- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్‌ది వ్యూహమా.. తప్పటడుగులా..? అభ్యర్థుల ఎంపిక వారికి ప్రాధాన్యం ఏది..?
దిశ, తెలంగాణ బ్యూరో: మండలి ఎన్నికల్లో గులాబీ ముళ్లు గుచ్చుకుంటున్నాయి. సొంత పార్టీలోనే వ్యతిరేకవర్గం రంగంలోకి దిగింది. అభ్యర్థుల ఎంపికలో సీనియర్లందరినీ పక్కనపెట్టడంపై భగ్గుమంటున్నారు. మరోవైపు అష్టకష్టాలు పడి టికెట్ తెచ్చుకున్న వారు కూడా ఒంటరిపోరు చేయాల్సి వస్తోంది. జెండా మోయకపోయినా ఏ ఎజెండాతో వారికి అవకాశమిచ్చారనేది ఇప్పుడు సీనియర్లు వేస్తున్న ప్రశ్న. పార్టీలో ఉన్నారో.. లేరో తెలియకపోయినా, జిల్లా నేతలతో ఇమడకపోయినా హైకమాండ్ వారికెందుకంత ప్రయార్టీ ఇచ్చిందో అంతు చిక్కడం లేదు. జిల్లాల్లో స్థానిక సంస్థల కోటాలో మండలికి ఎంపికయిన అభ్యర్థుల వెనుక ఉన్నదెవరు, చక్రం తిప్పిందెవరు, ప్రధానంగా రెండు జిల్లాల్లోని ఇద్దరు అభ్యర్థులపై పార్టీలో రచ్చకు దారి తీస్తోంది.
స్థానిక సంస్థల కోటా కింద మండలికి 12 మంది అభ్యర్థులను ఎంపిక చేసి నామినేషన్లు దాఖలు చేయించారు. ఇందులో ఏడుగురు సిట్టింగ్‌లు ఉండగా.. మరో ఐదుగురు కొత్తవారు. కొత్త అభ్యర్థుల ఎంపికపై పార్టీలో రసవత్తర చర్చ సాగుతోంది. పార్టీ జెండా మోసిన వారిని కాదని, ఉద్యమంలో పని చేసిన వారు కాకున్నా.. కనీస రాజకీయ అనుభవం లేకపోయినా ఎందుకిచ్చారంటూ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ ఐదుగురిలో ఇద్దరు అభ్యర్థుల ఎంపిక పార్టీ సీనియర్లకు, జిల్లా నేతలకు అంతు చిక్కడం లేదు. ఇందులో ఒకటి ఖమ్మం, మరోటి ఆదిలాబాద్.
తుమ్మలకు ఇక రాం రాం
ఖమ్మం జిల్లాలో కష్టకాలం నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతలకు షాక్ ఇచ్చారు. అధినేత నిర్ణయం పుండు మీద కారం చల్లినట్లుగా మారింది. సీనియర్ నేతల్నీ కాదని రాజకీయంగా ఓనమాలు నేర్చుకుంటున్న ఓ కొత్త నేతకు మండలికి అవకాశం ఇవ్వడంపై ఖమ్మం జిల్లాలోని పార్టీ సీనియర్లు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. 2014లో కార్యకర్తగా చేరిన తాతా మధుకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడంలో కేసీఆర్వ్యూహం ఎలా ఉన్నా జిల్లాలో మరో వర్గానికి ఆజ్యం పోసినట్లుగా మారింది. జిల్లాకు ఏ మాత్రం పరిచయం లేని తాతా మధును ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దించడంతో ఆశావహుల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లైంది.
అమెరికా నుంచి వచ్చిన తాతా మధు తొలిసారిగా ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ తర్వాత కొంతకాలం స్థబ్దుగా ఉన్న తర్వాత టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్‌లో కీలకంగా ఉన్న పల్లా రాజేశ్వరరెడ్డితో ఉన్న స్నేహం, బంధుత్వంతో అనతి కాలంలోనే ప్రజా పోరాటాలు లేకుండానే రాష్ట్ర స్థాయికి ఎదిగారు. పాలేరు నియోజకవర్గం మీద ఆశలు పెట్టుకున్న తాతా మధు అనూహ్యంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా రావడం జిల్లాలో సంచలనంగా మారింది.
నాయకులు రాకుండానే నామినేషన్
ప్రతీ ఎన్నికల్లోనూ మేమంతా ఒక్కటే అన్న సంకేతాలు ఇచ్చే అక్కడి నేతలు ఎవరూ తాతా మధు నామినేషన్ ప్రక్రియకు రాకపోవడం గమనార్హం. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, వైరా, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు రాములు నాయక్, నాగేశ్వరరావు, ఖమ్మం జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ మాత్రమే నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. నామినేషన్ ప్రక్రియకు వచ్చిన నేతలు ఎవరూ మీడియాతో మాట్లాడేందుకు ఆసక్తి చూపించలేదు. ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దూరంగా ఉండటం రాజకీయ ప్రకంపనలకు దారి తీసింది.
జిల్లాలో జరిగిన అనూహ్య మార్పులు ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. తుమ్మల నాగేశ్వరరావు తప్ప మరెవరైనా ఫర్వాలేదు అన్న అంశంతో తాతా మధు పేరు అధిష్ఠానం తీసుకు వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. దీనిలో అక్కడి మంత్రి కూడా కీలకంగా చక్రం తిప్పారని టాక్. పాలేరు నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు వ్యూహంలో భాగంగా కమ్మ సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇచ్చారని తెలుస్తోంది. సామాజిక వర్గమే కొలమానం అయితే ఆ సామాజికవర్గ నేతలు సైతం గులాబీ బాస్ నిర్ణయం పట్ల కినుక వహిస్తున్నారు.
ఆదిలాబాద్‌లోనూ అంతే..!
ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టీఆర్ఎస్నేతల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆ జిల్లా రాజకీయాలకు పరిచయం లేని వ్యక్తిని మండలి అభ్యర్థిగా ఎంపిక చేయడంపై ఆ జిల్లా పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఉద్యమ కాలం నుంచి సీనియర్లుగా పార్టీలో కొనసాగుతూ గుర్తింపు పొందిన పలువురు లోకల్ బాడీ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ వచ్చారు. వీరికి హైకమాండ్ సైతం పాజిటివ్ సంకేతాలు అందించింది. నిర్మల్ నుంచి సీనియర్ నాయకులు శ్రీహరిరావు, సత్యనారాయణ గౌడ్, బోథ్‌కు చెందిన మాజీ మంత్రి గోడం నగేష్, ఆసిఫాబాద్‌కు చెందిన అరిగెల నాగేశ్వర్రావుతో పాటు సిట్టింగ్ అభ్యర్థి పురాణం సతీష్ పేర్లు నిన్నటి వరకు సీరియస్‌గా చర్చకు వచ్చాయి. వీరెవ్వరిని అధినేత పరిగణలోకి తీసుకోలేదు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సైతం నిర్మల్‌కు చెందిన సత్యనారాయణ గౌడ్ పేర్లు హైకమాండ్ వద్ద ప్రతిపాదించారు. మంత్రికి తెలియకుండానే విఠల్ పేరును అధిష్టానం ప్రకటించడంతో నేతలంతా అసంతృప్తితో ఉన్నారు. దండె విఠల్ సొంత నియోజకవర్గం కాగజ్ నగర్ అయినప్పటికీ ఆయన ప్రస్తుతం హైదరాబాద్, యూఎస్ఏలో ఉంటున్నారు. జిల్లాకు చెందిన పార్టీ నాయకులు, కేడర్‌తో విఠల్ ఎలాంటి సంబంధాలు పెట్టుకోలేదు. జిల్లాలోని పార్టీ కార్యకలాపాలతో కూడా ఆయనకు ఇప్పటి వరకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు లేవు.
కేవలం హైదరాబాద్‌లో ఉంటూ అక్కడి ముఖ్య నేతలతో సంబంధాలు కలిగి ఉన్న విఠల్‌కు అనూహ్యంగా ఆదిలాబాద్ లోకల్ బాడీ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దక్కడం పట్ల భిన్నాభిప్రాయా లు వ్యక్తమవుతున్నాయి. అభ్యర్థిత్వం ఆశించిన సీనియర్ నాయకులంతా ప్రస్తుతం తీవ్ర నిరాశకు గురైనట్లు ప్రచారం జరుగుతోంది. కేడర్ సైతం దండె విఠల్ అభ్యర్థిత్వం విషయంలో గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆరేళ్లపాటు ఎమ్మెల్సీగా వ్యవహరించిన పురాణం సతీష్ కుమార్ తన పదవీకాలం పూర్తికావడంతో టీఆర్ఎస్ అధిష్ఠానం తనకు మరోమారు అవకాశం వస్తుందని ఆశిస్తున్నారు.
మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి కూడా ఎమ్మెల్సీ పదవి రేసులో ఉన్నారు. 2009, 2014 రెండు పర్యాయాలు అరవిందరెడ్డి ఎమ్మెల్యేగా పని చేశారు. ఉద్యమ నాయకునిగా, ప్రజాదరణ ఉన్న వ్యక్తిగా ఆయనకు పేరుంది. పైగా 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం శ్రీరాంపూర్‌కు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అతి త్వరలో అరవిందరెడ్డికి సముచి త స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన ఏ పదవి లేకుండానే పార్టీకి సేవలందిస్తుండగా, ఈసారి సీఎం హామీ మేరకు తనకు అవకాశం లభిస్తుందనుకున్నా.. నిరాశే మిగిలింది.
చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ నల్లాల ఓదెలు పేరు కూడా ఎమ్మెల్సీ రేసులో తెరపైకి వచ్చింది. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా సేవలందించిన ఓదెలు గత అసెంబ్లీ ఎన్నికల్లో తన సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. 2018 అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి ఆయన తప్పుకోగా ప్రస్తుత ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు టికెట్ లభించింది. తన సిట్టింగ్ స్థానాన్ని త్యాగం చేసినందున ఓదెలుకు సముచిత స్థానం కల్పిస్తామని అప్పట్లో టీఆర్ఎస్ అధిష్ఠానం ప్రకటించింది. వీరందరికీ సీఎం ఝలక్ ఇవ్వగా దండె విఠల్‌కు బీ ఫారం అందించారు.
సైలెంట్‌గా పక్కకు
ప్రస్తుతం ఈ జిల్లాలతో పాటుగా పలు స్థానాల్లో టికెట్ఆశించిన సీనియర్లు సైలెంట్‌గా పక్కకు ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పోటీలో నిలిచిన వారికి ఎలాంటి మద్దతు ఇవ్వకుండా తమ పాత పరిచయాలను వాడుకుని ఒక విధమైన వ్యతిరేకతను చూపించాలనే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు పార్టీలో టాక్. అంతేకాకుండా అటు కరీంనగర్‌నుంచి కార్పొ రేషన్మాజీ మేయర్సర్ధార్ రవీందర్సింగ్స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆయనకు కొంతమంది నేతలు కూడా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.