మరో ఆరు నెలలు మీరు అక్కడే

by Shyam |
మరో ఆరు నెలలు మీరు అక్కడే
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలోని వివిధ జిల్లాల వైద్యాధికారుల పరిధిలో డిప్యూటేషన్, ఆర్డర్ టు వర్క్ (వర్క్ ఆర్డర్) ప్రకారం పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, మినిస్టీరియల్ సిబ్బంది ఇప్పుడు పనిచేస్తున్న చోటనే మరో ఆరు నెలల పాటు పనిచేయాల్సిందిగా రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ కార్యాలయం స్పష్టం చేసింది. అన్ని జిల్లాల్లో వైద్యాధికారులు ఈ ఆదేశాలను అమలుచేయాల్సిందిగా శుక్రవారం రాత్రి విడుదల చేసిన ఒక సర్క్యులర్‌లో పేర్కొన్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నవారికి కూడా ఈ ఆదేశం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రతీ జిల్లా వైద్యాధికారి ఈ ఆదేశాన్ని పటిష్టంగా అమలుచేయాలని, నిర్లక్ష్యంగా ఉన్నవారిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

కరోనా పాజిటివ్ కేసులు ఇప్పుడు జిల్లాల్లో కూడా గణనీయంగా పెరిగిపోతున్నందున టెస్టింగ్‌లతో పాటు చికిత్సను కూడా అక్కడే చేసే ఏర్పాట్లు జరిగాయి. ఇందుకోసం అవసరమైన టెస్టింగ్ కిట్లను, మందులను, ఇతర ఉపకరణాలను కూడా జిల్లా కేంద్రాలకు తరలిపోయాయి. అదనపు సిబ్బందిని నియమించడానికి కూడా వైద్య విధాన పరిషత్, ప్రజారోగ్య శాఖ, వైద్య విద్య శాఖలు వేర్వేరుగా కసరత్తు మొదలుపెట్టాయి. జిల్లాల్లో అవసరమైన అసిస్టెంట్ సివిల్ సర్జన్లు, డాక్టర్లను కాంట్రాక్టు పద్ధతిలో నియమించడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రజారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నియామక ప్రక్రియను చేపట్టిన రాష్ట్ర వైద్యారోగ్య సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వైద్య పట్టభద్రులను సోమవారం ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ భవనంలో జరిగే ఇంటర్‌వ్యూలకు హాజరుకావాల్సిందిగా ప్రకటన జారీ చేసింది. వీరంతా ఆరు నెలల పాటు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేయనున్నారు.

ఒకవైపు సిబ్బంది కొరతను అధిగమించడానికి కసరత్తు చేస్తూనే గత కొంత కాలం నుంచి డిప్యూటేషన్, ఆర్డర్ టు వర్క్ పద్ధతిలో పనిచేస్తున్నవారు కూడా మరో ఆరు నెలల పాటు అక్కడే పని చేయాల్సి ఉంటుందని, సర్క్యులర్ ద్వారా స్పష్టం చేసి అమలుచేసే బాధ్యతను జిల్లా వైద్యాధికారులకు అప్పగించింది రాష్ట్ర ప్రజారోగ్య శాఖ. కరోనా వైరస్ కమ్యూనిటీలోకి వెళ్ళిపోయిందని, రానున్న నాలుగైదువారాల్లో పరిస్థితి చాలా క్లిష్టంగా మారుతుందని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ వ్యాఖ్యానించిన తర్వాత ఈ సర్క్యులర్ జారీ చేయడం గమనార్హం.

Advertisement

Next Story