పేదవాడు పెద్దవాడితో పోటీ పడాలి : జగన్

by Anukaran |   ( Updated:2020-10-08 03:15:10.0  )
పేదవాడు పెద్దవాడితో పోటీ పడాలి : జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గురువారం జగనన్న విద్యాకానుక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రపంచంలో దేన్నైనా మార్చే శక్తి విద్యకు ఉందని, ప్రపంచాన్ని మార్చే శక్తి మన పిల్లలకు కూడా రావాలని అన్నారు. నేటి విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు రావాలని తెలిపారు. అందరికీ చదువే తరగని ఆస్తి అని, మన బతుకులను మార్చే ఆస్తి చదువొక్కటే అని స్పష్టం చేశారు. తమ పిల్లలను గొప్పగా చదివించాలనే ఆశ అందరి తల్లిదండ్రులకూ ఉంటుందన్నారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. స్కూళ్లలో అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి పేదవాడు పెద్దవాడితో పోటీ పడాలనే లక్ష్యంతో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామన్నారు. ఒకటవ తరగతి నుంచి పదో తరగతి వరకూ విద్యా కానుక అన్నారు. అంతేగాకుండా నవంబర్ 2వ తేదీన రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు తెరుస్తామని స్పష్టం చేశారు. స్కూళ్లు తెరవకముందే అందరి విద్యార్థులకు కానుకలు అందజేస్తామన్నారు. అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా మన పిల్లలు ప్రతిఒక్కరూ చదువుకోవాలని సీఎం జగన్ అన్నారు. చదువుకుంటనే మన తలరాత మారుతుందని వెల్లడించారు.

విద్యారంగంలో 8 పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఇది జగన్ మేనమామ ప్రభుత్వమని పిల్లలందరూ అనుకోవాలన్నారు. కాగా అంగన్ వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ సూళ్లుగా మారుస్తున్నామని తెలిపారు. పిల్లలకు గట్టి పునాదులు వేయాలనే ఈ మార్పునకు శ్రీకారం చుట్టామని అన్నారు. ఇంజినీరింగ్ ఫీజులు కట్టలేక విద్యార్థులు కాలేజ్ మానేయకూడదని స్పష్టం చేశారు. ఇంజినీరింగ్, మెడిసిన్ సహా అన్ని చదువులకు పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ఉన్నత విద్య చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు రెండు దఫాలుగా రూ.20 వేలు ఇస్తామని తెలిపారు. అంతేగాకుండా విద్యార్థులకు కంటి పరీక్షలు చేసి, కండ్ల అద్దాలు కూడా అందిస్తాని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story