసిన ప్రతిపాదన మేరకు ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకోనున్నామని, ఇక నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని పేర్కొన్నారు. గోదావరి నదిపై నిర్మించిన 11 ప్రాజెక్టులకు అనుమతి లేదంటూ ఇటీవల గెజిట్‌లో పేర్కొన్నప్పటికీ అవి సమైక్య రాష్ట్రంలోనే ఆమోదం పొందినవన్న విషయాన్ని వివరించారు. కాళేశ్వరం మూడో టీఎంసీ మొత్తం ప్రాజెక్టులో భాగమేనని, ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అంతకుముందు కేంద్ర ఉపరితల రవాణా మంత్రితో భేటీ అయిన కేసీఆర్ రీజినల్ రింగు రోడ్డు ఉత్తర సెక్షన్‌లో గజ్వేల్-యాదాద్రి మార్గంలో అలైన్‌మెంట్‌ను మార్చాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ఇద్దరు కేంద్ర మంత్రులకు చెరి ఐదు అంశాలపై విజ్ఞాపనపత్రాలను అందజేశారు.

కేంద్ర జలశక్తి మంత్రితో సుమారు గంటన్నర పాటు జరిగిన భేటీలో కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. గోదావరి నదిపై నిర్మించిన 11 ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతి లేదన్నట్లుగా ఇటీవలి గెజిట్‌లో కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నదని, కానీ అవి సమైక్య రాష్ట్రంలో ఉండగానే అనుమతి పొందినవని గుర్తుచేశారు. వీటికి గోదావరి ట్రిబ్యునల్ 967 టీఎంసీల కేటాయింపు కూడా చేసిందని, ఇందులో 758 టీఎంసీలకు కేంద్ర జల సంఘం కూడా అనుమతి ఇచ్చిందని, మరో 148 టీఎంసీలకు హైడ్రాలజీ అనుమతులు ఉన్నాయని, ఇంకో 60 టీఎంసీలు భవిష్యత్తులో కట్టబోయే ప్రాజెక్టుల కోసం రిజర్వులో ఉంచినట్లు వివరించారు.

NIthin

కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీకి ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని, మొత్తం ప్రాజెక్టులో ఇది కూడా ఒక భాగమని వివరించారు. కంతనపల్లి ప్రాజెక్టుకు అనుమతి లేదని గెజిట్ పేర్కొన్నప్పటికీ ప్రస్తుతం అది ప్రతిపాదనలో లేనందున దాన్ని జాబితా నుంచి తొలగించాలని కోరారు. ఇచ్చంపల్లి, దేవాదుల, ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం అనుమతి ఉన్నదని, వీటికి 155 టీఎంసీల నీటి కేటాయింపు కూడా ఉన్నదని కేంద్ర మంత్రికి వివరించారు. అయితే పై ప్రాజెక్టుల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం సీతారామసాగర్, తుపాకులగూడెం బ్యారేజీ, చిన్న కాళేశ్వరం (ముక్తేశ్వర), రామప్ప-పాకాల సరస్సు లింకు తదితరాలకు మొత్తం 140 టీఎంసీలను వినియోగించనున్నందున వీటికి సంబంధించిన డీపీఆర్‌లను త్వరలో పంపుతామని, ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రిని కోరారు.

గజ్వేల్-యాదాద్రి అలైన్‌మెంట్‌లో మార్పులు

రీజినల్ రింగు రోడ్డు ఉత్తర సెక్షన్‌లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా కట్టిన రిజర్వాయర్లు అడ్డు వస్తుండడంతో అలైన్‌మెంట్‌లో మార్పు అనివార్యమవుతున్నది. కొండపోచమ్మసాగర్, రంగనాయక్‌సాగర్, బస్వాపూర్ తదితర అనేక రిజర్వాయర్ల మీదుగా రీజినల్ రింగు రోడ్డు వేయాల్సి ఉన్నందున ఆచరణాత్మక ఇబ్బందులను ఇటీవల సర్వే చేసిన ప్రైవేటు సంస్థ ప్రభుత్వానికి నివేదించింది. ఇప్పుడున్న ప్లాన్ ప్రకారమే రీజినల్ రింగు రోడ్డును నిర్మించడంలో ఉన్న అవాంతరాలను ఏకరువు పెట్టింది. దీంతో కొత్త అలైన్‌‌మెంట్ అనివార్యమవుతున్నది. ఇదే విషయాన్ని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీకి ఢిల్లీలో సోమవారం విన్నవించారు.

Shakavath

రీజినల్ రింగు రోడ్డు అలైన్‌మెంట్ డిజైన్ 2018లో ఖరారైందని, ఈ మూడేళ్ల కాలంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయని, అనేక రిజర్వాయర్లు వచ్చాయని, గజ్వేల్ ఔటర్ రింగు రోడ్డు లాంటివి వచ్చాయని, దీంతో ఇప్పుడు ఉత్తర భాగం (సంగారెడ్డి-గజ్వేల్-చౌటుప్పల్ మార్గంలోని 158 కి.మీ. మార్గం) సెక్షన్ అలైన్‌మెంట్‌లో మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదని కేంద్ర మంత్రికి కేసీఆర్ వివరించారు. ముఖ్యంగా గజ్వేల్-యాదాద్రి మార్గంలో మార్పులు చేయాల్సి ఉంటుందని, ఆ మేరకు జాతీయ రహదారుల అథారిటీకి తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. చౌటుప్పల్-షాద్‌నగర్-సంగారెడ్డి సెక్షన్ (దక్షిణ)‌లోని 182 కి.మీ. విషయంలో ట్రాఫిక్ గణాంకాలతో సహా మొత్తం అలైన్‌మెంట్ ప్రతిపాదనలను అందజేసినట్లు తెలిపారు.

ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం ఉత్తర సెక్షన్‌కు అనుమతి ఇచ్చిందని, అదే తరహాలో వీలైనంత తొందరగా దక్షిణ సెక్షన్‌కు కూడా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనికి కూడా అనుమతి వస్తే కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే కాక పొరుగున ఉన్న కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కూడా ప్రయోజనం ఉంటుందని తెలిపారు.

హైదరాబాద్-విజయవాడ ఆరు లైన్ల రహదారి

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి ప్రస్తుతం నాలుగు లైన్లతో ఉన్నదని, దీన్ని ఆరు లైన్లకు విస్తరించే పనులు 2024 ఏప్రిల్ కల్లా పూర్తికావాల్సి ఉన్నదని, 2012లో ఈ రహదారి కాంట్రాక్టు తీసుకున్న జీఎంఆర్ సంస్థ ఇందుకు సుముఖంగా లేదని, కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకుని పరిష్కారం కనుగొనాల్సి ఉన్నదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రహదారిపై రోజుకు సగటున 40 వేల వాహనాలు ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల రాజధానులను కలపడానికి ఇది ప్రధానమైన రహదారి అని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed