- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్యాకేజీ పచ్చి మోసం: సీఎం కేసీఆర్
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా లాక్‌డౌన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. ప్యాకేజీ పచ్చి మోసం, దగా అని వ్యాఖ్యానించారు. అంకెల గారడీ తప్ప అందులో ఏమీ లేదని, దాని డొల్లతనం తొందర్లోనే బైటపడుతుందన్నారు. ప్రధాని మోడీ గతంలో సహకార సమాఖ్య గురించి గొప్పగా చెప్పారని, కానీ ఇప్పుడు దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రాలు అడిగింది ఒకటైతే కేంద్రం ప్రకటించింది మరొకటి అని అన్నారు. కరోనా విపత్తు ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే అతలాకుతలం చేస్తే రాష్ట్రాలు నగదు సాయం కావాలని అడిగితే కేంద్రం మాత్రం రాష్ట్రాలను భిక్షగాళ్లుగా భావించిందని దుయ్యబట్టారు. పచ్చి ఫ్యూడల్, నియంతృత్వ విధానంతో వ్యవహరించిందన్నారు. ఫెడరల్ వ్యవస్థలో అనుసరించాల్సిన తీరు ఇది కాదన్నారు. సంస్కరణల పేరుతో ఆంక్షలను, షరతులను విధించి కరోనా కష్టకాలంలో ఇలా వ్యవహరించడం కేంద్రానికి తగదన్నారు. శిశుపాలుని వంద తప్పుల్ని మన్నించినట్లుగానే పాపం పండే రోజు వస్తుందని కేంద్రంపై నిప్పులు చెరిగారు.
కరోనా కష్టకాలంలో సంస్కరణలు అమలు చేయడం సముచితమేనా అని ప్రశ్నించిన కేసీఆర్ నగదు సాయం అడిగితే సంస్కరణలను అమలు చేయాలన్న షరతు పెట్టి రాష్ట్రాలను బెగ్గర్‌లుగా భావిస్తోందన్నారు. విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రజల మెడపై కత్తి పెట్టి అమలుచేస్తేనే నగదు సాయం చేస్తామని కేంద్రం షరతు విధించడం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తగునా అని వ్యాఖ్యానించారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేయడం కోసమే ఈ ప్రయత్నాలన్నీ అని అన్నారు. అసలు అదీ ప్యాకేజేనా అన్న సందేహాన్ని వెలిబుచ్చారు. షరతులు విధించి ఎఫ్ఆర్‌బీఎం పరిమితిని రెండు శాతం పెంచుతున్నట్లు గొప్పగా చెప్తూనే నాలుగైదు సంస్కరణలను అమలు చేయాలంటూ షరతు పెట్టిందని, ఆ షరతులతో రాష్ట్రానికి వచ్చే నాలుగైదు వేల కోట్ల రూపాయలు అవసరమే లేదని తేల్చి చెప్పారు. ప్రజలకు సంకటంగా ఉండే అలాంటి సంస్కరణలను తెలంగాణ ప్రభుత్వం అమలుచేయదల్చుకోలేదని, కేంద్రం నుంచి డబ్బు రాకున్నా తట్టుకుని నిలబడతామన్నారు. కేంద్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వడంలేదని, ఆంక్షలు పెట్టి కేంద్రం ఇచ్చేదాంతో తెలంగాణకు ఒరిగేదేమీ లేదన్నారు.
“మరికొన్ని మార్కెట్ కమిటీ సంస్కరణలను అమలుచేస్తే ఇంకో రెండున్నర వేల కోట్ల రూపాయలు ఇస్తుందట. మున్సిపాలిటీల్లో పన్నులు పెంచి ఆదాయం పెంచితే ఇంకో రెండున్నర వేల కోట్లు ఇస్తందట. దీన్ని ప్యాకేజీ అనాలా? ‘వన్ నేషన్ – వన్ రేషన్’, ‘ఈజ్ ఆఫ్ డూయింగ్’ అనేవి ఇంకొన్ని సంస్కరణలు. ఇవి కూడా అమలు చేస్తే ఇంకో మూడు వేల కోట్లు ఇస్తుందట. ఇదంతా పచ్చి మోసం. దగా. వట్టి గ్యాస్. అంకెల గారడీ. కేంద్రం తన పరువు తానే తీసుకుంది. రానున్న రోజుల్లో కేంద్రం డొల్ల ఏంటో తేలిపోతుంది” అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ప్యాకేజీని చూసి, ఈ ఆంక్షలను చూసి చాలా భాధపడుతున్నా అని అన్నారు. రాష్ట్రాలపై పెత్తనం చెలాయించాలనే ఆలోచన ‘సహకార సమాఖ్య వ్యవస్థ’కే విఘాతమన్నారు. ప్రధాని గతంలో చెప్పినదానికి పూర్తి విరుద్ధంగా ఆచరణ ఉంటోందన్నారు.
కేంద్రం పెట్టే షరతులకు అంగీకరిస్తామా లేదా అనేది రాష్ట్రాలు తీసుకునే నిర్ణయమని అన్నారు. ఆ సంస్కరణలను అమలు చేస్తాయా లేవా అనేది అప్రస్తుతమని, అయితే ఆర్థిక ప్యాకేజీ పేరుతో ఇలాంటి షరతులు విధించడం మంచి పద్ధతి కాదన్నారు. నిజానికి కేంద్రం సూచిస్తున్న సంస్కరణల్లో మూడు మనం ఎప్పుడో చేశామని, ఈఓడీబీలో మనం నెంబర్ వన్‌లో ఉన్నామని గుర్తుచేశారు. కేంద్రం సూచించిన విద్యుత్ సంస్కరణపై మంత్రివర్గంలో చర్చించామని, ముష్టి రెండున్నర వేల కోట్ల రూపాయలు అసలు తీసుకోవద్దనే నిర్ణయించామని కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డవేనని, కేంద్రం కంటే రాష్ట్రాల మీదనే ఎక్కువ బాధ్యతలు ఉన్నాయని, ప్రజలతో నేరుగా సంబంధాలు ఉండేది రాష్ట్రాలకేనని, ఇలాంటి సంస్కరణలు, షరతులతో ప్రజలకు ఇబ్బంది అని అన్నారు.
డివల్యూషన్ అనే పేరు పెట్టారు కానీ, దీన్ని ఆర్థిక సంఘం ‘షేర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ సెంట్రల్ టాక్సెస్’గా పేర్కొందని, రాష్ట్రాలకు లభించిన రాజ్యాంగ హక్కు ఇది అని అన్నారు. దీన్ని గోల్ మాల్ చేయడానికి కేంద్రం చాలా ప్రయత్నాలు చేసిందని, అనేక రకాల పన్నుల్ని కేంద్ర పన్నుల రూపంలో కాకుండా ‘సెస్’ల రూపంలో వసూలు చేసుకుంటోందన్నారు. పన్నుల రూపంగా పెడితే అందులో రాష్ట్రాలకు కూడా వాటా ఇవ్వాల్సి ఉంటుందన్న ఉద్దేశంతో రకరకాల పేర్లతో ‘సెస్’ పేరు పెట్టి వసూలు చేసుకుంటోందన్నారు.