స్వచ్ఛ తెలంగాణ సాకారం కావాలి : కేసీఆర్

by Shyam |
స్వచ్ఛ తెలంగాణ సాకారం కావాలి : కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణను వందశాతం బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇది సాకారం కావాలంటే ప్రతీ ఇంటికీ తప్పనిసరిగా టాయ్‌లెట్ ఉండాల్సిందేనని, ఇకపైన కొత్తగా నిర్మించే ఇండ్లకు మరుగుదొడ్డి ఉంటేనే నిర్మాణానికి అనుమతి ఇవ్వాలనే షరతు విధించుకోవాలని పంచాయతీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన చేశారు. చాలా గ్రామాల్లో వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు సమకూరాయని, మిగిలిన గ్రామాల్లో సైతం ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. ప్రగతి భవన్‌లో మంగళవారం పంచాయతీల అభివృద్ధి, పల్లె ప్రగతి తదితర అంశాలపై జరిగిన సమీక్ష సందర్భంగా కేసీఆర్‌పై సూచనలు చేశారు.

పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పచ్చదనం పెంచడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ఇందుకోసమే పల్లె ప్రకృతివనం ఏర్పాటుకు రూ.5 లక్షల చొప్పున, గ్రీన్ బడ్జెట్ కింద ఆ గ్రామ పంచాయతీకి ఇచ్చే డబ్బుల్లో పది శాతాన్ని ఇస్తున్నందున వీటిని ఉపయోగించుకుని మొక్కలు నాటడానికి ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. అవసరమైతే ఉపాధి హామీ నిధులను కూడా వినియోగించుకోవాలని సూచించారు. ప్రతీ ఇంటికి మొక్కలను సరఫరా చేయాలనుకుంటున్నందున ఏ ఇంటికి ఏ రకం మొక్కలు కావాలో ముందుగానే ఇండెంట్ తీసుకుని నర్సరీల్లో వాటిని పెంచి పంపిణీ చేయాలని సూచించారు. ప్రజలు వారు కోరుకున్న మొక్కలనే కాకుండా పండ్ల రకాలు, కరివేపాకు లాంటి మొక్కలను కూడా సరఫరా చేయాలని స్పష్టం చేశారు.

పల్లెప్రగతి లక్ష్యంలో నిర్దేశించుకున్న అంశాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, చాలా గ్రామాల్లో మార్పు కనిపిస్తున్నా ఇంకా కొన్ని గ్రామాల్లో సంపూర్ణంగా ఫలితాలు రాలేదని, దీనిపై ఆయా పంచాయతీలు దృష్టి పెట్టాలని సూచించారు. సంబంధిత నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వీటిని పూర్తిచేయాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed