- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పల్లె ప్రగతికి 'ఉపాధి' నిధులు
దిశ, న్యూస్‌బ్యూరో: గ్రామాల అభివృద్ధిలో తెలంగాణ పల్లెలు ఆదర్శంగా నిలవాలని, ఉపాధి హామీ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు. పంచాయతీలకు రూ. 3,694 కోట్ల ఫైనాన్స్ కమిషన్ నిధులు, రూ.5,885 కోట్ల నరేగా నిధులు, రూ. 337 కోట్ల సొంత ఆదాయం ఉందని, అన్నీ కలుపుకుని ఏడాదికి రూ. 9,916 కోట్లు ఉంటాయన్నారు. నాలుగేళ్లలో రూ. 39,594 కోట్లు వస్తాయని, ఆ నిధులతో ఏయే పనులు చేసుకోవచ్చో గ్రామాలవారీగా ప్రణాళిక రూపొందించుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు. గ్రామాభివృద్ధి ప్రణాళిక, ఉపాధి హామీ పథకం, హరితహారం, అడవుల పునరుద్ధరణ, పల్లె ప్రగతి, గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత, రైతుబంధు, రైతువేదికల నిర్మాణం, ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్‌ల ఏర్పాటు, కరోనా, అంటువ్యాధులు, మిడతల దండు, నకిలీ విత్తనాలు, కరెంటు బిల్లుల చెల్లింపు తదితర అంశాలపై మంగళవారం నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. వివిధ అంశాలపై సీఎం కేసీఆర్ అధికారులకు మార్గదర్శకం చేశారు.
గ్రామ పంచాయతీలు ఖచ్చితంగా చార్జ్‌డ్ అకౌంట్ నిర్వహించాలని, అప్పులు, ట్రాక్టర్ల లోన్ రీ పేమెంట్, కరెంటు బిల్లులు ప్రతీనెలా తప్పక చెల్లించాలని, 10 శాతం నిధులు హరితహారానికి కేటాయించాలన్నారు. గ్రామాలు, పట్టణాలు బాగుపడితే రాష్ట్రం బాగుపడినట్టేనని, వనరులు, అవసరాలను బేరీజు వేసుకుని గ్రామాల వారీగా నాలుగేళ్ల ప్రణాళిక తయారు కావాలని, దాని ఆధారంగా డిస్ట్రిక్ట్ ప్రోగ్రెస్ కార్డు రూపొందించుకుని పనులు చేయాలన్నారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం ద్వారా ప్రభుత్వం తన వద్ద ఉన్న అధికారాలను వదులుకుని కలెక్టర్లకు పూర్తి అధికారాలు అప్పగించిందని గుర్తుచేశారు. గ్రామ కార్యదర్శి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పంచాయతీరాజ్ శాఖలో ఖాళీలు భర్తీ చేశామని, కరోనా కష్టకాలంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ప్రతీనెలా నిధులను విడుదల చేశామన్నారు. ప్రజలను, ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేస్తూ ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నారు. పల్లెల అభివృద్ధి పనుల కోసం అన్ని స్థాయిలో పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు. గిరిజన తండాలు, గూడాలు, మారుమూల పల్లెలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా చేయడంతో గ్రామాలు చిన్నగా అయ్యాయని, పనుల నిర్వహణ, పర్యవేక్షణ తేలికవుతోందన్నారు.
