ఐక్యరాజ్య సమితికి అమెరికా బకాయి పడింది : చైనా

by vinod kumar |   ( Updated:2020-05-16 08:46:01.0  )
ఐక్యరాజ్య సమితికి అమెరికా బకాయి పడింది : చైనా
X

బీజింగ్ :

కరోనా వైరస్ విషయంలో అమెరికా, చైనాల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. వైరస్ వ్యాప్తి విషయంలో నిర్లక్ష్యం వహించిందని పదే పదే అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించడంతో పాటు చైనాపై ఆంక్షలు కూడా విధించారు. దీంతో చైనా కూడా అమెరికాపై విరుచుకపడుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు తాము నిధులు తక్కువగా ఇస్తున్నామని ఆరోపిస్తున్న అమెరికాను నిలువరించడానికి ఐక్యరాజ్య సమితికి చెల్లించాల్సిన బకాయిలను గుర్తు చేస్తోంది. ఐక్యరాజ్య సమితికి పలు దేశాలు బకాయి పడిన విషయాన్ని చెబుతూనే.. అమెరికా 2 బిలియన్ డాలర్ల మేర చెల్లించాల్సి ఉందని ఒక ప్రకటన విడుదల చేసింది. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం ఈ ఏడాది మే 14 నాటికి సాధారణ బడ్జెట్ 1.63 బిలియన్ డాలర్లు, శాంతి స్థాపన కార్యక్రమానికి సంబంధించి 1.63 బిలియన్ డాలర్లు మొత్తం కలిపి అమెరికా 2.14 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉందని ప్రకటనలో పేర్కొంది. ఐక్యరాజ్యసమితికి ఇప్పటి వరకు అత్యధికంగా బకాయి పడిన దేశం అమెరికానే అని చైనా చెబుతోంది. వాస్తవానికి ఐక్యరాజ్యసమితి బడ్జెట్‌లో 22 శాతం నిధుల్ని అమెరికానే సమకూరుస్తోంది. ఏడాదికి 3 బిలియన్ డాలర్ల వరకు యూఎన్‌కు అందిస్తోంది. అమెరికా అధికారిక లెక్కల ప్రకారం 27.89 శాతం నిధుల్ని ఐక్యరాజ్యసమితికి చెల్లించాల్సి ఉంది. కానీ, ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ నిధులను 25 శాతానికి కుదిస్తూ చట్టం చేశారు. ఇప్పుడు ఆ లెక్కలనే చైనా ప్రస్తావిస్తోంది. కాగా, చైనా ఆరోపణలను అమెరికా ఖండించింది. కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో ప్రశ్నిస్తున్నందుకే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తోందని అంటోంది. అమెరికా చట్ట సభల్లో నిర్ణయించిన మేరకు 25 శాతం నిధులనే చెల్లిస్తామని.. గతంలో చెల్లించిన వాటితో పోల్చి బకాయిలు ఉన్నారనడం చైనా దిగజారుడుతనమేనని అమెరికా తీవ్రంగా మండిపడింది. మరోవైపు అమెరికా తర్వాత ఐక్యరాజ్యసమితికి అత్యధిక నిధులు సమకూర్చేది చైనానే కావడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed