- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రగతి భవన్‌ను విడిచిన కేసీఆర్.. ప్రజాక్షేత్రంలో భారీ ప్లాన్..!
దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ విడిచి ప్రజాక్షేత్రం బాట పట్టారు. మూడు రోజులుగా జిల్లాల పర్యటనలో బిజీ అయిపోయారు. నిత్యం మీడియా పతాక శీర్షికల్లో సంచలనంగా మారారు. ప్రగతి భవన్‌కు, ఫామ్ హౌజ్‌కు మాత్రమే పరిమితమవుతున్నారని వస్తున్న విమర్శలకు జనం బాట పట్టి సమాధానమిచ్చారు. కేసీఆర్ మార్చిన ఈ వ్యూహం మరికొన్ని రోజుల పాటు ఇదే తీరులో కొనసాగనుంది. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక వరకూ ప్రతీ వారం ఏదో ఒక జిల్లాలో ఇదే తరహా పర్యటనలు చేయవచ్చని పార్టీల వర్గాల సమాచారం. ఎలాగూ జూలై 1వ తేదీ నుంచి నెల రోజుల పాటు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అంశాలకు హరితహారం కార్యక్రమాన్ని సైతం జోడించి జిల్లాల్లో పర్యటించనున్నట్లు సంకేతాలిచ్చారు.
ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే సచివాలయం అనే వ్యాఖ్యలు కొత్తేమీ కాదు. ఇంతకాలం ఇంటెలిజెన్స్ నివేదికలు, అధికారుల అభిప్రాయాలు, స్థానిక ప్రజా ప్రతినిధుల ఫీడ్‌బ్యాక్‌కు మాత్రమే పరిమితమైన కేసీఆర్ ఇకపై నేరుగా ప్రజలతోనే సంభాషించాలనుకుంటున్నారు. వారి నాడిని పసిగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఏ ముఖ్యమంత్రీ చేయని తీరులో కేసీఆర్ మాత్రం సహపంక్తి భోజనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఊరు మొత్తం ఇండ్లల్లో పొయ్యి వెలిగించాల్సిన అవసరం లేకుండా ఉమ్మడిగానే కిచెన్, డైనింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. మహిళల దగ్గరకు వెళ్ళి స్వయంగా భోజనం, వంటలు, రుచి గురించి ఆరా తీశారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ఇక గ్రామంలో వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల పట్ల వారికున్న అభిప్రాయాలను సేకరించారు. ఇంతకాలం ఆయన దృష్టికి వచ్చిన అంశాలను, ఇప్పుడు స్వయంగా మాట్లాడిన తర్వాత వచ్చిన అభిప్రాయాలను బేరీజు వేసుకున్నారు. ప్రజలు మెచ్చే విధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో స్పష్టతకు వచ్చారు. వ్యక్తిగత సమస్యలతో పాటు ఊరి ఉమ్మడి అవసరాలు, వారు ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు తదితరాలపై అవగాహనకు వచ్చారు.
కలెక్టర్ కార్యాలయాల ప్రారంభోత్సవాలు, జిల్లా పోలీసు కార్యాలయాల ప్రారంభోత్సవాలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు శంకుస్థాపన, యాదాద్రి ఆలయ నిర్మాణ పనులకు ఫినిషింగ్ టచ్ లాంటి అనే అంశాలను ఎంచుకుని గత కొన్ని రోజులుగా మీడియాలో కేంద్ర బిందువుగా మారారు. ఇక ప్రగతి భవన్‌లో వరుస సమీక్షా సమావేశాలతో దాదాపుగా ప్రతీ రోజూ ఏదో ఒక రకంగా పతాక శీర్షికల్లో నిలుస్తున్నారు. మరో మూడు రోజుల తర్వాత అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో ప్రగతి భవన్‌లోనే సమీక్ష నిర్వహించనున్నారు. ఆ తర్వాత రెండు రోజులకు దివంగత పీవీ నర్సింహారావు శత జయంతి వేడుకల ముగింపు కార్యక్రమానికి హాజరై ఆయన కాంస్య విగ్రహాన్ని నగరంలోని నెక్లెస్ రోడ్డులో ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత ఈ నెల చివరకు జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ప్రారంభోత్సవం కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇలా ప్రతీ వారం జిల్లాల్లో రకరకాల కార్యక్రమాలకు హాజరయ్యేలా సీఎం షెడ్యూళ్ళు రూపొందుతున్నాయి.
ఈటల రాజేందర్‌కు మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికిన తర్వాత రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలను తెప్పించుకుంటున్నారు. కేవలం హుజూరాబాద్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా దాని ప్రభావం ఎలా ఉందో తెలుసుకుంటున్నారు. ఈటల రాజేందర్ ఉద్యమకారుడు, బీసీ సామాజికవర్గానికి చెందినవారు అనే ముద్ర ఉన్నందున ఆ ప్రభావం ఏయే సెక్షన్లపై, ఏయే నియోజకవర్గాల్లో ఏ స్థాయిలో ఉందో ఆరా తీస్తున్నారు. అసంతృప్తి, అసమ్మతి ఉన్న స్వంత పార్టీ నాయకులు చేజారిపోకుండా ఏం చేయాలో తగిన ఎత్తుగడలను అవలంబిస్తున్నారు.
హుజూరాబాద్ అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో త్వరలో ఉప ఎన్నిక జరగాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. కరోనా పరిస్థితుల కారణంగా కొంత కాలం ఎన్నికల నిర్వహణ ఉండదంటూ కేంద్ర ఎలక్షన్ కమిషన్ పేర్కొన్నా ప్రస్తుతం వైరస్ అదుపులోకి వచ్చినందున ఉప ఎన్నిక జరగవచ్చనే సంకేతాలు వెలువడ్డాయి. అప్పటివరకూ సీఎం కేసీఆర్ ఏదో ఒక జిల్లాలో ఇదే తరహా పర్యటనలు చేస్తూ ప్రజలకు దగ్గర కావాలని, మీడియాలో నిత్యం కనిపించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఎలాగూ జూలై నెల మొత్తం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం లాంటివి ఉన్నందున ఇటు అధికారులతో సమీక్షలు, అటు క్షేత్రస్థాయిలో స్వయంగా పాల్గొనడం లాంటి కార్యక్రమాల్లో లీనమవ్వాలనుకుంటున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
విపక్షాల గొంతు మీడియాలో కనిపించకుండా, వినిపించకుండా ఉండేలా వ్యూహానికి పదునుపెడుతున్నారు. రెండో టర్ములో సగం కాలం పూర్తయిపోయినందున మళ్లీ ఎన్నికల సమయానికి పరిస్థితిని చక్కదిద్దుకోవడంపై దృష్టి పెట్టారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక అయిపోయిన తర్వాత ఇక ఎలాంటి హడావిడి ఉండదుకాబట్టి మరో ఉప ఎన్నిక వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని, అసెంబ్లీ ఎన్నికలు వచ్చేంత వరకు హడావిడి ఉండాలన్నది టీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తున్నది. విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా లెక్క చేయక ప్రజల మధ్యనే ఉండేలా, వారి విశ్వాసాన్ని చూరగొనేలా, దానికి తగిన కార్యక్రమాల రూపకల్పన, కొత్త ప్రకటనలు, హామీలు, వరాలు జల్లు, నిధుల విడుదల.. ఇలా ఏదో ఒక రకంగా టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ సంచలనంగా ఉండాలన్నదే వాటన్నింటిని ప్రధాన లక్ష్యం.