టీ-కాంగ్రెస్‌లో ప్రకంపనలు.. టీఆర్ఎస్‌లోకి భట్టి విక్రమార్క..?

by Anukaran |   ( Updated:2021-06-27 12:01:50.0  )
టీ-కాంగ్రెస్‌లో ప్రకంపనలు.. టీఆర్ఎస్‌లోకి భట్టి విక్రమార్క..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఒక్కసారిగా యూ టర్న్ తీసుకున్నారనే ప్రచారం రాష్ట్రంలో జోరందుకుంది. ఈ పరిస్థితులను బట్టి అంచనా వేస్తే… ఆయన కాంగ్రెస్‌లో ఉంటారా.. పార్టీ మారుతున్నట్లు సంకేతాలిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో తిట్టిపోసిన భట్టి.. ఒక్కసారిగా స్వరం మార్చారు. అది కూడా టీపీసీసీ ప్రకటన తర్వాత మరింత తగ్గించారు. అంతకు ముందు ప్రగతిభవన్‌కు వెళ్లి అభాసుపాలైన కాంగ్రెస్​ఎమ్మెల్యేలు అపవాదులో చిక్కుకున్నట్లైంది. ఇదే సమయంలో పార్టీ అధిష్టానం కూడా భట్టితో పాటు ఎమ్మెల్యేల వైఖరిని తప్పు పట్టింది. ఇదంతా దుమారం రేపుతున్న క్రమంలో కేసీఆర్​ మీటింగ్‌కు భట్టి ఒక్కడే వెళ్లడం మరింత ఆజ్యం పోసినట్లవుతోంది.

మొన్నటి దాకా నిలదీతలు

దళితుల అంశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అసెంబ్లీ సమావేశాల నుంచి మొదలుకుని.. శనివారం జరిగిన దళిత ఆవేదన దీక్ష వరకు ప్రభుత్వాన్ని నిలదీశారు. దళితుడినే సీఎం చేస్తామని ప్రకటించడం, మూడెకరాల భూ పంపిణీ, దళిత వర్గాలపై దాడులపై ప్రశ్నిస్తూనే ఉన్నారు. గతంలో నేరేళ్ల, మంథని సంఘటనలపై కూడా భట్టి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఈ అంశంలో ఒక్కసారి కూడా భట్టికి సానుకూల సమాధానం రాలేదు. తాజాగా దళిత మహిళ మరియమ్మ లాకప్​డెత్ అంశంపై నిరసనలకు దిగిన భట్టి విక్రమార్కకు ప్రగతిభవన్‌ నుంచి పిలుపు వచ్చిన విషయం తెలిసిందే. ఆయనతో పాటుగా ముగ్గురు ఎమ్మెల్యేలు కలిసి సీఎంను కలిశారు. ఏడేండ్ల తర్వాత తొలిసారి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ప్రగతిభవన్​ మెట్లు ఎక్కారు.

అయితే దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కనీసం రాష్ట్ర నాయకత్వానికి కూడా సమాచారం లేకుండా ఎలా వెళ్తారని కాంగ్రెస్​పార్టీ ఎస్సీసెల్​ చైర్మన్ ఎదుటే భట్టిని ప్రశ్నించారు. దీంతో ఆయన కొంత అలకబూనినట్లు తెలిసింది. ఇదే సమయంలో ఏఐసీసీ టీపీసీసీ చీఫ్ ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఆశించిన భట్టికి టీపీసీసీలో ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. ఇది భట్టికి మరింత ఆవేదనను తెచ్చిపెట్టినట్లుగా మారింది.

స్వరం మార్చారు

ఇక ఎస్సీ ఎంపవర్‌మెంట్ అంటూ సీఎం కేసీఆర్ ఆదివారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనికి బీజేపీ రామని తేల్చి చెప్పింది. కాంగ్రెస్​ నుంచి భట్టి హాజరుకారని భావించినా… ఆయన ప్రగతిభవన్‌కు వెళ్లి సమావేశంలో పాల్గొన్నారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్‌ను మెచ్చుకున్నారు. మరియమ్మ అంశంలో దళిత సమాజానికి భరోసాను, ధైర్యాన్ని ఇచ్చారంటూ సీఎంపై ప్రశంసలు కురిపించారు. వాస్తవానికి కేసీఆర్ అఖిలపక్ష సమావేశానికి వెళ్లడంపై భట్టిని వారించినట్లు కాంగ్రెస్​ నేతలు చెప్పుతున్నారు. కానీ, దీనికి సమాధానం ఇవ్వకుండానే ఆయన వెళ్లినట్లు సమాచారం. అంతేకాకుండా సీఎంను అభినందించడం కూడా కాంగ్రెస్ నేతలకు నచ్చడం లేదని టాక్​.

పార్టీ మారుతారంటూ ప్రచారం

అయితే టీపీసీసీ చీఫ్ ప్రకటనతో భట్టి పార్టీపై ఆగ్రహంగా ఉన్నట్లు కాంగ్రెస్‌లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు రాష్ట్రంలో ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే దళిత మహిళ మరియమ్మ లాకప్​డెత్ అంశంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రగతిభవన్​గేట్లు తెరుచుకున్నాయని, దీనిలో హుజురాబాద్​ ఉప ఎన్నికల అంశపైనే చర్చలు సాగించారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల్లో భట్టి విక్రమార్క అనూహ్యంగా వాయిస్ మార్చడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరలోనే పార్టీ మారే అవకాశాలు కూడా ఉన్నాయని రాజకీయవర్గాల్లో టాక్.

Advertisement

Next Story

Most Viewed