నైట్ కర్ఫ్యూ ఎఫెక్ట్.. కంపెనీలలో డ్యూటీల్లో మార్పు

by Shyam |
Night curfew in Telangana
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. ఈ నిర్ణయంతో కంపెనీలపై స్వల్పంగా ఎఫెక్ట్ పడింది. ఇప్పటి వరకు స్టీల్, ఎలక్ట్రానిక్, తదితర కంపెనీల్లో ఉద్యోగ, కార్మికులు మూడు షిప్టులలో పనిచేస్తున్నారు. అయితే నైట్ కర్ఫ్యూతో వారి పనివేళల్లో మార్పులు చేయనున్నారు. ఉద్యోగులు, కార్మికులకు పోలీసుల నుంచి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆయా యాజమాన్యాలు పోలీసుశాఖ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాయి.

తెలంగాణ ప్రత్యేక రాష్ర్టం ఏర్పడిన తర్వాత టీఎస్ ఐపాస్ 15,456 పరిశ్రమలను స్థాపించారు. అంతకు ముందు మరో10 వేలకు పైగా పరిశ్రమలు ఉన్నాయి. కరోనా నేపథ్యంలో గత ఏడాది నుంచి ఐటీ కంపెనీల ఉద్యోగులు ‘వర్క్‌ఫ్రం హోం’ చేస్తున్నారు. అయితే ప్యాకింగ్, స్టీల్, యంత్ర పరిశ్రమలు, ఫుడ్, మూడి సరుకుల తయారీ పరిశ్రమలతో పాటు పలు పరిశ్రమల్లో కార్మికులు, ఉద్యోగులు కంపెనీలకు వెళ్లి పనులు చేస్తున్నారు. అయితే రాష్ర్ట ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించడంతో కంపెనీలు ఉద్యోగులు పనిచేసే వేళల్లో మార్పులు చేస్తున్నారు. ఈ కర్ఫ్యూతో కంపెనీలకు ఎలాంటి ఆర్థిక, ఉత్పత్తిపై ప్రభావం పడకపోయినప్పటికీ కేవలం కార్మికులు పనిచేసే వేళలు మాత్రమే మారుతున్నాయి. అయితే రెండు షిప్టులు నిర్వహించే పరిశ్రమలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని, మూడు షిప్టులలో పనిచేసే వారు కేవలం 20 నుంచి 25 శాతం మాత్రమే ఉంటారని వీరిపైనే కొంత ప్రభావం పడుతుందని పలు పరిశ్రమ యూనియన్ల నేతలు పేర్కొంటున్నారు.

పోలీసుల అనుమతికి దరఖాస్తు..

మూడు షిప్టులు పనిచేసే పరిశ్రమలు కార్మిక, ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా పోలీసు శాఖ నుంచి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నాయని పరిశ్రమల యూనియన్ నేతలు తెలిపారు. కార్మికులకు ఐడీ కార్డులు అందజేస్తున్నారు. అదే విధంగా కంపెనీలు అథారిటీ లెటర్‌ను కూడా ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కార్మికుల నేతలు వ్యక్తం చేస్తున్నారు. గతేడాది నుంచి కరోనాతో కంపెనీలకు తీవ్ర నష్టం వాటిల్లిందని.. ఇప్పుడు ఆ ప్రభావం ఉండొద్దని.. రెవెన్యూ జనరేషన్ కోసం ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడం లేదు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో (సోషల్ రెస్పాన్స్‌తో) వ్యవహరిస్తే కరోనాను ఎదుర్కొవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మ్యాన్ ప్యాక్చరింగ్ పరిశ్రమలపై ప్రభావం ఉండదు

అనిల్ రెడ్డి, అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్లాస్టిక్ మ్యాన్ ఫ్యాక్చరింగ్ అసోసియేషన్

నైట్ కర్ప్యూతో మ్యాన్ ప్యాక్చరింగ్ పరిశ్రమలపై ఎలాంటి ప్రభావం పడదు. కంపెనీలు కూడా కరోనా నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి. గతేడాది కొంత మంది కార్మికులను పోలీసులు కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అవి పునరావృతం కాకుండా కంపెనీలు అథారిటీ లెటర్ తోపాటు కార్మికులకు ఐడీ కార్డులు ఇవ్వాలి. పోలీసుశాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. పండుగలు, శుభకార్యాయాల సీజన్ కాబట్టి పరిశ్రమలు ఎక్కువ ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా పరిశ్రమల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలి.

కార్మికుల పనివేళ్లల్లో మార్పు చేయాలి

కొండవీటి సుధీర్ రెడ్డి, అధ్యక్షుడు, తెలంగాణ ఇండస్ట్రీస్ ఫెడరేషన్

కార్మికుల పనివేళల్లో కంపెనీల యాజమాన్యాలు మార్పులు చేయాలి. కర్ప్యూ దృష్ట్యా కంపెనీలు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కార్మికులు కంపెనీలో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ముందస్తు షిప్టు వారిని గంట ముందుగా పంపిస్తే ఎలాంటి సమస్యలు రావు.

ప్రతి కార్మికుడికి గుర్తింపు కార్డు

సుజాత, సభ్యురాలు, ఎఫ్ఏపీసీసీఐ

మూడు షిప్టులలో కార్మికులతో పనిచేసే పరిశ్రమల యాజమాన్యాలు పని చేసే ప్రతి కార్మికుడికి గుర్తింపు కార్డు ఇవ్వాలి. పోలీసుల అనుమతి కూడా తీసుకుంటే రాత్రి వేళల్లో కార్మికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే విధంగా కార్మికులను దృష్టిలో ఉంచుకొని పనివేళలు కూడా మార్పు చేయాలి.

Advertisement

Next Story

Most Viewed