ఇప్పుడు మారకుంటే మరెప్పుడూ మారవు
ఇన్ని అనుకూలతలున్నప్పుడు గ్రామాలు బాగుపడకుంటే ఇక ఎప్పటికీ మార్పు రాదని సీఎం నొక్కిచెప్పారు. ప్రజల్లో అవగాహన, స్పూర్తి కలిగించి ఉద్యమ స్పూర్తితో గ్రామాలను అభివృద్ధి చేయడానికి కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు బాధ్యత తీసుకోవాలని కోరారు. ప్రతీ గ్రామానికి ట్రాక్టర్, వైకుంఠ ధామం, నర్సరీ, డంపు యార్డు సమకూరడం విప్లవంగా సీఎం అభివర్ణించారు. అన్ని గ్రామాలకూ ట్రాక్టర్లు వచ్చాయని, వాటికి ట్యాంకర్లు, ట్రాలీలు కూడా వస్తున్నాయని, ఈ నెలాఖరుకు అన్నీ సమకూరుతాయన్నారు. పల్లె ప్రగతి పేరుతో ప్రతీ రోజు ప్రతీ గ్రామం శుభ్రం కావాల్సిందేనని, సీఎం, సీఎస్ నుంచి మొదలుకుని ప్రతీ ఒక్కరూ గ్రామాల పరిశుభ్రతే ప్రాధాన్యంగా ఉండాలన్నారు. ఫలితంగా ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం పెట్టే ఖర్చు తగ్గుతుందని సూచించారు. గ్రామాల్లో గుంతలు తొలగించాలని, పాడుపడిన బావులను పూడ్చాలని, నిరుపయోగమైన బోర్లను పూడ్చాలని, పిచ్చి చెట్లను, సర్కారు తుమ్మను తొలగించాలన్నారు.
పరిషత్‌లకు ఆర్థిక సంఘం నిధుల కేటాయింపు
గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీలతోపాటు మండల పరిషత్, జిల్లా పరిషత్‌లు కూడా ఉన్నాయని, ఫైనాన్స్ కమిషన్ నిధుల్లో పది శాతం మండల పరిషత్‌లకు, ఐదు శాతం జిల్లా పరిషత్‌లకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం ప్రకటించారు. గ్రామాల్లో పచ్చదనం, పారిశుధ్యం విధుల నిర్వహణలో కానీ, ఇతర అభివృద్ధి పనుల నిర్వహణలో అలసత్వాన్ని క్షమించవద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని, జిల్లా కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇచ్చామని, రాజకీయ జోక్యం ఉండదని సీఎం స్పష్టంచేశారు.
గ్రామాల్లో చేతినిండా ఉపాధి పనులు
గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 13 కోట్ల పనిదినాలను లక్ష్యంగా ఇస్తే, ఇప్పటికే 9.81 కోట్ల పనిదినాలను (75.5 శాతం) పూర్తి చేసినట్లు తెలిపారు. నరేగా పనులను సమర్థవంతంగా నిర్వహించిన అధికారులను సీఎం అభినందించారు. ఉపాధి హామీ పథకాన్ని మరింత వ్యూహాత్మకంగా వాడుకోవాలని, ఎక్కువ పని కల్పించాలని సూచించారు. నర్సరీలు, మొక్కల పెంపకం పనులు, కాల్వల మరమ్మత్తులు, పూడికతీత, వైకుంఠధామాల నిర్మాణం, డంపుయార్డుల నిర్మాణం, గ్రామాల్లో అంతర్గత రహదారుల నిర్మాణం, అంగన్ వాడీ కేంద్రాల నిర్మాణం, మురుగు నీరు, నిల్వ ఉన్న నీటి తొలగింపు పనులు, పాఠశాలల్లో ఆట స్థలాల ఏర్పాటు, పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం, కల్లాల నిర్మాణం, వ్యవసాయ భూమిని చదను చేసుకునే పనులు, పంట చేలకు పశువులు రాకుండా ట్రెంచ్ నిర్మాణం, ఇంకుడు గుంతల ఏర్పాటు, గొర్రెల, మేకలు, బర్రెలు, కోళ్ల కోసం షెడ్ల నిర్మాణం… ఇలా అన్ని పనులూ నరేగా ద్వారా చేపట్టాలని సీఎం ఆదేశించారు.
