చెన్నై సూపర్ కింగ్స్‌కు దెబ్బ మీద దెబ్బ

by Anukaran |
చెన్నై సూపర్ కింగ్స్‌కు దెబ్బ మీద దెబ్బ
X

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)మరో 20రోజుల్లో ప్రారంభం కానుండటంతో ఆనందంలో ఉన్న క్రికెట్ అభిమానులకు తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మూడుసార్లు చాంపియన్, ఈ ఏడాది ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులో జరుగుతున్న పరిణామాలు ఐపీఎల్‌ (IPL)ను ఇబ్బందుల్లో పడేశాయి.

మరికొన్ని రోజుల్లో జట్లన్నీ బయో బబుల్‌లో ప్రవేశించాల్సిన వేళ సీఎస్కే (CSK) ఆటగాళ్లు, సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, స్టార్ ప్లేయర్ సురేశ్ రైనా ఈ సీజన్ మొత్తానికీ ఐపీఎల్ నుంచి తప్పుకోవడం పెద్ద ఎదురు దెబ్బ. సీఎస్కేలో (CSK) కరోనా వైరస్ కలకలం సృష్టించడంతో శనివారం విడుదల చేయాలని భావించిన ఐపీఎల్ (IPL) షెడ్యూల్‌ను కూడా బీసీసీఐ (BCCI)వాయిదా వేసింది. సీఎస్కే నుంచి పూర్తి వివరాలు తెప్పించుకున్న అనంతరం షెడ్యూల్ (Schedule) ప్రకటించాలని బోర్డు భావిస్తున్నది.

కరోనా బారిన చాహర్, రుతురాజ్:

దుబాయ్ చేరుకున్న తర్వాత ఆరో రోజు జరిపిన ఆర్టీపీసీఆర్ టెస్టులో సీఎస్కే (CSK) బౌలర్ దీపక్ చాహర్, యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్‌లకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీపక్ చాహర్ గత రెండు సీజన్లలో సీఎస్కే జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అతడి ఐపీఎల్ (IPL)ప్రదర్శన అనంతరం టీం ఇండియా జట్టులో చోటు కూడా సంపాదించాడు.

ఇక గత సీజన్‌లోనే సీఎస్కే (CSK)కు ఎంపికైన గైక్వాడ్, మహారాష్ట్ర తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ (First class cricket)ఆడుతుంటాడు. వీరిద్దరే కాకుండా కొంతమంది సహాయక సిబ్బందితోపాటు సీఈవో కాశీ విశ్వనాథన్‌తోపాటు వచ్చిన కుటుంబ సభ్యుడికి కూడా వైరస్ సోకినట్లు సమాచారం. సీఎస్కే తరఫున 50మందికి పైగా దుబాయ్ రాగా, వారిలో 13మంది కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తున్నది. ప్రస్తుతం వీళ్లందరూ వైద్యుల సూచన మేరకు ఐసోలేషన్‌ (Isolation)లో ఉన్నారని, ఎవరి పరిస్థితి కూడా ఆందోళనగా లేదని తెలుస్తున్నది.

ఇండియా వచ్చేసిన రైనా..

ఒకవైపు సీఎస్కేను కరోనా ఇబ్బంది పెడుతుండగా, స్టార్ ప్లేయర్ (Star player) సురేశ్ రైనా వ్యక్తిగత కారణాలతో జట్టును వదిలేసి ఇండియా వచ్చాడు. ఒక జాతీయ మీడియా కథనం ప్రకారం.. రైనా అత్త, మామయ్య కుటుంబంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. పఠాన్‌కోట్ సమీపంలోని థరియాల్ గ్రామంలో ఆగస్టు 19న వారిపై మారణాయుధాలతో దాడి జరిగింది.

ఈ ఘటనలో రైనా అత్త ఆశాదేవి (రైనా తండ్రికి సోదరి) తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక మామయ్య అశోక్ కుమార్ (58) అక్కడికక్కడే మరణించారు. వీరి కుమారులు, అశోక్ తల్లి కూడా తీవ్ర గాయాలపాలయ్యారు. విషయం తెలుసుకున్న రైనా ఇండియా వచ్చినట్లు సమాచారం. కాగా, ఈ క్లిష్ట పరిస్థితుల్లో రైనాకు తమ పూర్తి సహకారం అందిస్తామని చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

తలపట్టుకున్న బీసీసీఐ

ఇప్పటికే యూఏఈలోని నగరాల మధ్య ఉన్న కొవిడ్-19 (Kovid-19) ఆంక్షల వల్ల షెడ్యూల్ ప్రకటించడం ఆలస్యమైంది. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (Emirates Cricket Board) చైర్మన్‌తో కలిసి శుక్రవారమే సమస్యను పరిష్కరించింది. శనివారం పూర్తి స్థాయి షెడ్యూల్ ప్రకటించాలని సిద్ధపడింది. చెన్నై, ముంబై మధ్య ఓపెనింగ్ మ్యాచ్ ఏర్పాటు చేయాలని కూడా భావించింది.

గతంలో ముంబై ఇండియన్స్ (Mumbai Indians)కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తొలి మ్యాచ్ సీఎస్కేతో అని ప్రకటించాడు. కానీ, ప్రస్తుత పరిణామాలతో సీఎస్కే జట్టు కోలుకోవడానికి మరింత సమయం ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. వీరి మ్యాచ్‌లను ఆలస్యంగా ప్రారంభించాలని అనుకుంటోంది.
ఇందుకు అనుగుణంగా సీఎస్కే మ్యాచ్‌ల షెడ్యూల్ వెనక్కు మార్చి కొత్త షెడ్యూల్ (Schedule) రూపొందిస్తున్నది. రానున్న రోజుల్లో ఇతర ఆటగాళ్లు కరోనా బారిన పడకుండా ఆయా ఫ్రాంచైజీలను కఠినంగా నిబంధనలు అమలు చేయాలని హెచ్చరించింది. కొత్త షెడ్యూల్ ఆది లేదా సోమవారాల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

Advertisement

Next Story