గంజాయిపై ఉక్కుపాదం మోపండి : సీఎం ఆదేశం

by Shyam |
CM Kcr
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో గంజాయి అక్రమ సాగు, వినియోగం మీద ఉక్కుపాదం మోపాలని ఎక్సైజ్, పోలీసు శాఖలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. గంజాయి వాడకం పెరిగినట్లు నివేదికలు వస్తున్నాయని, వెంటనే తీవ్ర స్థాయిలో యుద్ధాన్ని చేపట్టాల్సిన అవసరం ఉన్నదని, పరిస్థితి చేజారిపోకముందే ఫలితాలు రావాలని స్పష్టం చేశారు. ప్రగతి భవన్‌లో బుధవారం రివ్యూ సందర్భంగా రెండు శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. గంజాయి ఉత్పత్తిని సమూలంగా నిర్మూలించడానికి డీజీ స్థాయిలో సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. నక్సలిజం నిర్మూలన, శాంతిభద్రతల పరిరక్షణ, గుడుంబా-గాంబ్లింగ్ నియంత్రణ తదితర అనేక అంశాల్లో మంచి ఫలితాలు సాధించినందున ఇప్పుడు మాదకద్రవ్యాల విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు.

గంజాయి కారణంగా యువత పెడదోవ పడుతున్నదని, వాట్సప్ గ్రూపుల ద్వారా వినియోగానికి మార్గం వెతుక్కుంటున్నారని పేర్కొన్నారు. ఒకసారి అలవాటు పడిన తర్వాత వారిని దాని బారి నుంచి బైటకు తీసుకురావడం చాలా కష్టసాధ్యమన్నారు. గంజాయి కారణంగా యువత మానసిక ప్రవర్తనలో మార్పులు వస్తాయని, ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉన్నదన్నారు. గంజాయి మాఫియాను అణచివేయాలని, ఎంతటివారైనా ఉపేక్షించకుండా కఠినంగా అణచివేయాలన్నారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed