- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘పీఆర్సీ ఓకే.. పాత బకాయిలు వెంటనే చెల్లించండి’
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని, దీనిపై వెంటనే జీవోలను జారీ చేయాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్అధ్యక్షుడు, ఐక్య వేదిక ప్రతినిధి చిలగాని సంపత్ కుమారస్వామి డిమాండ్ చేశారు. టీఏఈ కార్యాలయంలో సోమవారం ఐక్య వేదిక అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంపత్ కుమారస్వామి మాట్లాడుతూ.. రెండున్నరేండ్లుగా తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్, ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన నిరంతర పోరాటాల ఫలితమే పీఆర్సీ ప్రకటన అని అభివర్ణించారు. ఉద్యోగ ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయసు 61 సంవత్సరాలకు పెంపు, పదోన్నతులు, ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల పోస్టుల మంజూరు, పెన్షనర్లకు 70 ఏళ్ళకే 15 శాతం క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పెంపు, కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాల పెంపు, కేజీబీవీల్లో మహిళా ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవుల వర్తింపు అంశాలను పూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు.
అయితే, పీఆర్సీని జూలై 2018 నుంచే అమలు చేయాలని ఈ సందర్భంగా చిలగాని సంపత్ కుమారస్వామి డిమాండ్‌చేశారు. ఇంటి అద్దె అలవెన్సు (హెచ్ఆర్ఏ)ను ప్రస్తుతం ఉన్న శ్లాబులనే కొనసాగించాలని, 12 నెలల బకాయిలను రిటైర్మెంట్ సందర్భంలో ఇస్తామనడం విచారకరమన్నారు. పీఆర్సీ బకాయిలను విడతల వారీగా అయినా సరే.. వెంట వెంటనే ఇవ్వాలని, ఉద్యోగులకు ప్రతి ఐదేండ్లకోసారి వేతనాలు సవరించటం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని గుర్తు చేశారు. కానీ, 33 నెలలు ఆలస్యం చేసి, దాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవటం, కొన్ని సంఘాలు, కొందరు నేతల పేర్లనే అసెంబ్లీలో ప్రస్తావించటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని సంపత్‌కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయం(2001)లో కేసీఆర్ సూచనలతోనే స్థాపించిన తెలంగాణ అసోసియేషన్, ఇతర సంఘాల పాత్రను ప్రభుత్వం విస్మరించడం చాలా బాధాకరమన్నారు.
వారితో సమానంగా ఇవ్వాలి..
రిటైర్మెంట్ గ్రాట్యుటీని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రూ. 20 లక్షలకు పెంచాలని, 7.5 శాతం ఫిట్‌మెంట్‌తో రూపొందించిన పేస్కేల్స్‌ను నూతన ఫిట్‌మెంట్‌కు అనుగుణంగా రివైజ్ చేయాలని చెప్పారు. కేజీబీవీ, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం బేసిక్ పే చెల్లించాలని, సీపీఎస్‌ను కూడా రద్దు చేయాలన్నారు. ఉద్యోగుల నియామక ప్రక్రియ ముందుగానే పూర్తి చేసి, 2004 సెప్టెంబర్‌తర్వాత నియామకమైన ఉద్యోగులకు పాత పెన్షన్ వర్తింపజేయాలని, అంతేకాకుండా, రాష్ట్రంలోని జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ ప్రస్తుతం ఉన్న మూడేండ్ల ప్రొబేషనరీ కాలాన్ని రెండేండ్లకు తగ్గిస్తూ వారి సర్వీసులను రెగ్యులర్చేయాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయసు 61 సంవత్సరాలకు పెంపును ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని ఈ సందర్భంగా కోరారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటనలకు అనుగుణంగా అన్ని అంశాలపై జీవోలు జారీ చేయాలని చిలగాని సంపత్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీఈఏ ప్రధాన కార్యదర్శి డా. పి పురుషోత్తం, మహిళా అధ్యక్షురాలు నిర్మల, బలాస్వామి, ఆనంద్ యాదవ్‌తో పాటు ఐక్య వేదిక ప్రతినిధులు పాల్గొన్నారు.