పార్లమెంట్ సమావేశాలకు దూరం.. ఎంపీలకు సీఎం కేసీఆర్ కీలక బాధ్యతలు

by Anukaran |   ( Updated:2021-12-05 10:14:14.0  )
పార్లమెంట్ సమావేశాలకు దూరం.. ఎంపీలకు సీఎం కేసీఆర్ కీలక బాధ్యతలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘ఎమ్మెల్సీ పోలింగ్ ముగిసేవరకు స్థానిక సంస్థల సభ్యులతో ఉండాలి. వారి ఓట్లన్నీ గంపగుత్తుగా టీఆర్ఎస్ కే పడేలా చూడాలి. క్రాస్ కాకుండా చూడాలి. ఆరు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవాలి’- ఎంపీలతో సీఎం కేసీఆర్

ఎంపీల మెడపై కత్తి వేలాడుతోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు బాధ్యతను అధిష్టానం ఎంపీలకు అప్పగించింది. విజయం సాధించకపోతే వారి రాజకీయ ప్రస్తానంపై ప్రభావం చూపనుంది. కేసీఆర్ ఆదేశాలతో ఇప్పటికే నలుగురు ఎంపీలు క్యాంపునకు వెళ్లినట్లు సమాచారం. ప్రతి ఓటు కీలకం కావడంతో క్రాస్ ఓటింగ్ జరుగకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు జరిగే ఐదు నియోజకవర్గాల్లోని ఎంపీలు పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు దూరం కానున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ హాజరుకానున్నారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార పార్టీతో పాటు ఇండిపెండెంట్లు, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లు సైలెంట్ అయ్యారు. దీంతో ఏం జరుగుతోందనని టీఆర్ఎస్ లో ఆందోళన నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకగ్రీవాల కోసం మంత్రులు రంగంలోకి దిగినా వారి పాచికలు పారలేదు. రాష్ట్రంలో జరుగుతున్న 12 స్థానాల్లో 6 ఏకగ్రీవం కాగా, మరో ఆరింటిలో ఎన్నికలు జరుగుతున్నాయి. నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్, మెదక్ లో ఒక్కొక్క స్థానానికి, కరీంనగర్ లో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే నల్లగొండ జిల్లా తప్ప మిగిలిన నాలుగు జిల్లాలకు చెందిన స్థానిక సంస్థల సభ్యులు గోవా, ఢిల్లీ, బెంగళూరు క్యాంపులకు వెళ్లారు. అయినప్పటికీ వారితో స్వతంత్ర అభ్యర్థులు, కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు నిత్యం టచ్ లో ఉంటున్నారు. తాయిలాలు ప్రకటిస్తుండటంతో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం లేకపోలేదు. దీంతో గెలుపుపై టీఆర్ఎస్ లో కొంత ఆందోళన నెలకొంది.

మెజార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు టీఆర్ఎస్ కు చెందినవారే. అయితే ఇప్పటికే 34 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రభుత్వానికి అందజేశారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో నిధులు విడుదల కాలేదు. స్థానికంగా సైతం గుర్తింపు లేకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు. ప్రజలు నిత్యం సమస్యలపై నిలదీస్తుండటంతో కొంత అసంతృప్తితో ఉన్నారు. ఇది గమనించిన టీఆర్ఎస్ అధిష్టానం క్రాస్ ఓటింగ్ జరుగుతుందని, కొన్ని స్థానాలు కోల్పోయే అవకాశం ఉందని భావించి అలర్టు అయింది. ఎంపీలతో సమావేశం నిర్వహించింది. ఎంపీలకు గెలుపు బాధ్యతను అప్పగించింది. ఇప్పటికే క్యాంపుల్లో మంత్రులు, ఎమ్మెల్యే ఉన్నప్పటికీ అక్కడ కూడా కొంత అసంతృప్తి బయటపడుతుంది. దీనిని రూపుమాపేందుకు తీసుకోవాల్సిన చర్యలను కేసీఆర్ స్వయంగా ఎంపీలకు వివరించారు. వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అందులో భాగంగానే జిల్లా పరిషత్ లకు రూ.125.87 కోట్లు, మండల పరిషత్ లకు 124.13 కోట్లు ఇచ్చింది. అయితే ఈ నిధుల విడుదల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపనుందో చూడాల్సిందే.

ఇదిలా ఉంటే ఇప్పటికే నలుగురు ఎంపీలు క్యాంపులకు తరలినట్లు సమాచారం. కరీంనగర్ నుంచి ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఆదిలాబాద్ కు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, మెదక్ క్యాంపునకు ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీపాటిల్ వెళ్లినట్లు సమాచారం. ఖమ్మం క్యాంపునకు ఎంపీ నామా నాగేశ్వరరావు వెళ్లకుండా మానిటరింగ్ చేస్తున్నట్లు తెలిసింది. నామా కూడా త్వరలోనే వెళ్లి ఓటర్లతో మాట్లాడనున్నట్లు సమాచారం. నల్లగొండ బాధ్యతను ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ కు అప్పగించారు. ఇప్పటికే నియోజకవర్గాలవారీగా జరుగుతున్న సమావేశాల్లో మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ బడుగుల సైతం పాల్గొంటూ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తున్నారు. అయినప్పటికీ ఈ నెల 6వ తేదీన క్యాంపునకు వెళ్లనున్నట్లు తెలిసింది. వారితో పాటు బడుగుల కూడా వెళ్లి పోలింగ్ ముగిసేంతవరకు వారితో ఉండనున్నారు. దీంతో పార్లమెంట్ సమావేశాలకు ఎంపీలు దూరం కానున్నారు.

పార్లమెంట్ కు లోక్ సభాపక్ష నేత దూరం?

శీతాకాల పార్లమెంట్ సమావేశాలకు టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వర రావు దూరం కానున్నారు. ఖమ్మం స్థానిక సంస్థల బాధ్యతను సీఎం కేసీఆర్ అప్పగించడంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసేవరకు స్థానిక సంస్థల సభ్యులతో ఉండాలని ఆదేశించడంతో క్యాంపునకు వెళ్లనున్నట్లు సమాచారం. అయితే ఖమ్మంకు చెందిన ఓటర్లు గోవా టూర్ లో ఉన్నారు. అయితే వారితో మానిటరింగ్ చేస్తున్నారు. పోలింగ్ కు మరో నాలుగు రోజులు గడువు ఉండటంతో కేసీఆర్ ఆదేశాలతో క్యాంపునకు వెళ్లనున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత మళ్లీ పార్లమెంట్ సమావేశాలకు హాజరుకానున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed