సెకండ్ వేవ్‌పై దృష్టి పెట్టండి : జగన్

by srinivas |   ( Updated:2020-12-22 08:46:47.0  )
cm jagan
X

దిశ, ఏపీబ్యూరో : ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు గ్రామాల్లో పర్యటించాలి. నేరుగా ఇళ్లకు వెళ్లాలి. ప్రతీ కుటుంబానికి ఫ్యామిలీ వైద్యుడిగా సేవలందించే స్థాయికి వైద్య ఆరోగ్య వ్యవస్థను తీసుకెళ్లాలని సీఎం జగన్​ నిర్దేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖలో ‘నాడు– నేడు’పై సీఎం జగన్​ సమీక్షించారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు నిర్ణీత గడువుతో కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. దీనికి సంబంధించి ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, మందుల కొరత లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. ప్రతీ వ్యాధిగ్రస్తుడి వివరాలు విలేజ్​క్లినిక్​లో నమోదయ్యేట్లు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మండలంలో కనీసం రెండు పీహెచ్‌సీలు ఉండేలా చూడాలన్నారు. అంచనాగా ప్రతి పీహెచ్‌సీలో కనీసం ఇద్దరు చొప్పున నలుగురు డాక్టర్లను నియమించి ప్రతి డాక్టర్‌కు కొన్ని గ్రామాలను కేటాయించాలని సీఎం ఆదేశించారు. ప్రతి నెలకు రెండు సార్లు డాక్టర్‌ తనకు నిర్దేశించిన గ్రామాలకు వెళ్లాలి.

దీంతో గ్రామాల్లో ప్రజలకు, వారి ఆరోగ్య పరిస్థితులపై డాక్టర్‌కు అవగాహన ఏర్పడుతుందన్నారు. ఎలాంటి వ్యాధులతో బాధపడుతున్నారన్నదానిపైన కూడా వైద్యుడికి అవగాహన వస్తుందని చెప్పారు. వైద్యుడు ఆయా గ్రామాలకు వెళ్తున్నప్పుడు ఆరోగ్య మిత్ర, ఆశావర్కర్‌లు డాక్టర్‌తో ఉండాలన్నారు. అవసరమైతే 104 వాహనాలను పెంచుకోవాలని సూచించారు. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్రిటన్‌ తోపాటు కొన్ని దేశాల్లో ఆంక్షలను విధించినట్లు తెలిపారు. ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. సూపర్‌ స్పెషాల్టీ సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. వ్యాక్సిన్‌ ఇవ్వడానికి ప్రస్తుతం ఉన్న సదుపాయాలపై సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వ్యాక్సిన్‌ నిల్వ, పంపిణీకి అందుబాటులో ఉన్న సదుపాయాలపై అధికారులు వెల్లడించారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన మొదటి 2 నెలల్లోనే అందరికీ వ్యాక్సిన్లు ఇచ్చే సామర్థ్యం, సిబ్బంది ప్రభుత్వానికి ఉందన్నారు. మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్​పంపిణీపై ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లకు అవగాహన, శిక్షణ ఇవ్వాలని సీఎం సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో వ్యాక్సిన్‌ను నిల్వచేసే స్థాయికి వెళ్లేలా తగు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

నేటి నుంచి 25వరకు కడప జిల్లా పర్యటన..

బుధవారం సాయంత్రం నుంచి శుక్రవారం వరకు సీఎం జగన్​కడప జిల్లాలో పర్యటిస్తారు. 23 సాయంత్రానికి ఇడుపలపాయలోని వైఎస్సార్​ఎస్టేట్​కు చేరుకుంటారు. రాత్రి అక్కడ బస చేస్తారు. 24న పులివెందుల వైఎస్సార్​ఘాట్​లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం ఆర్టీసీ బస్టాండు, డిపో, ఏపీ క్లార్‌ భవనాలు, ఇండ్రస్టియల్‌ డెవలప్‌మెంట్‌ పార్కులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేస్తారు. 25న క్రిస్మస్​పండుగ సందర్భంగా భాకరాపురంలో నిర్వహించే పలు ప్రార్థనల్లో పాల్గొని తిరిగి సాయంత్రానికి తాడేపల్లి చేరుకుంటారు.

Advertisement

Next Story

Most Viewed