లక్ష కల్లాలు
వ్యవసాయం లేని పట్టణ నియోజకవర్గాలను మినహాయించి, రాష్ట్రంలోని అన్ని గ్రామీణ నియోజకవర్గాల్లో మొత్తం లక్ష కల్లాలను ఈ ఏడాది నిర్మించాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి కల్లాలు కేటాయిస్తామని, రైతులకున్న భూమి, అవసరాన్ని బట్టి 50, 60, 75 చదరపు అడుగుల విస్తీర్ణాల్లో కల్లాల నిర్మాణానికి అనుమతులు ఇస్తామన్నారు. ప్రతీ ఏటా ప్రతీ నియోజకవర్గానికి వెయ్యి చొప్పున కేటాయిస్తామని, ఎక్కువ మంది రైతులు ముందుకొస్తే, లాటరీ ద్వారా ఎంపిక చేస్తామన్నారు. రూ. 750 కోట్ల వ్యయం అయ్యే కల్లాల నిర్మాణానికి నరేగా నిధులు వినియోగించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీతో నిర్మించాలని, మిగతా వారు 10 శాతం లబ్దిదారుడి వాటాగా చెల్లిస్తే, 90 శాతం సబ్సిడీ ఇస్తామన్నారు. ఈసారి ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్, నీటి పారుదల లాంటి ఇంజనీరింగ్ శాఖలతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నరేగా పనులు చేయాలని నిర్ణయించామని, దీనికోసం నరేగా ఇంజనీరింగ్ ఆఫీసర్స్ (ఎన్.ఇ.ఓ)ను నియమించాలని సీఎం ఆదేశించారు.
నకిలీ విత్తన వ్యాపారులు రైతు హంతకులు
నకిలీ, కల్తీ విత్తనాల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అలాంటివారిపై పీడీయాక్టు నమోదు చేయాలని సీఎం ఆదేశించారు. నకిలీ విత్తనాల వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని, విలువైన పంటకాలం పోతుందని, తీవ్ర ఇబ్బందులకు గురై రైతు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. నకిలీ విత్తన వ్యాపారులు రైతు హంతకులని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నకిలీ, కల్తీ విత్తనాల దందా ఆగిపోవాల్సిందేనని, రైతుబంధు సమితులు చురుగ్గా వ్యవహరించాలని కోరారు. నకిలీ, కల్తీ విత్తనాలు అమ్మే సమాచారం ఇచ్చిన వారికి రూ. 5వేల నగదు ప్రోత్సాహం ఇవ్వాలని, వారి పేర్లు గోప్యంగా ఉంచాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం ప్రకటించారు.
మిడతల దండు ప్రమాదం పోలేదు
మిడతల దండు ప్రమాదం తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా తొలగిపోలేదని, గతంలో వచ్చినవి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మీదుగా వెళ్లిపోయాయని, ప్రస్తుతం మరో దండు వార్దా సమీపంలోకి వచ్చిందని సీఎం గుర్తుచేశారు. ఇది తెలంగాణకు వచ్చే అవకాశం ఉందని, జూన్ 25 నుంచి జూలై నెల వరకు మరోసారి ప్రమాదం ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారన్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, కొత్తగూడెం, నిర్మల్, నిజమాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అధికారులు సమిష్టిగా వ్యూహాన్ని ఖరారు చేయాలని సూచించారు.
కలెక్టర్లకు ప్రశంస
రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో నరేగా పనులు చేసిన కామారెడ్డి కలెక్టర్ శరత్‌ను, కాల్వల్లో పూడికతీత పనులు, కాల్వల మరమ్మతు పనులను చేయించిన జగిత్యాల, పెద్దపల్లి, ఖమ్మం కలెక్టర్లు జి.రవి నాయక్, సిక్తా పట్నాయక్, కర్ణన్‌లను, హరితహారంలో నాటిన మొక్కల్లో ఎక్కువ శాతం మొక్కలను బతికించిన జిల్లాగా నిలిచిన నిర్మల్ కలెక్టర్ ముషర్రఫ్ అలీని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు.
కోవిడ్ నిబంధనల ప్రకారం సమావేశం నిర్వహణ
మంగళవారం ప్రగతిభవన్‌లో జరిగిన కలెక్టర్ల సమావేశంలో కోవిడ్ నిబంధనలను పాటించారు. ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని సమావేశంలో పాల్గొన్న ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, డీపీఓలందరికీ మొదట టెంపరేచర్ టెస్ట్ చేశారు. ఆ తర్వాత అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గంగాళంలోని నీళ్లు, సబ్బును ఏర్పాటుచేశారు. సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా హ్యాండ్ శానిటైజర్స్ సరఫరా అయింది. భౌతిక దూరం ప్రకారం సీటింగ్ ఏర్పాటైంది. మధ్యాహ్న భోజన సమయంలో కూడా సిబ్బంది కొవిడ్ నిబంధనల ప్రకారం పరిశుభ్రత పాటించారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ మధ్యాహ్న భోజనం చేశారు.